పెళ్లి అంటే వధువు తల్లిదండ్రులకే అన్ని రకాలుగా భారం. కట్నం ఇవ్వాలి.. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి.. సంసారానికి కావాల్సిన సరంజామా సమకూర్చాలి. కానీ నేటి తరం భిన్నమైన మార్గంలో పయనిస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా లెండ్స్ సంస్థ యువత మనోగతం తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. 2018–19 సంవత్సరంలో యువతరం పెట్టుకున్న రుణాల దరఖాస్తుల్లో 20 శాతం వారి పెళ్లి కోసమేనని వెల్లడైంది. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం లాంటి పెళ్లి ఖర్చును తమ సొంత డబ్బుతోనే చేసుకోవాలన్న ఆలోచన నేటి తరంలో పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఇక యువతీ యువకుల్లో ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్న కోరిక బాగా ఉంది.
రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రయాణాల కోసమే 70 శాతం దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ విద్యా రుణాలు, సొంతంగా కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లో 25–30 ఏళ్ల వయసు మధ్యనున్న వారు దేని కోసం రుణాలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. ‘ఈ తరం పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకుంటున్నారు. తమ పెళ్లి కోసం రుణాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. అమ్మాయి తల్లిదండ్రులే అన్నీ చేయాలన్న ధోరణిలో బాగా మార్పు వస్తోంది’అని ఇండియాలెండ్స్ సంస్థ సీఈవో రవ్ చోప్రా చెప్పారు. ముంబైలో అత్యధికంగా 22 శాతం పెళ్లి కోసం రుణాలు తీసుకుంటే.. హైదరాబాదీల్లో 20 శాతం మంది ప్రయాణాల కోసమే లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట.
తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది
Published Sun, Aug 11 2019 2:05 AM | Last Updated on Sun, Aug 11 2019 2:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment