ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి టైమ్స్ నౌ వెలువరించిన సర్వే ఫలితాలు రెండు రాష్ట్రాలలోని విపక్షాలకు శరాఘాతమే అని చెప్పాలి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వే వివరాలు అత్యంత సంతోషాన్ని ఇస్తాయి. అదే టైమ్ లో విపక్షాలైన తెలుగుదేశం, జనసేనలకు తీవ్ర నిరాశ కలిగిస్తాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌కు మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు ఈ సర్వే చేదు గుళికే అని చెప్పాలి. ఏపీ విషయానికి వస్తే ఇటీవలికాలంలో వచ్చిన సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిక్యతను తెలియచేస్తూనే ఉన్నాయి. కాకపోతే ఒక సీటు అటు,ఇటుగా ఆయా సర్వేలు చెబుతున్నాయి తప్ప, వాటన్నింటి సారాంశం వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమనే!.
లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో మొత్తం 25 లోక్ సభ సీట్లు YSRCP గెలవవచ్చని, లేదా ఒకటేమైనా TDP గెలిస్తే గెలవవచ్చు..లేదంటే అది కూడా ఆ పార్టీకి దక్కకపోవచ్చని తేల్చింది. ఈ పరిస్థితి గమనించే టీడీపీ, జనసేనలు కూటమి కట్టి వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయిన తర్వాత సానుభూతి వస్తుందని అనుకుంటే.. అది రాకపోగా ఉన్న మూడు లోక్ సభ సీట్లు కూడా పోయే అవకాశం ఉందని సర్వే వెల్లడిస్తోంది. ఈ నేపధ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచుగా ఒక మాట అంటుంటారు. టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీచేస్తే గెలిచే పరిస్థితి లేదని తన సభలలో చెబుతుంటారు. ఈ సర్వేని విశ్లేషిస్తే చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం క్యాడర్ బాగా డీ మోరలైజ్ అయిందని అర్ధం అవుతుంది. వారి అండ చూసుకుని తనైనా అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్‌కు కూడా ఇది షాక్ వంటిదే.
✍️తెలుగు దేశం పార్టీకి 36 శాతం, జనసేనకు పది శాతం మాత్రమే ఓట్లు వస్తాయని, వైఎస్సార్‌సీపీకి మాత్రం 51 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేశారు. అంటే వీరిద్దరూ కలిసినా ఐదు శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీ అధికంగా పొందుతుందన్నమాట. అందుకే ఎలాగొలా.. వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆయన మరో పిచ్చి ఆరోపణ చేశారు. పెడన వద్ద ఆయన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ అలజడి చేస్తుందని, వారు కత్తులు తీసుకువస్తే పట్టుకుని పోలీసులకు అప్పగించాలని పవన్ అన్నారట. ఇది పిచ్చికి పరాకాష్ట. ఏ రాజకీయ పార్టీ అయినా తాము సునాయాసంగా గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు అల్లర్లు కోరుకుంటుందా? పైగా అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉంటుంది.
కొద్ది రోజుల క్రితం కూడా పవన్ ఇలాంటి చెత్త ఆరోపణ చేశారు. కోనసీమలో వైఎస్సార్‌సీపీ రెండువేల మంది గూండాలను పంపించిందని, ఏభై మందిని చంపించాలని అనుకుందని ఒక అద్వాన్నపు ఆరోపణ చేశారు. నిజంగా ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పవన్ తరచుగా ఇలా మాట్లాడడం అనుమానాలకు దారి తీస్తుంది. జనసేన కార్యకర్తల ద్వారా ఏమైనా గొడవలు సృష్టించి వాటిని ప్రభుత్వంపై నెట్టాలని ఏమన్నా కుట్ర జరుగుతుందేమో అనే సందేహం వస్తుంది.
✍️కొంతకాలం క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద టీడీపీ తన కార్యకర్తలతో గొడవలు చేయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో ఏమైనా జనసేన ఆలోచిస్తుందేమో తెలియదు. ఎవరైనా అలాంటి సలహాను పవన్‌కు ఇస్తే.. దాని జోలికి వెళ్లకుండా ఉండడం ఆయనకే మంచిది. అవినీతి ఆరోపణలకు గురవుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును భుజాన వేసుకుని తిరుగుతున్న పవన్‌కు సహజంగానే వ్యతిరేకత వస్తుంది. జనసేన నేతలలో కూడా దీనిపై కొంత అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఆ సంగతులు ఎలా ఉన్నా.. తాజాగా వచ్చిన సర్వే పవన్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
✍️తెలంగాణలో తిరిగి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెబుతోంది. లోక్ సభ ఎన్నికలలో తొమ్మిది నుంచి పదకుండు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ చెబుతోంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కూడా బీఆర్‌ఎస్‌కు తొమ్మిది, బీజేపీకి నాలుగు, కాంగ్రెస్కు మూడు, ఎంఐఎంకు ఒక స్థానం దక్కాయి. 2024 ఎన్నికలలో కూడా అదే తరహాలో ఫలితాలు ఉండవచ్చని, బీఆర్ఎస్కు ఒకటి, రెండు సీట్లు అదనంగా వచ్చినా రావచ్చని అంచనా వేసింది. సహజంగానే ఈ లెక్కల ప్రకారం అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ గెలవవచ్చన్న అభిప్రాయం కలుగుతోంది.
✍️శాసనసభ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలలో గెలిచి తిరిగి అధికారం చేపడితే లోక్ సభ ఎన్నికలలో తొమ్మిది నుంచి పదకొండు సీట్లు గెలవడం కష్టం కాకపోవచ్చు. కాగా ఎలాగైనా ఈసారి అధికారం పొందాలని ఆశిస్తున్న కాంగ్రెస్ కు ఈ సర్వే అసంతృప్తి కలిగిస్తుంది. బీజేపీ గ్రాఫ్ ఇప్పటికే పడిపోయిందన్న భావన ఉన్నందున ఆ పార్టీకి ఇది పెద్ద ఆశ్చర్య సర్వే కాకపోవచ్చు. వారికి దేశ వ్యాప్త సర్వే ముఖ్యం. లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 307 సీట్లు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సర్వే చెబుతోంది. ఇది కూడా ఊహించిందే. ఇండియా కూటమి గతంలో కన్నా కాస్త మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
✍️ఈ ఫలితాలను పరిశీలిస్తే దేశంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు తిరిగి గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. కాగా ఈ సర్వే వివరాలను ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు ప్రసారం చేయకపోవడం గమనించదగ్గ విషయం. కొద్ది కాలం క్రితం సీ ఓటర్ సర్వే పేరుతో ఒక టీవీ చానల్ వివరాలు ఇస్తూ , ఏపీకి సంబంధించి ఏదో పాసింగ్ రిమార్క్ చేస్తే ,ఇంకేముంది టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని ఊదరగొట్టిన ఆంధ్రజ్యోతి ఈ సారి నోరు కట్టేసుకుని కూర్చుంది. 2014 ఎన్నికలలో బీజేపీతో కలిసి 15 సీట్లు టీడీపీ గెలిచిన విషయాలను ఆ టీవీ చానల్ ప్రస్తావించడమో ,లేక దాని ఆధారంగా కామెంటేటర్ ఒక వ్యాఖ్య చేస్తే శరభ,శరభ అంటూ ఈ మీడియా గంతులేసింది. చంద్రబాబు నాయుడు సైతం అధికారంలోకి వచ్చేసినంతగా మాట్లాడేశారు. ఇప్పుడు వచ్చిన సర్వే వివరాలు టిడిపి వాస్తవ పరిస్థితిని తెలియచేస్తుంది.
పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సభలో చేసిన ప్రసంగం కాని, ఆ తర్వాత బందరులో మాట్లాడిన తీరు కాని ఆయన స్వరం మారినట్లు కనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. తెగ అరిచేస్తూ, గందరగోళంగా మాట్లాడే ఆయన ఈ కార్యక్రమాలలో అంత హుషారుగా మాట్లాడలేకపోయారన్న విశ్లేషణలు వచ్చాయి. పైగా సీఎం సీటు గురించి ఆయన చెప్పిన విషయాలు మరింత ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎన్నికలో గెలిచిన సీట్ల నిష్పత్తిని బట్టి సీఎం పదవి ఉంటుందని ఆయన అన్నారు. అసలు పదిహేనో, లేక ఇరవైఐదో సీట్లు తీసుకుని పోటీచేస్తే జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది. మిగిలిన సీట్లన్నీ టీడీపీకి ఇచ్చేసి, వారి నిష్పత్తి ప్రకారం సీఎం పదవి అంటే అయ్యేపనేనా అన్న భావన కలుగుతుంది.
ఏపీలో ఈ రెండు పార్టీలు కలిసినా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. అది వేరే విషయం. కానీ టీడీపీకి సొంతంగా మెజార్టీ వస్తుందని అనుకుంటే.. పవన్‌కు సీఎం పదవి ఎవరు ఇస్తారు? ఎవరిని మోసం చేయడానికి పవన్ ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికే టీడీపీకి జనసేనను సరెండర్ చేసిన పవన్ కళ్యాణ్ దానిని సమర్ధించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వే ఆయనను మరింత ప్రస్టేషన్ కు గురి చేస్తోంది. టీడీపీవాళ్లైతే మరింత నైరాశ్యంలో మనిగిపోయారు.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment