బేరసారాలు
సాక్షి, కడప : స్థానిక సమరం కీలక దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో అభ్యర్థులు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బేరసారాలు, ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాంతాలను బట్టి ఓటుకు రేటును నిర్ణయిస్తున్నారు.
మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి అంటూ గుంపగుత్తగా బేరం సాగిస్తున్నారు. మద్యంను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు చూపెట్టి గాలం వేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. సకల మర్యాదలతో మచ్చిక చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా అస్త్ర శస్త్రాలను సంధిస్తున్నారు. గెలువలేమనే ప్రాంతంలో కొన్నిచోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.
ఎన్నికలు జరిగే ప్రాంతాలివే!
మొదటి విడతలో మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లోని 29 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 326 ఎంపీటీసీ స్థానాలు, 29 జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఓటుకు రూ. 200 నుంచి రూ. 300 వరకు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులను బట్టి ఇంకా ఎక్కువ మొత్తాన్ని కొన్నిచోట్ల ఇస్తున్నారు.
రైల్వేకోడూరు మండలం మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై పరువు కోసం పాకులాడుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంలో ఓటు రూ. 300 నుంచి రూ. 500 పలుకుతోంది. బలహీనంగా ఉన్న మండలాల్లో ఓటుకు రూ. 1000 కూడా ఇచ్చి పరువు నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఇటీవల ఓ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన నేత స్థానిక ఎన్నికల్లో పట్టు నిలుపుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాదేమోనని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉనికి కోసం పాట్లు పడుతున్నారు.
ఓటుకు రూ. 500కు పైగా ఇస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో సైతం ఓటుకు రూ. 300 నుంచి రూ. 500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఓటు రూ. 1000-1500 పలుకుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మొదటి విడత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రజాబలంతో ముందుకు దూసుకు వెళుతుండగా, టీడీపీ కేవలం డబ్బు మీద ఆధారపడి ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.