wedding ceremonies
-
పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే!
పెళ్లి.. ప్రతివారి జీవితంలోనూ మధురానుభూతి. వధూవరులకు అతిపెద్ద పండుగ. ఇక బిడ్డల వివాహాలను వైభవంగా అందరూ మెచ్చుకునేలా చేయాలని తల్లిదండ్రుల ఆరాటం. అందుకే కాస్త ఆలస్యమైనా ఆన్నీ సవ్యంగా కుదిరాకే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ట్రెండ్ మారింది. సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో... ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా... నిశ్చయం అయ్యింది మొదలు... ఉరుకులు, పరుగులతో పెళ్లి కానిచ్చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో జిల్లాలో వేలాది వివాహాలు జరగ్గా...జూన్ వరకు మాత్రమే సుముహుర్తాలు ఉండటంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. చదవండి: వివాహ ‘వేడుకంబు’.. జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే పుట్టపర్తి అర్బన్: కళ్యాణ వైభోగం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటున్నారు పురోహితులు. జూన్ నెల దాటితే. తిరిగి డిసెంబర్ వరకూ ముహూర్తాల కోసం వేచి చూడాల్సి రావడంతో తల్లిదండ్రులు బిడ్డల పెళ్లికి హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకూ ఆగాల్సి ఉంటుందని భావించి ఉన్నంతలో ఈ ముహూర్తాలకే లగ్గం కానిచ్చేస్తున్నారు. రెండేళ్లుగా మోగని భాజా కరోనా దెబ్బతో చాలా మంది రెండేళ్ల పాటు వివాహాల మాటే ఎత్తలేదు. కొందరు ధైర్యం చేసి పిల్లల పెళ్లి చేద్దామన్నా నిబంధనల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడం, వివాహ ముహూర్తాలు జూన్ వరకే ఉండటంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ముఖ్యంగా మార్చి నుంచి సెలవులు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నెలలు వేలాది వివాహాలు జరిగాయి. ప్రస్తుతానికి జూన్ 26వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టులో నాలుగైదు ముహూర్తాలు ఉన్నా...ఆషాడం, శుక్ర మూఢం కారణంగా డిసెంబర్ వరకూ మంచి ముహూర్తాలు లేవు. చదవండి: ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి : కలెక్టర్ నాగలక్ష్మి డిసెంబర్ 1వ తేదీతో శుక్ర మూఢం ముగుస్తుంది. అనంతరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈక్రమంలో నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు... ఆరు నెలల పాటు ఎదురు చూడడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకే పెళ్లికి తొందరపడుతున్నారు. మరోవైపు ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మళ్లీ మన వైపు వస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే నిదానమే ప్రధానం అనే వారూ ఉన్నారు. అయితే నానాటికీ పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది జూన్‌లోని ముహూర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కల్యాణ మంటపాలు రిజర్వ్ చేసేశారు. డెకరేషన్, క్యాటరింగ్‌కు కూడా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. కాస్త కోలుకుని... జనవరి నుంచి ఇప్పటి వరకూ వివాహాలు జోరుగా సాగాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాకా ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా... పెళ్లిళ్ల కారణంగా డిమాండు తగ్గడం లేదు. కరోనాతో వరుసగా రెండేళ్ల పాటు దెబ్బతిన్న వ్యాపారాలు వివాహాల వల్ల కాస్త కోలుకున్నాయి. ఇక పెళ్లిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా జ్యువెలరీ షాపులు కళకళలాడుతున్నాయి. సాయి ఆరామమే పెద్ద దిక్కు పుట్టపర్తిలో వివాహ వేడుకలు, బర్త్‌డే ఫంక్షన్లకు సాయి ఆరామమే పెద్ద దిక్కుగా మారింది. కరోనా దెబ్బకు సందర్శకులు రాక ప్రభుత్వ నిర్మించిన టూరిజం హోటల్ వెలవెలబోయింది. దీంతో ప్రభుత్వం దాన్ని 30 ఏళ్ల లీజుకిచ్చింది. దీన్ని ఫంక్షన్ హాల్ చేయడంతో అందులోనే ఏసీ రూములు, విశాలమైన పార్కింగ్ స్థలం ఉండటంతో ఇక్కడ వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది. రికార్డు స్థాయిలో గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ యేడు జరుగుతున్నాయి.. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలు వరుసగా ఉండటంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలూ జోరందుకున్నాయి. ఈ సంవత్సరం మే నెల 22వ తేదీ వరకూ 41 ముహూర్తాలు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. జూలై నుంచి ముహూర్తాలు లేవు ఆషాడం, శుక్ర మూఢం కారణంగా జూలై నుంచి వివాహ ముహూర్తాలు లేవు. అందుకే అందరూ మే, జూన్ నెలల్లోని ముహూర్తాలకే పిల్లల పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. – గురుస్వామి, కొత్తచెరువు తక్కువ ముహూర్తాలతో ఇబ్బందే ముహూర్తాలు తక్కువగా ఉంటే అందరికీ ఇబ్బందే. ఫంక్షన్‌హాళ్లు అందరికీ దొరకవు. ఇక ఫంక్షన్ హాళ్ల వారికీ తర్వాత గిరాకీ ఉండదు. ఈ సారి ఎన్నడూ జరగనన్ని వివాహాలు జరిగాయి. సప్లయర్స్ సామగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఈ రెండు నెలల నుంచి పెళ్లిళ్లతో పాటు మరికొన్ని ఫంక్షన్లు పెద్ద ఎత్తున జరిగాయి. జూన్ తర్వాత అందరూ ఖాళీగా ఉండాల్సిందే. – తోట్ల గంగాధర్, ఫంక్షన్‌హాల్ నిర్వాహకుడు -
YSR District: రెండు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో రెండు వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం కడప ఆదిత్య ఫంక్షన్ హాలులో మేయర్ సురేష్‌బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
పెళ్లి పీఠలపైనే పెళ్లి కూతుర్ని చితకొట్టిన పెళ్లి కొడుకు..!!
-
పెళ్లి సందడి.. కల్యాణ ఘడియలొచ్చేశాయి..
సాక్షి, అమరావతి బ్యూరో: కల్యాణ ఘడియలొచ్చేశాయి. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. దీంతో జిల్లాలోను, నగరంలోనూ చాలా ఇళ్లల్లో పెళ్లి సందడి షురూ కానుంది కొన్నాళ్లుగా కోవిడ్ భయంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తప్పనిసరి అయిన వారు మాత్రమే వివాహాలు జరిపించుకున్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ ఒమిక్రాన్ భయంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు క్రమంగా కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో పాటు శుభ ముహూర్తాలు ఆరంభం కావడంతో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేటి నుంచే సందడి షురూ.. శనివారం నుంచి ఈనెల 16 వరకు 5, 6, 7, 10, 11, 12, 14, 16 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈనెల 20 నుంచి మార్చి 23 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉంటుంది. మౌఢ్యమి రోజులు అశుభంగా పరిగణించి పెళ్లిళ్లు, ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు జరిపించరు. గురు మూఢం ముగిశాక కూడా మార్చి 23 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవు. తిరిగి మళ్లీ ఏప్రిల్ 2 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్‌లో 2, 3, 6, 7, 13, 15, 16, 20, 21, 23, 24 తేదీలు అంటే పదకొండు రోజుల పాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మే నెలలో 4, 11, 12, 13, 15, 26 తేదీల్లో వివాహ సుముహూర్తాలున్నాయి. ముందు ముహూర్తాలకే ప్రాధాన్యం.. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి జనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ రూపంలో వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. వచ్చే రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. పైగా కొద్ది రోజుల నుంచి కోవిడ్ తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే కొన్నాళ్ల పాటు వేచి ఉండకుండా ముందుగా వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తగ్గించుకుంటున్న పెళ్లి ఖర్చులు.. గతంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపించేవారు. స్తోమతను బట్టి లక్షలు, కోట్ల రూపాయలను వెచ్చించే వారు. ఇదంతా కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితి. కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కరోనా భయంతో పాటు కోవిడ్ ఆంక్షలతో ఎంతటి స్థితిమంతులైనా ఆర్భాటాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వివాహ వేడుకలకు పరిమితులు విధించడంతో మునుపటిలా వందలు, వేల మందిని ఆహా్వనించడం లేదు. పురోహితులకు డిమాండ్.. ఇక ఈ నెలలో కేవలం ఎనిఠిమిది రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలుండడంతో పెళ్లి పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. విజయవాడలో దాదాపు 1500 మంది పురోహితులున్నారు. వివాహానికి స్థాయిని బట్టి పురోహితులు రూ.30–60 వేల వరకు తీసుకుంటారు. కల్యాణ మండపాలకు గిరాకీ.. మరోవైపు కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ కనిపిస్తోంది. పెళ్లిళ్లు రెండు, మూడు నెలల ముందుగానే నిశ్చయమవడంతో అప్పట్లోనే వీటిని బుక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ నగరంలోని వివాహ వేదికలు ఖాళీ లేకుండా పోయాయి. బెజవాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 16 కల్యాణ మండపాలున్నాయి. ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు మరో 70 వరకు నడుస్తున్నాయి. ఈ నెలలో జరిగే పెళ్లిళ్లకు ఇవన్నీ దాదాపు బుక్ అయినట్టు చెబుతున్నారు. కొందరు ధనికులు పేరున్న హోటళ్లలో వివాహాలు జరిపించుకుంటున్నారు. విజయవాడలో వివిధ స్టార్ హోటళ్లలో 4,500 వరకు గదులుండగా వీటిలో సగటున 50 శాతానికి పైగా పెళ్లిళ్లకు బుక్ అయ్యాయి. నగరపాలక సంస్థ కల్యాణ మండపాలకు ఒక రోజు అద్దె రూ.10–15 వేలు, వీఎంసీ ఐవీ ప్యాలెస్ రూ.లక్ష ఉంది. ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ.. కోవిడ్ భయంతో చాన్నాళ్లుగా వివాహ వేడుకలను తగ్గించుకున్నారు. దీంతో ఆతిథ్య రంగం బాగా నష్టపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ నెలలో మంచి ముహూర్తాలుండడంతో నగరంలోని హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ 50 శాతం వరకు పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం. – ముప్పవరపు మురళీకృష్ణ, మెంబర్, విజయవాడ హోటలీయర్స్ అసోసియేషన్ ఈ నెలలో మంచి ముహూర్తాలు.. మాఘమాసం (ఫిబ్రవరి)లో సెంటిమెంటుగా భావించి పెళ్లిళ్లు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈ నెలలో ఎనిమిది రోజులు మంచి ముహూర్తాలున్నాయి. అందువల్ల ఆయా తేదీల్లో వివాహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. – కృష్ణశాస్త్రి, పురోహితుడు, విజయవాడ -
పెళ్లి సందడి షురూ
హీరో నితిన్, షాలినీల పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కరోనా కారణంగా వారి పెళ్లిని నిరాడంబరంగా చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం కూడా సింపుల్‌గా జరిపారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నితిన్ ని పెళ్లి కొడుకుని చేశారు. ఈ వేడుకకు హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్ హాసినీ క్రియేష¯Œ ్స నిర్మాత చినబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘‘నన్ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా ఆశీర్వదించడానికి పవర్‌స్టార్, త్రివిక్రమ్, చినబాబుగార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు నితిన్. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
చైతూ అమ్మమ్మ చీరలో సమంత?
