Wedding expenses
-
తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది
పెళ్లి అంటే వధువు తల్లిదండ్రులకే అన్ని రకాలుగా భారం. కట్నం ఇవ్వాలి.. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి.. సంసారానికి కావాల్సిన సరంజామా సమకూర్చాలి. కానీ నేటి తరం భిన్నమైన మార్గంలో పయనిస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా లెండ్స్ సంస్థ యువత మనోగతం తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. 2018–19 సంవత్సరంలో యువతరం పెట్టుకున్న రుణాల దరఖాస్తుల్లో 20 శాతం వారి పెళ్లి కోసమేనని వెల్లడైంది. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం లాంటి పెళ్లి ఖర్చును తమ సొంత డబ్బుతోనే చేసుకోవాలన్న ఆలోచన నేటి తరంలో పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఇక యువతీ యువకుల్లో ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్న కోరిక బాగా ఉంది. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రయాణాల కోసమే 70 శాతం దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ విద్యా రుణాలు, సొంతంగా కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లో 25–30 ఏళ్ల వయసు మధ్యనున్న వారు దేని కోసం రుణాలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. ‘ఈ తరం పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకుంటున్నారు. తమ పెళ్లి కోసం రుణాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. అమ్మాయి తల్లిదండ్రులే అన్నీ చేయాలన్న ధోరణిలో బాగా మార్పు వస్తోంది’అని ఇండియాలెండ్స్ సంస్థ సీఈవో రవ్ చోప్రా చెప్పారు. ముంబైలో అత్యధికంగా 22 శాతం పెళ్లి కోసం రుణాలు తీసుకుంటే.. హైదరాబాదీల్లో 20 శాతం మంది ప్రయాణాల కోసమే లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట. -
కులాంతరంవైపే యువతరం
భారతీయ యువతరంలో టెక్నాలజీ చైతన్యం నింపుతోందా? ఇందుకు అవుననే సమాధానమిస్తోంది ఢిల్లీ కేంద్రంగా ‘‘పల్స్ ఆఫ్ ద నేషన్’’పేరుతో జరిగిన తాజా అధ్యయనం. ఇన్‌షార్ట్స్ అనే న్యూస్ యాప్ ద్వారా జరిపిన ఈ సర్వేలో 18 నుంచి 35 ఏళ్లలోపు 1,30,000 మంది పాల్గొంటే అందులో 70 శాతం మంది కులాంతర వివాహాలకు సుముఖంగా ఉన్నట్టు తేలింది. అలాగే పెళ్లయ్యాక మహిళలు తమ ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా 70 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. పెళ్లి ఖర్చులు వధువు తరఫు వారే భరించాలన్న సనాతన భావజాలానికి భిన్నంగా సర్వేలో పాల్గొన్న పురుషులు స్పందించారు. వారిలో 90 శాతం మంది పెళ్లి ఖర్చులను పంచుకుంటామని చెప్పడం భారతీయ యువతరంలో చైతన్యానికి ఉదాహరణగా సర్వే సంస్థ అభిప్రాయపడింది. దాదాపు 84 శాతం మంది మహిళలు తమ భర్తలు తమకన్నా తక్కువ ఆదాయం ఉన్నా అదేం పట్టించుకోబోమని పేర్కొన్నారు. 7 శాతం మంది పురుషులు మాత్రం తమకన్నా తమ భార్యలకు ఎక్కువ ఆదాయం ఉండటం అభ్యంతరకరమన్నారు. పెళ్లిళ్లు, ఒకే కులం వారిని వివాహం చేసుకోవడం, భార్యలు నిర్వహించాల్సిన పాత్రలు, ఆస్తి హక్కు వంటి విషయాలపై భారతీయుల్లో కనిపించే సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా యువతరం స్పందించడం గమనార్హం. -
నోట్లు.. పాట్లు..
పరిగి: ఈ చిత్రంలో నిల్చుని వినయంగా వేడుకుంటున్న వ్యక్తి పేరు శంకర్. సొంతూరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహి ద్‌పూర్ అనుబంధ దాశ్యనాయక్ తండా. శంకర్ సోదరుడు బాల్‌రాజ్ వివాహం శుక్రవారం జరగనుంది. పెళ్లి ఖర్చుల కోసం రూ.లక్ష సిద్ధం చేసుకుని ఇంట్లో దాచుకున్నారు. ఇంతలో రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏం చేయాలో పాలుపో లేదు. గురువారం ఇదిగో ఇలా పరిగి ఎస్బీహెచ్ (ఏడీబీ)కి వచ్చాడు. బ్యాంకు మేనేజర్‌ను కలసి రూ.లక్ష డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. నిబంధనలు దాటి తాను ఏమీ చేయలేనని..డిపాజిట్ చేసుకుని రూ.4 వేలు మాత్రమే ఇవ్వగలనని బ్యాంకు మేనేజర్ ఫకీరయ్య సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదిలేక శంకర్ ఇంటిముఖం పట్టాడు. -
‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు ఇలా..
నిర్మల్ అర్బన్ : పెళ్లి వేడుకలు నేడు ఖరీదయ్యాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వ్యయాలు పెరిగిపోయాయి. ఫంక్షన్ హాళ్లు, కార్డుల పంపిణీ, బట్టల కొనుగోలు, సామగ్రి, నిత్యావసర సరుకులు.. ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలు వివాహ ఖర్చులకు అప్పుల పాలయ్యేవారు. మరి కొందరు ఆర్థిక భారాన్ని భరించే స్థోమత లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల వివాహానికి ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇది కాస్తా ఊరటనివ్వడంతో పాటు కొందరికి వరంగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ‘కల్యాణలక్ష్మి’ పథకం ద్వారా లబ్ధి పొందే వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దాని ప్రతిని సమీపంలోని సాంఘిక సంక్షే మ శాఖ కార్యాలయంలో అందజే యాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలతో పాటు వధువుకు సంబంధించిన కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, మొదటి వివాహంగా వీఆర్వో, గజిటెడ్ అధికారులతో వేర్వేరుగా ధ్రువీకరించిన పత్రాలు, అబ్బాయికి సంబంధించిన ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తదితర పూర్తి వివరాల జిరాక్స్ ప్రతులతో దరఖాస్తులు అందజేయాలి. అలాగే వెడ్డింగ్ కార్డును జతపరిచి పెళ్లికి ముందే అధికారులకు అప్పగించాలి. రూ.2లక్షల వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు తమ పెళ్లి ఫొటో, పెళ్లి పత్రికను దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. పరిశీలన పూర్తయిన వెంటనే మంజూరు.. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు దరఖాస్తులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పూర్తి పరిశీలన చేపడతారు. అందించిన వివరాలు సరియైనవో.. కాదో.. తేల్చుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి నిధులు మంజూరవుతాయి. నేరుగా రూ.51 వేలు వధువు బ్యాంక్ అకౌంట్లో జమవుతాయి. ఈ పథకం అమలుకు నిధుల కొరత ఏమీ లేదని.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు సుమారు రూ.6 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. అవగాహన కల్పిస్తే మేలు.. పేద, నిరుపేదలైన దళితుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఎవరికి దరఖాస్తులు అందించాలో.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయడంతో అవి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరడానికి, దరఖాస్తుల పరిశీలనకు తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది నిరక్ష్యరాస్యులుండడం, దరఖాస్తులను ఆన్లైన్లో అందించలేక పోవడం, ఏయే పత్రాలు జతపర్చాలన్న విషయాలు తెలియకపోవడంతో పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నారుు. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే అధికారులు దళితులను మరింత చైతన్యపరచాల్సిన అవసరముందని పలువురు పేర్కొంటున్నారు. 51 దరఖాస్తులు అందాయి - మహ్మద్ అబ్దుల్ అలీం, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, నిర్మల్ ఇప్పటివరకు 51 దరఖాస్తులు అందగా 38 పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన వాటికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి మరికొన్ని వివరాలు, పత్రాలు అందాల్సి ఉంది. అవి అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.అన్ని పత్రాలు అందజేసిన వారికి ఇప్పటికే ఆర్థికసాయం మంజూరైంది. -
మా పెళ్లికి రండి... ఖర్చులు చెల్లించండి!
ధోరణి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడొక చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. మామూలుగానైతే, శుభలేఖలో ‘అందరికీ ఆహ్వానం’ ‘మీ రాక మాకు సంతోషకరం’ ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం... ఇలాంటి వాక్యాలతో పాటు- ‘పెళ్లి ఖర్చులకు మీ వంతుగా సహకారం అందించండి’ ‘హనీమూన్ ఖర్చులకు సహాయం అందించండి’ లాంటి వాక్యాలకు తోడు బ్యాంకు ఎకౌంట్ నంబర్ కూడా ఇస్తున్నారు. విశేషమేమిటంటే, ఇలాంటి పెళ్లిళ్లకు ఎవరూ ముఖం చాటేయడం లేదు. తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. శుభలేఖలో వినోదం ఖర్చులు సమర్పించిన వారు, విందు ఖర్చులు సమర్పించినవారు, బ్యాండు ఖర్చులు సమర్పించినవారు లాంటి కొత్త మాటలు కనిపిస్తున్నాయి. శుభలేఖలో ప్రచురించే ఖర్చుల జాబితాలో తమ పేరును చూసుకోవడానికి చాలామంది తాపత్రయపడుతున్నారు. ‘‘ఇది ఖర్చు అనుకోవడం లేదు. నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను’’ అంటున్నాడు లెమన్స్ (ఫ్రాన్స్) పట్టణానికి చెంది మైఖేల్ అనే ఉద్యోగి. తన మిత్రుడి పెళ్లికి అయిన విందు ఖర్చును తానే భరించాడు. ఇటీవలే లండన్‌లో పెళ్లి చేసుకున్న జంట కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. పెళ్లి ఖర్చులు పోను అదనంగా కొంత డబ్బు మిగిలింది. ఆ మొత్తాన్ని ఒక అనాథాశ్రమానికి ఇచ్చారు. ఈ పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందిన వారు రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు. పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుంటున్న అయిదుగురిలో నలుగురు ఈ ధోరణినే అనుసరిస్తున్నారు. పెళ్లికి అవసరమైన ఖర్చులు భరించగలిగే స్థోమత ఉన్నప్పటికీ, ప్రముఖుల పెళ్లిళ్ల మాదిరిగా ఆడంబరంగా జరుపుకోవాలనుకునే వారు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘‘ఈ విధానం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు’’ అంటున్నాడు చార్లెట్ అనే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్. పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందినవారే రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు.