జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైనా హిడెన్ ఎజెండాతో మాట్లాడతారో? లేక అతి తెలివితో మాట్లాడాతారో తెలియదు కానీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటారు. తాజాగా ఆయన తెలంగాణ మంత్రి హరీష్ రావుకు మద్దతు ఇచ్చిన తీరుకానీ, విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటైజేషన్‌ను తానే ఆపుచేయించుకున్నానని చెప్పిన వైనం కానీ ఆయన పరువు తీశాయి. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్‌ను, ఏపీ ప్రజలను, నేతలను ఒకరకంగా అవమానిస్తే, దానిని పవన్ సమర్ధించి వీడియో విడుదల చేయడం ఆశ్చర్యం కలిగింది.
ఒకప్పుడు తెలంగాణ నేతలను పవన్ కళ్యాణ్ దూషించారు. వారిని ఉద్దేశించి తాట తీస్తానని హెచ్చరించిన వీడియోని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ప్రదర్శించారు. అది చూస్తే ఇదేమిటా, ఇలా మాట్లాడారు అన్న భావన కలుగుతుంది. టీఆర్‌ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ పై అలాంటి అనుచిత వ్యాఖ్య చేశారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి వైసీపీ నేతలకు సుద్దులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమే. ఏపీ రాజకీయాలలో ఆయన కొనసాగుతున్నారు. అఫ్ కోర్స్..ఆయన నివసించేది హైదరాబాద్లోనే కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే ఆయనకు వ్యాపార లావాదేవీలు, సినిమా షూటింగ్‌లు ఉండవచ్చు. కానీ ఆ మాత్రానికే హరీష్‌రావుకి భయపడి పవన్ అలాంటి ప్రకటన చేయడం ద్వారా జనసైనికులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు?
అంటే ఏపీలో ఏమీ లేదని హరీష్ రావు అనగానే పవన్ కళ్యాణ్ చంకలు గుద్దుకుంటూ ప్రకటన చేయాలా? హరీష్ రావును విమర్శిస్తూ ఏపీ మంత్రులు స్టేట్ మెంట్స్ ఇస్తే , పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఉలుకు? ముందుగా హరీష్ రావును తప్పు పట్టి, ఆ తర్వాత ఏపీ మంత్రులు సంయమనంగా ఉండాలని కోరి ఉంటే అది పెద్ద మనిషి తరహాగా ఉండేది. ఆయన అలా చేయలేకపోయారు. కేవలం ఏపీ మంత్రులనే ఆక్షేపిస్తూ పవన్ రిలీజ్ చేసిన వీడియోని గమనిస్తే కచ్చితంగా ఏదో భయంతోనే ఆయన తెలంగాణ నేతలకు గులాంగిరీగా మాట్లాడారనిపిస్తుంది. ఆయన గతంలో కూడా తెలంగాణలో ఆత్మగౌరవం ఉంటుందని, అక్కడి ప్రజలకే పోరాట పటిమ ఉందని మెచ్చుకునేవారు. ఏపీలో తనను ఓడించేసరికి ఇక్కడి ప్రజలపై బహుశా అక్కసు ఏర్పడి ఉంటుంది. అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారేమో తెలియదు.
ఏపీలో ఉన్న స్కీములు తెలంగాణలో ఉన్నాయా? అని ఏపీ మంత్రులు అడిగారు. హైదరాబాద్ దాటితే తెలంగాణలో పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని అనేక కాలనీలలో ఇప్పటికీ రోడ్లు సరిగా లేని విషయాన్ని, డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్న పరిస్థితిని ఏపీ మంత్రులు గుర్తు చేశారు. దీనివల్ల పవన్ కు వచ్చిన నష్టం ఏమిటి? ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం అయితే, హరీష్ రావు ఏపీపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను అవమానించినట్లు కాదా? పవన్ కళ్యాణ్ కు ఆత్మగౌరవ భావన ఎంతవరకు ఉందన్నది ప్రశ్నార్ధకంగా భావిస్తారు. ఎందుకంటే టిడిపి వారు తనను ,తన తల్లిని అవమానించారని ,జనసైనికులను టిడిపి నేత ,నటుడు బాలకృష్ణ అలగా జనం అన్నారని పవన్ గతంలో బాదపడ్డారు.కానీ ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి బాలకృష్ణ ఎదుట అన్ స్టాపబుల్ గా నవ్వుతూ కూర్చున్నారు. అలాగే ఆంద్రులంతా ఉండాలని అనుకుంటారేమో తెలియదు కానీ, ఏపీ మంత్రులు గట్టిగానే హరీష్ బదులు ఇస్తే, ఈయన రెస్పాండ్ అయ్యారు.
అంతదాకా ఎందుకు హరీష్ రావు తెలంగాణలో ఆస్పత్రులు ఆహో, ఓహో అని పొగుడుకున్న మరుసటి రోజే నిజామాబాద్ లో ఒక రోగిని స్ట్రెచర్ లేక నేలపైనే ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన సన్నివేశం తీవ్ర కలకలం సృష్టించింది. మరి ఆ అంశం గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ నుంచి ప్యాకేజీ ఆఫర్ వచ్చిందని టిడిపి అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు రాధాకృష్ణ వెల్లడించారని,అందువల్లే ఆయన హరీష్ రావుకు మద్దతు ఇస్తున్నారా అని నాని ప్రశ్నించారు. చిత్రం ఏమిటంటే పవన్ మిత్రపక్షమైన బిజెపి హరీష్ రావును తీవ్రంగా విమర్శించింది. కానీ పవన్ మాత్రం ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇందులో ఉన్న మర్మమేమిటన్నది ఆయనే చెప్పాలి.అలాగే విశాఖ ఉక్కు ప్యాక్టరీని ప్రైవేటైజేషన్ పై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి అన్నారో,లేదో వెంటనే ఇదంతా తమ క్రెడిట్టే అని బిఆర్ఎస్ నేతలు హరీష్ , కెటిఆర్ లు ప్రకటిస్తే, వారితో పోటీ పడి పవన్ కళ్యాణ్ అసలు తన డిల్లీ పర్యటనలో ఆయా మంత్రులను కలిసి కోరినందునే ఆగిందని స్టేట్ మెంట్ ఇచ్చారు.తీరా సాయంత్రానికి సీన్ మారింది. మంత్రి తాను అనలేదని అంటే, మరుసటి రోజు ఉదయానికి కేంద్రం మరింత స్పష్టంగా ప్రైవేటైజేషన్ కొనసాగుతుందని పేర్కొంది. దీంతో వీరందరి పరువు తీసినట్లయింది.ఇలా తొందరపడడం ఒక ఎత్తు అయితే, ఆంద్రులను అవమానించేలా తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానిస్తే ఖండించవలసిన పవన్ కళ్యాణ్ వారికి మద్దతుగా ప్రవర్తించడం , ఆంద్రుల ఆత్మాభిమానాన్ని వేరే వారికి తాకట్టు పెట్టడమే అవ్వదా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment