కల్యాణం క‘మనీ’యం | People do not hold back on wedding expenses | Sakshi
Sakshi News home page

కల్యాణం క‘మనీ’యం

Published Sun, Feb 9 2025 3:55 AM | Last Updated on Sun, Feb 9 2025 5:34 AM

People do not hold back on wedding expenses

వివాహ వేడుకల వ్యయాల్లో వెనక్కి తగ్గని జనం

రూ.32 లక్షలు దాటిపోయిన సగటు వివాహ ఖర్చు  

ఏటా 14 శాతం మేర పెరిగిపోతున్న తీరు 

రూ.10.9 లక్షల కోట్లకు చేరిన వెడ్డింగ్‌ పరిశ్రమ 

దేశంలో ఫుడ్‌–గ్రోసరీ ఇండస్ట్రీ తర్వాత ఇదే అత్యధికం 

తక్కువ ఖర్చుతో పెళ్లిని ముగిస్తున్నవారూ పెరుగుతున్న వైనం

ప్రాచుర్యంలోకి వీకెండ్‌ వెడ్డింగ్స్‌

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఇప్పుడీ రెండూ బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ముఖ్యంగా పెళ్లి ఖర్చులు తడిసి మోపెడై చుక్కలు తాకుతున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లని, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లని ఎవరూ, ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఈ మధ్య జరిగిన కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ వివాహానికి ఏకంగా రూ.5,000 కోట్లు ఖర్చయిందని అంచనా. బడా వ్యాపారవేత్తల పెళ్లిళ్ల భారీ ఖర్చుల విషయాన్ని అలా ఉంచితే.. మామూలు జనం కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో సగటు వివాహ ఖర్చు ఏకంగా రూ.32 లక్షలు దాటిపోయింది.

దేశంలో వివాహ వేడుకల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. జీవితకాల జ్ఞాపకం కోసం ఖర్చుకు వెనుకాడొద్దనే ధోరణి పెరుగుతోంది. దీంతో సగటు వివాహ వేడుకల ఖర్చు 2023లో రూ.28 లక్షలుగా ఉంటే.. గతేడాది 14 శాతం పెరిగి రూ.32 లక్షల నుంచి రూ.35 లక్షలకు చేరినట్టు వెడ్డింగ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫాం వెడ్డింగ్‌ వైర్‌ ఇండియా నివేదిక చెబుతోంది. దీని ప్రకారం.. 2022–2024 మధ్య కాలంలో పెళ్లి ఖర్చు ఏకంగా 28 శాతం పెరిగింది.

2023–24లో వివాహ వేడుకల పరిశ్రమ సుమారు రూ.10.9 లక్షల కోట్లు దాటిపోయినట్టు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్‌ అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు అతిథుల విషయంలోనూ పెళ్లివారి ధోరణి మారుతోంది. భారీగా 300 మందికిపైగా అతిథులతో జరుపుకొనే వివాహాల సంఖ్య గతేడాది 16 శాతం పెరిగింది. అదే సమయంలో తక్కువ మందితో 100 మందిలోపు అతిథులతో జరుపుకొనే పెళ్లిళ్లు 27 శాతం పెరిగాయి. మొత్తమ్మీద పెళ్లిళ్లకు సగటున గెస్ట్‌ లిస్ట్‌ 119గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

కొత్త డెస్టినేషన్లపై మక్కువ..
లగ్జరీ విషయంలో రాజీ పడకుండా, మరీ ఎక్కువ మందితో గందరగోళం తలెత్తకుండా కాస్తంత ప్రైవసీ కోరుకుంటున్నవారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో దేశీయంగా కొత్త డెస్టినేషన్లు తెరపైకి వస్తున్నాయి. హడావుడిగా ఉండే సాధారణ వెడ్డింగ్‌ స్పాట్లతో పోలిస్తే ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రాంతాల వైపు మొగ్గుచూపే వారు పెరుగుతున్నారు. 

సాధారణంగా జైపూర్, గోవా, ఉదయ్‌పూర్‌ వంటి ప్రాంతాల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. మరిన్ని కొత్త ప్రాంతాలూ వెడ్డింగ్‌ డెస్టినేషన్లుగా తెరపైకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, డెహ్రాడూన్‌.. కేరళలోని వయనాడ్‌ వంటి ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది.

కొత్త కాన్సెప్టులతో.. ఖర్చు తగ్గించుకునేలా.. 
భారీ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడమే కాదు.. ఖర్చును బాగా తగ్గించుకో­వాలనుకునే వారూ ఉంటున్నారు. దీంతో వీక్‌ డే వెడ్డింగ్‌లనే కాన్సెప్టులూ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆదివారాలు, సెలవు రోజులైతే పొలోమంటూ అందరూ వచ్చేసి, ఖర్చులు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఆఫీసులు ఉండే రోజుల్లో పెళ్లిళ్లను ఫిక్స్‌ చేసుకుంటున్నారు కొందరు. ఇందుకోసం సోమవారం, మంగళవారాలు పాపులర్‌ చాయిస్‌గా ఉంటు­న్నాయి. వీకెండ్‌ వెడ్డింగ్‌లతో పోలిస్తే ఇవి తక్కువ ఖర్చులో అయిపోతున్నాయి.

నవంబర్‌ టు మార్చ్‌.. కోటి పెళ్లిళ్లు..
సీజన్లపరంగా చూస్తే శీతాకాలంలో పెళ్లికి మొగ్గు చూపే వారు ఎక్కువగా ఉంటున్నారు. మంచి ముహుర్తాలు ఉండటంతో నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరిపై ఆసక్తి ఉంటోంది. 2024లో జరిగిన పెళ్లిళ్లలో 18.5 శాతం ఒక్క నవంబర్‌లోనే జరిగాయి. మొత్తమ్మీద నవంబర్‌–మార్చి మధ్య ఏటా కోటిపైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. 

ఆలిండియా ట్రేడర్ల సమాఖ్య గణాంకాల ప్రకారం.. 2023లో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలున్న 23 రోజుల్లో ఏకంగా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అలాంటిది గతేడాది నవంబర్‌–డిసెంబర్‌ వెడ్డింగ్‌ సీజన్‌లో 35లక్షల పెళ్లిళ్లు జరిగిన నేపథ్యంలో.. రెండు నెలల వ్యవధిలోనే ఇంతకుమించి బిజినెస్‌ జరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

స్టాక్‌ మార్కెట్లో పెళ్లి సందడి..
వివాహాల సంబంధ థీమ్‌తో లాభపడే స్టాక్స్‌ కూడా కొన్ని ఉన్నా­యని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వెడ్డింగ్‌ ప్లానింగ్, కేటరింగ్, ఫొటోగ్రఫీ, జ్యుయలరీ.. ఇలా పెళ్లిళ్లకు సంబంధించి వివిధ రకాల సర్వీసులు అందించే కంపెనీల షేర్లలోనూ సందర్భానుసారం పెట్టుబడులు పెట్టి లాభాలు గడించవచ్చని పేర్కొంటున్నారు. వేదాంత ఫ్యాషన్స్, కల్యాణ్‌ జ్యువెలర్స్, ఇండియన్‌ హోటల్స్, టైటాన్‌ తదితర స్టాక్స్‌ ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నారు.

ఆహారం తర్వాత పెళ్లిళ్ల ఖర్చే ఎక్కువ..
దేశంలో ఫుడ్‌–గ్రోసరీ ఇండస్ట్రీ తర్వాత అత్యధికంగా పెళ్లిళ్ల పరిశ్రమ విలువే అత్యధికమని జెఫరీస్‌ అధ్యయనంలో 
తేలింది. ఆ వ్యయాల విలువను చూస్తే...

పరిశ్రమ               విలువ (రూ.లక్షల కోట్లలో)
ఫుడ్‌–గ్రోసరీ                   56.9
పెళ్లిళ్లు                         10.9
వస్త్రాలు, యాక్సెసరీస్‌        7
జ్యువెలరీ                        6.5
ఫర్నీచర్, హోం                3.5
కన్సూమర్‌ పరికరాలు      3.2
మొబైల్‌ ఫోన్లు               2.7
హెల్త్, బ్యూటీ కేర్‌            2.7
ఫుట్‌ వేర్‌                      0.9 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement