చైతూ అమ్మమ్మ చీరలో సమంత?
రెండే రెండు నెలలు.. చైతూ (నాగచైతన్య), సమంత భార్యాభర్తలు కావడానికి రెండే నెలలు. అందుకే ఇటు చైతూ అటు సమంత కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలుపెట్టారట. ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం పెళ్లిలో చైతూ అమ్మమ్మ (డా.డి.రామానాయుడు సతీమణి డి. రాజేశ్వరి) చీరను సమంత కట్టుకుంటారని సమాచారం. ముంబై డిజైనర్ క్రేషా బజాజ్‌ను పెళ్లి దుస్తులు డిజైన్ చేయడానికి నియమించుకున్నారని టాక్. రాజేశ్వరి చీరను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్ చేయిస్తున్నారట.
ఈ చీరను ధరించడం ద్వారా అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శించినట్లవుతుందని సమంత తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారట. అక్టోబర్ 6 నుంచి 9 వరకూ గోవాలో వివాహ వేడుకలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో పెళ్లి వేడుకలు జరుగుతాయి. చై–సమంత కోసం క్రేషా బజాజ్ మూడు అవుట్‌ఫిట్స్ తయారు చేస్తున్నారట. క్రేషా భర్త వనరాజ్ జవేరీ జ్యూయెలరీ డిజైనర్.
పెళ్లికి సమంత పెట్టుకోబోతున్న నగలను కూడా ఈ దంపతులే డిజైన్ చేస్తారట. గోల్డ్, డైమండ్స్ కాంబినేషన్‌లో నగలు తయారు చేస్తున్నారట. అన్నట్లు.. నిశ్చితార్థం నాడు సమంత కట్టుకున్న చీరను డిజైన్ చేసింది క్రేషానే. తమ లవ్‌స్టోరీలో తీపి గుర్తుగా నిలిచిపోయినవాటిని బొమ్మల రూపంలో చీర అంచుకి డిజైన్ చేయించుకున్నారు సమంత. ఇప్పుడు వివాహ వేడుకల్లో ధరించబోయే దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉండాలని క్రేషాకి చెప్పారట.