రెండే రెండు నెలలు.. చైతూ (నాగచైతన్య), సమంత భార్యాభర్తలు కావడానికి రెండే నెలలు. అందుకే ఇటు చైతూ అటు సమంత కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలుపెట్టారట. ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం పెళ్లిలో చైతూ అమ్మమ్మ (డా.డి.రామానాయుడు సతీమణి డి. రాజేశ్వరి) చీరను సమంత కట్టుకుంటారని సమాచారం. ముంబై డిజైనర్ క్రేషా బజాజ్‌ను పెళ్లి దుస్తులు డిజైన్ చేయడానికి నియమించుకున్నారని టాక్. రాజేశ్వరి చీరను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్ చేయిస్తున్నారట. ఈ చీరను ధరించడం ద్వారా అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శించినట్లవుతుందని సమంత తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారట. అక్టోబర్ 6 నుంచి 9 వరకూ గోవాలో వివాహ వేడుకలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో పెళ్లి వేడుకలు జరుగుతాయి. చై–సమంత కోసం క్రేషా బజాజ్ మూడు అవుట్‌ఫిట్స్ తయారు చేస్తున్నారట. క్రేషా భర్త వనరాజ్ జవేరీ జ్యూయెలరీ డిజైనర్. పెళ్లికి సమంత పెట్టుకోబోతున్న నగలను కూడా ఈ దంపతులే డిజైన్ చేస్తారట. గోల్డ్, డైమండ్స్ కాంబినేషన్లో నగలు తయారు చేస్తున్నారట. అన్నట్లు.. నిశ్చితార్థం నాడు సమంత కట్టుకున్న చీరను డిజైన్ చేసింది క్రేషానే. తమ లవ్‌స్టోరీలో తీపి గుర్తుగా నిలిచిపోయినవాటిని బొమ్మల రూపంలో చీర అంచుకి డిజైన్ చేయించుకున్నారు సమంత. ఇప్పుడు వివాహ వేడుకల్లో ధరించబోయే దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉండాలని క్రేషాకి చెప్పారట. -
ఎలిగెంట్ బ్రైడల్ స్టయిల్
సిగ సింగారం ఇది ఎలిగెంట్ బ్రైడల్ హెయిర్ స్టయిల్స్‌లో ఒక రకం. దీన్ని విదేశీయులు వివాహ వేడుకల్లో ఎక్కువగా వేసుకుంటారు. వారే కాదు.. ఇటీవల మన భారతీయులు కూడా ఈ హెయిర్ స్టయిల్‌ను బాగా అనుసరిస్తున్నారు. ఇది లాంగ్స్కర్ట్స్, గాగ్రా, గౌన్ల మీదకు చక్కగా నప్పుతుంది. అంతేకాదు.. పట్టుచీరల మీదకు కూడా భలే సూట్ అవుతుంది. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు. ఓ మాదిరిగా ఉంటే సరిపోతుంది. కాబట్టి అందరూ ఈ హెయిర్ స్టయిల్‌ను ట్రై చేయొచ్చు. * ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. సాఫ్ట్‌గా ఉండేందుకు హెయిర్ స్ప్రే చేసుకుంటూ దువ్వుకోవాలి. తర్వాత రెండువైపులా కాస్త జుత్తును వదిలేసి, ఫొటోలో కనిపిస్తున్న విధంగా మధ్యభాగంలోని జుత్తును తీసుకోవాలి. దాన్ని కొద్దిగా మెలితిప్పి స్లైడ్ పెట్టేయాలి. * ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా సైడ్ నుంచి కొద్దిగా జుత్తును తీసుకొని ఫోల్డ్ (రిబ్బన్ కట్టడానికి ఫోల్డ్ చేసినట్ట్టు) చేసి స్లైడ్ పెట్టాలి. అలాగే మరోవైపు నుంచి కూడా జుత్తును తీసుకొని ఫోల్డ్ చేసి స్లైడ్ పెట్టాలి. * మొదట వదులుకున్న ఇరువైపుల జుత్తును ఇప్పుడు పై విధంగానే ఫోల్డ్ చేసి స్లైడ్స్ పెట్టేయాలి. * యథాతథంగా కింద మిగిలిన జుత్తును ఇరువైపుల నుంచి తీసుకొని మరో స్టెప్ ఫోల్డ్ చేసుకోవాలి. * తర్వాత చివర మిగిలిన కొద్ది జుత్తును సింగిల్ ఫోల్డ్ చేసి, లోపలికి మడిచి స్లైడ్స్ పెట్టేయాలి. కొప్పులోంచి పొట్టి జుత్తు బయటికి రాకుండా అక్కడక్కడా స్లైడ్స్ పెట్టి, హెయిర్ స్ప్రే చేసుకోవాలి. ఫొటోలో కనిపిస్తున్నట్టుగా ఏదైనా పెద్దసైజు ఫ్లవర్‌తో కొప్పును అలంకరించుకోవాలి. * ఇప్పుడు పూసలున్న పిన్స్‌ను తీసుకొని కొప్పుకు రెండు లైన్లలో కుచ్చుకోవాలి. దాంతో మీ హెయిర్ స్టయిల్ ఎంతో అందంగా ఉంటుంది. -
పెళ్లి వేళ...మృత్యుహేల
► అల్వాల్ బ్రిడ్జిపై కారు-బైక్ ఢీ ► ప్రమాదంలో ముగ్గురి మృతి ► మృతుల్లో తాత, మనవరాలు ► మరో ఇద్దరి పరిస్థితి విషమం ► పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం బొల్లారం: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న ఆ ఇంట్లో పెను విషాదం. మరో రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇల్లు కన్నీటి సంద్రంగా మారింది. అల్వాల్ బ్రిడ్జిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పెళ్లి కొడుకు తాత, మామ కూతురు మృతి చెందగా... మేనమామ, మేనత్త సహా ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. హృదయ విదారకమైన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలివీ... చంపాపేట విష్ణుపురి కాలనీకి చెందిన కృష్ణమాచారి (70) మనవడి (కూతురి కొడుకు) పెళ్లి ఈ నెల 30న జరుగనుంది. సోమవారం పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణమాచారి కుటుంబంతో సహా హకీంపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక తిరిగి చంపాపేటకు బయలుదేరారు. కృష్ణమాచారి, ఆయన భార్య కౌసల్య (60), చిన్న కుమారుడు శ్రీనివాస్ చారి, కోడలు స్వప్న (32), వారి కుమార్తెలు మిల్కీ అలియాస్ వర్షిత (5), వైపీ (4), పెద్ద కొడుకు జగన్ పిల్లలు కమలి (7), సుదాన్ష్ (5), మరో బంధువు సాయికిరణ్ (22) కారులో (ఏపీ 29 బీబీ 4454)లో ఇంటికి వెళ్తున్నారు. బొల్లారం దాటాకఅల్వాల్ రైల్వే వంతెనపై వీరి కారును ఎదురుగా వేగంగా వస్తున్న పల్సర్ బైక్ (టీఎస్08 ఈఎన్ 1529) ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన కారు రైల్వే వంతెనపై నుంచి కింద పడిపోయింది. బైక్‌తో ఢీకొట్టిన శక్తిసింగ్ కూడా కింద పడిపోయాడు. కారు ముందు సీట్లో కూర్చున్న కృష్ణమాచారి (70), ఆయన పెద్ద కుమారుడు జగన్ కూతురు కమలి (7) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన శక్తిసింగ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కారును నడిపిన శ్రీనివాస్ చారి, ఆయన భార్య స్వప్నల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు వెనుకే పెద్ద కుమారుడు కృష్ణమాచారి పెద్ద కుమారుడు జగన్, తన భార్యతో కలసి కారు వెనకాలే బైక్‌పై వస్తున్నారు. అల్వాల్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కారు ప్రమాదానికి గురైనట్లు జగన్ గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకుని కారులోని తన కుటుంబ సభ్యులను బయటకు తీశారు. స్థానికుల సహకారంతో వారిని వెంటనే తిరుమలగిరిలోని స్టెర్లింగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిన కృష్ణమాచారి, కమలితో పాటు కారును ఢీకొట్టి తీవ్ర గాయాలపాలైన శక్తి సింగ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శక్తిసింగ్ మృతి చెందాడు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే హకీంపేటలోని పెళ్లి బృందం పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఓ వైపు తన కుమార్తె కమలి, తండ్రి కృష్ణమాచారి కన్నుమూయడం... తమ్ముడు, మరదలు... మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉండటంతో జగన్ వేదన వర్ణనాతీతం. బంధుమిత్రుల రోదనలతో ఆస్పత్రి వద్ద మంగళవారం విషాదఛాయలు అలముకున్నాయి. ఓవర్ లోడ్... అతివేగమే కారణమా? బైక్ అతి వేగంగా రావడం... కారులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బొల్లారం నుంచి అల్వాల్ వైపు వెళ్తున్న కారు... రైల్వే బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో బైక్‌ను ఢీకొట్టి కుడివైపున ఉన్న రైతుబజార్ వైపు రోడ్డు కింద పడిపోవడం గమనార్హం. అల్వాల్ నంచి బొల్లారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ బ్రిడ్జి దిగుతున్న క్రమంలో మలుపులో అదుపు తప్పి కారుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. బైకును తప్పిం చుకునే క్రమంలో కారును నడిపిస్తున్న శ్రీనివాస్ కుడివైపునకు తిప్పి ఉండవచ్చని తెలుస్తోంది. శక్తిసింగ్ సోదరుడి ఫిర్యాదు రాంగ్ రూట్లో వచ్చి తన సోదరుడి బైక్‌ను ఢీకొట్టడంతోనే అతను మృతి చెందాడని మృతునిసోదరుడు రాణా ప్రతాప్ సింగ్ బొల్లారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డిక్కిలో పడుకొని.... ప్రమాదానికి గురైన కారులో ఐదుగురు పెద్ద వారితో పాటు నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మృతి చెందిన కమలి ముందు సీట్లో కూర్చుంది. వెనుక సీట్లో కూర్చున్న చిన్నారులు సుదాన్ష్, వైపీకి సైతం గాయాలయ్యాయి. డిక్కీలో పడుకున్న వర్షిత స్వల్ప గాయాలతో బయటపడింది. -
ట్రెండ్ గురూ..
పెళ్లంటే తప్పెట్లు... తాళాలు... తలంబ్రాలు.. ఇక్కడితోనే ఆగడం లేదు ఇప్పటి వివాహ వేడుకలు. భారీ సెట్లు ఉండాలి... అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వాలి.. వధూవరులు పెళ్లి వస్త్రాల్లో తళుక్కుమనాలి. అందరి దీవనెలతో పాటు ప్రశంసలు అందుకోవాలి. మరి కోరుకున్నట్లు ఉండాలంటే ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో వయ్యారాలు పోవాల్సిందే. ఒక్క పెళ్లి కూతురే కాదు పెళ్లి వేడుకలకు హాజరయ్యే ప్రతిఒక్కరూ ఆధునిక డిజైన్లు అద్దుకున్న శారీలు, గాగ్రాలు, లెహంగాలు, డ్రస్సుల్లో తళుక్కు మనేందుకు ఇష్టపడుతున్నారు. సంప్రదాయ పద్ధతినే ఫాలో అవుతూ నయాట్రెండీ డ్రెస్సులకు అలవాటుపడిన సిటీవాసుల నాడి పట్టుకున్న కృష్ణ కార్తీక్ ‘హనీశా రాయల్ కౌచర్’ అనే ఆన్లైన్ వెబ్‌సైట్‌ను తొమ్మిది నెలల క్రితం ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా వెడ్డింగ్ కలెక్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంప్రదాయ శారీల స్థానంలో ప్యూర్ డిజైన్ చీరలను పరిచయం చేశారు. - సాక్షి, సిటీబ్యూరో మహిళల వెతలు విని... నేను పుట్టి పెరిగింది సిటీలోనే. చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ డ్రెస్సులంటే మోజు. బీకామ్ చేశాక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజినీర్ (ఎంసీఎస్సీ) చేశా. సిటీలోని టాప్ ఐటీ కంపెనీల్లో పనిచేశా. ఆ తర్వాత రెస్టారెంట్ బిజినెస్ చేశా. ఆ తర్వాత ఓ ఎన్జీవోలో కౌన్సెలర్‌గా ఉద్యోగం చేశా. ఈ సమయంలోనే చాలా మంది మహిళల వెతలు విన్నా. దాంపత్య జీవితంలో అనర్థాలతో, గృహహింస కారణంగా కోర్టుకెళ్లి విడాకులు తీసుకోవాలనుకున్న మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకొచ్చా. పెళ్లి సందర్భంలో దుస్తులు, బంగారం విషయాల్లో జరిగిన గోడును వినిపించేవారు. వారు డ్రెస్సులపై చూపిస్తున్న ఆసక్తితో పాటు అప్పటికే నాకు ఫ్యాషన్‌పై ఉన్న మోజు హనీశా రాయల్ కౌచర్ ప్రారంభించేందుకు దోహదం చేసింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ డిజైన్ ట్రెండ్‌ను గమనించా. బెస్ట్ డిజైనర్ల చేతిలో డిజైన్లద్దుకున్న శారీలు, లెహంగాలు, హాఫ్ శారీల కలెక్షన్ సేకరించా. హైదరాబాదీలతో పాటు వివిధ నగరాల్లో ఫుల్ రెస్పాన్స్ ఉందని అంటున్నారు బెస్ట్ కలెక్షన్ హీరో కృష్ణ కార్తీక్. తప్పులే మెళకువలు నేర్పించాయి... బ్రాండ్ షూటింగ్‌పై నాకు జీరో నాలెడ్జ్. టెక్నికల్‌గా కెమేరా ఎలా ఉపయోగించాలో తెలియదు. మోడల్స్‌ను కెమేరాలో బంధించే విధానంలో తొలి, రెండు షూట్లలో బాగానే తప్పులు చేశా. ఫొటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత నా టీమ్‌తో ఇతర బ్రాండ్లకు కూడా షూట్ చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా... బెస్ట్ డిజైనర్ల నుంచి వెడ్డింగ్ వేర్, బ్రైడల్ వేర్, గౌన్లు, హాఫ్ శారీస్, అనార్కలీ శారీ కలెక్షన్స్ సేకరించాం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డ్రెస్సులు డిజైన్ చేయిస్తున్నాం. భవిష్యత్‌లో పెళ్లికూతురుకు అవసరమయ్యే ప్రతి వస్తువు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికతో ముందుకెళుతున్నాం. లేడీస్ సెక్షన్లో హ్యండ్ బాగ్స్, ఫుట్వేర్లలో త్వరలో ఎంటర్ కాబోతున్నాం. ప్రాంఛైజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు కృష్ణ కార్తీక్. ఇవీ ప్రత్యేకతలు... పెళ్లి కూతురు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలైట్ శారీ, ప్యూర్ జార్జెట్ శారీ, క్రేప్ సిల్క్ శారీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆర్ట్ వర్క్ బ్రైడల్ వేర్, రెడ్ డిజైనర్ లెహంగాలపై కూడా అతివలు మనసు పారేసుకుంటున్నారు. సంపన్న కుటుంబాలవారు స్లీవ్ లెస్ పింక్ స్టోన్డ్ వర్క్ గౌన్, స్లీవ్ లెస్ పింక్ గౌన్, స్లీవ్ లెస్ గౌన్, రాయల్ కలెక్షన్ లాంగ్ గౌన్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వీటితో పాటు పింక్ డిజైనర్ హాఫ్ శారీ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ హాఫ్ శారీ, రెడ్ అండ్ క్రీమ్ కలర్డ్ హాఫ్ శారీ, యెల్లో రెడ్ హాఫ్ శారీ, రెడ్ హాఫ్ శారీ, పింక్ హాఫ్ శారీ, హాఫ్ శారీ వెల్వెట్ అండ్ హ్యాండ్‌క్రాఫ్ట్ ఎంబ్రాయిడరీ, ఫిష్ కట్ డిజైనర్ హాఫ్ శారీ, హాఫ్ వైట్ అనార్కలీ, పింక్ డిజైనర్ అనార్కలీ, హాఫ్ వైట్ అండ్ పింక్ డిజైనర్ పీస్, ఆరెంజ్ చిఫోన్, బ్లూ కుర్తా అనార్కలీ శారీలకు సిటీవాసులు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు హనీశా రాయల్ కౌచర్ ఫౌండర్ కృష్ణ కార్తీక్. ఇండియాతో పాటు ఆస్ట్రేలియాలోనూ ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామన్న కృష్ణ కార్తీక్... భవిష్యత్‌లో అమెరికాతోపాటు మరిన్ని దేశాలకు తమ అమ్మకాలను విస్తరించాలని అనుకుంటున్నామని వివరించారు. -
ద్వారకా తిరుమలకు పెళ్లికళ
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రం ద్వారకా తిరుమలలో వివాహ సందడి నెలకొంది. 4, 5వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఇప్పటికే వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ప్రైవేటు కల్యాణ మండపాల్లో అన్ని గదులు ముందుగానే బుక్ అయిపోయాయి. పెళ్లి వేదికల ఏర్పాట్లలో పలువురు నిమగ్నమై ఉన్నారు. పూలు, పురోహితులు, ఇతర పెళ్లి సామగ్రికి మంచి గిరాకీ ఏర్పడింది. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఈ మాసంలో ఇవే బలమైన ముహూర్తాలు కావడంతో అధికంగా వివాహాలు జరగనున్నాయని పురోహితుడు వెంకట రమణమూర్తి శర్మ చెబుతున్నారు. -
‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు ఇలా..
నిర్మల్ అర్బన్ : పెళ్లి వేడుకలు నేడు ఖరీదయ్యాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వ్యయాలు పెరిగిపోయాయి. ఫంక్షన్ హాళ్లు, కార్డుల పంపిణీ, బట్టల కొనుగోలు, సామగ్రి, నిత్యావసర సరుకులు.. ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలు వివాహ ఖర్చులకు అప్పుల పాలయ్యేవారు. మరి కొందరు ఆర్థిక భారాన్ని భరించే స్థోమత లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల వివాహానికి ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇది కాస్తా ఊరటనివ్వడంతో పాటు కొందరికి వరంగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ‘కల్యాణలక్ష్మి’ పథకం ద్వారా లబ్ధి పొందే వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దాని ప్రతిని సమీపంలోని సాంఘిక సంక్షే మ శాఖ కార్యాలయంలో అందజే యాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలతో పాటు వధువుకు సంబంధించిన కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, మొదటి వివాహంగా వీఆర్వో, గజిటెడ్ అధికారులతో వేర్వేరుగా ధ్రువీకరించిన పత్రాలు, అబ్బాయికి సంబంధించిన ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తదితర పూర్తి వివరాల జిరాక్స్ ప్రతులతో దరఖాస్తులు అందజేయాలి. అలాగే వెడ్డింగ్ కార్డును జతపరిచి పెళ్లికి ముందే అధికారులకు అప్పగించాలి. రూ.2లక్షల వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు తమ పెళ్లి ఫొటో, పెళ్లి పత్రికను దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. పరిశీలన పూర్తయిన వెంటనే మంజూరు.. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు దరఖాస్తులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పూర్తి పరిశీలన చేపడతారు. అందించిన వివరాలు సరియైనవో.. కాదో.. తేల్చుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి నిధులు మంజూరవుతాయి. నేరుగా రూ.51 వేలు వధువు బ్యాంక్ అకౌంట్లో జమవుతాయి. ఈ పథకం అమలుకు నిధుల కొరత ఏమీ లేదని.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు సుమారు రూ.6 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. అవగాహన కల్పిస్తే మేలు.. పేద, నిరుపేదలైన దళితుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఎవరికి దరఖాస్తులు అందించాలో.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయడంతో అవి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరడానికి, దరఖాస్తుల పరిశీలనకు తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది నిరక్ష్యరాస్యులుండడం, దరఖాస్తులను ఆన్లైన్లో అందించలేక పోవడం, ఏయే పత్రాలు జతపర్చాలన్న విషయాలు తెలియకపోవడంతో పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నారుు. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే అధికారులు దళితులను మరింత చైతన్యపరచాల్సిన అవసరముందని పలువురు పేర్కొంటున్నారు. 51 దరఖాస్తులు అందాయి - మహ్మద్ అబ్దుల్ అలీం, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, నిర్మల్ ఇప్పటివరకు 51 దరఖాస్తులు అందగా 38 పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన వాటికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి మరికొన్ని వివరాలు, పత్రాలు అందాల్సి ఉంది. అవి అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.అన్ని పత్రాలు అందజేసిన వారికి ఇప్పటికే ఆర్థికసాయం మంజూరైంది. -
పెళ్లి రోజే.. మహిళ బలవన్మరణం
* వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య * విచారణ చేపట్టాలని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు వెంకటాపురం, న్యూస్‌లైన్ : పెళ్లిరోజు వేడుకలు నిర్వహించుకోవాల్సిన ఆ ఇల్లాలు ఆదనపుకట్నం వేధింపులకు బలైపోయింది. భర్త వేధింపులు భరించలేక పెళ్లి రోజునే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని వెలుతుర్లపల్లిలో సోమవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. వెలుతుర్లపల్లి గ్రామానికి చెందిన తౌట్‌పర్తి ప్రవీణ్‌రావుకు, గోదావరిఖనికి చెందిన వెలిశాల స్వప్న(27)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో కుమారులు వర్షిత్, అర్జున్ జన్మించారు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రవీణ్‌రావు ఆదనపు వరకట్నం కావాలని స్వప్నను వేధించడం మొదలుపెట్టాడు. పెద్ద మనుషుల సమక్షంలో పలుసార్లు పంచాయితీ నిర్వహించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో స్వప్న ప్రవీణ్‌రావుపై గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించివేశారు. అయినా వేధిస్తుండడంతో స్వప్న ఏడాదిపాటు తల్లిగారింటివద్దనే ఉంది. ఆ తర్వాత పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి స్వప్నను అత్తగారింటికి పంపించారు. కట్నం కోసం కుటుంబంలో తర చూ గొడవలు జరుగుతుండేవని బంధువులు పేర్కొన్నారు. ఆదివారం మేడారం జాతరకు స్వప్న, ప్రవీణ్‌రావుతోపాటు కుటుంబసభ్యులు వెళ్లి రాత్రి తిరిగి వచ్చారు. మేడారంలో దంపతుల మధ్య గొడవ జరిగిందా లేదా కట్నం కోసం కుటుంబ సభ్యులు రాత్రివేళ వేధింపులకు గురిచేశారో తెలియదుకాని సోమవారం పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన స్వప్న తెల్లవారుజామునే నిద్రలేచి క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబ సభ్యులు స్వప్నను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. తన కూతురు ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరు తూ మృతురాలి తండ్రి రాజేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.