పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే! | Wedding Dates 2022: June Passes Wedding Moments Dates Will Be In December Again | Sakshi
Sakshi News home page

పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే!

Published Thu, May 26 2022 3:36 PM | Last Updated on Thu, May 26 2022 9:18 PM

Wedding Dates 2022: June Passes Wedding Moments Dates Will Be In December Again - Sakshi

పెళ్లి.. ప్రతివారి జీవితంలోనూ మధురానుభూతి. వధూవరులకు అతిపెద్ద పండుగ. ఇక బిడ్డల వివాహాలను వైభవంగా అందరూ మెచ్చుకునేలా చేయాలని తల్లిదండ్రుల ఆరాటం. అందుకే కాస్త ఆలస్యమైనా ఆన్నీ సవ్యంగా కుదిరాకే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ట్రెండ్‌ మారింది. సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో... ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా... నిశ్చయం అయ్యింది మొదలు... ఉరుకులు, పరుగులతో పెళ్లి కానిచ్చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో జిల్లాలో వేలాది వివాహాలు జరగ్గా...జూన్‌ వరకు మాత్రమే సుముహుర్తాలు ఉండటంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
చదవండి: వివాహ ‘వేడుకంబు’.. జూన్‌ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే 

పుట్టపర్తి అర్బన్‌: కళ్యాణ వైభోగం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటున్నారు పురోహితులు. జూన్‌ నెల దాటితే. తిరిగి డిసెంబర్‌ వరకూ ముహూర్తాల కోసం వేచి చూడాల్సి రావడంతో తల్లిదండ్రులు బిడ్డల పెళ్లికి హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకూ ఆగాల్సి ఉంటుందని భావించి ఉన్నంతలో ఈ ముహూర్తాలకే లగ్గం కానిచ్చేస్తున్నారు.

రెండేళ్లుగా మోగని భాజా 
కరోనా దెబ్బతో చాలా మంది రెండేళ్ల పాటు వివాహాల మాటే ఎత్తలేదు. కొందరు ధైర్యం చేసి పిల్లల పెళ్లి చేద్దామన్నా నిబంధనల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడం, వివాహ ముహూర్తాలు జూన్‌ వరకే ఉండటంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ముఖ్యంగా మార్చి   నుంచి సెలవులు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నెలలు వేలాది వివాహాలు జరిగాయి. ప్రస్తుతానికి జూన్‌ 26వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టులో నాలుగైదు ముహూర్తాలు ఉన్నా...ఆషాడం, శుక్ర మూఢం కారణంగా డిసెంబర్‌ వరకూ మంచి ముహూర్తాలు లేవు.
చదవండి: ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి : కలెక్టర్‌ నాగలక్ష్మి

డిసెంబర్‌ 1వ తేదీతో శుక్ర మూఢం ముగుస్తుంది. అనంతరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈక్రమంలో నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు... ఆరు నెలల పాటు ఎదురు చూడడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకే పెళ్లికి తొందరపడుతున్నారు. మరోవైపు ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మళ్లీ మన వైపు వస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే నిదానమే ప్రధానం అనే వారూ ఉన్నారు. అయితే నానాటికీ పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది జూన్‌లోని ముహూర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కల్యాణ మంటపాలు రిజర్వ్‌ చేసేశారు. డెకరేషన్, క్యాటరింగ్‌కు కూడా టోకెన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నారు.

కాస్త కోలుకుని...
జనవరి నుంచి ఇప్పటి వరకూ వివాహాలు జోరుగా సాగాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాకా  ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా... పెళ్లిళ్ల కారణంగా డిమాండు తగ్గడం లేదు. కరోనాతో వరుసగా రెండేళ్ల పాటు దెబ్బతిన్న వ్యాపారాలు వివాహాల వల్ల కాస్త కోలుకున్నాయి. ఇక పెళ్లిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా జ్యువెలరీ షాపులు కళకళలాడుతున్నాయి.

సాయి ఆరామమే పెద్ద దిక్కు 
పుట్టపర్తిలో వివాహ వేడుకలు, బర్త్‌డే ఫంక్షన్‌లకు సాయి ఆరామమే పెద్ద దిక్కుగా మారింది. కరోనా దెబ్బకు సందర్శకులు రాక ప్రభుత్వ నిర్మించిన టూరిజం హోటల్‌ వెలవెలబోయింది. దీంతో ప్రభుత్వం దాన్ని 30 ఏళ్ల లీజుకిచ్చింది. దీన్ని ఫంక్షన్‌ హాల్‌ చేయడంతో అందులోనే ఏసీ రూములు, విశాలమైన పార్కింగ్‌ స్థలం ఉండటంతో ఇక్కడ వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది.

రికార్డు స్థాయిలో
గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ యేడు జరుగుతున్నాయి.. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలు వరుసగా ఉండటంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలూ జోరందుకున్నాయి. ఈ సంవత్సరం మే నెల 22వ తేదీ వరకూ 41 ముహూర్తాలు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి.  

జూలై నుంచి ముహూర్తాలు లేవు
ఆషాడం, శుక్ర మూఢం కారణంగా జూలై నుంచి వివాహ ముహూర్తాలు లేవు. అందుకే అందరూ మే, జూన్‌ నెలల్లోని ముహూర్తాలకే పిల్లల పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు మంచి ముహూర్తం చూసుకుంటున్నారు.  
– గురుస్వామి, కొత్తచెరువు 

తక్కువ ముహూర్తాలతో ఇబ్బందే
ముహూర్తాలు తక్కువగా ఉంటే అందరికీ ఇబ్బందే. ఫంక్షన్‌హాళ్లు అందరికీ దొరకవు. ఇక ఫంక్షన్‌ హాళ్ల వారికీ తర్వాత గిరాకీ ఉండదు. ఈ సారి ఎన్నడూ జరగనన్ని వివాహాలు జరిగాయి. సప్లయర్స్‌ సామగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఈ రెండు నెలల నుంచి పెళ్లిళ్లతో పాటు మరికొన్ని ఫంక్షన్లు పెద్ద ఎత్తున జరిగాయి. జూన్‌ తర్వాత అందరూ ఖాళీగా ఉండాల్సిందే. 
– తోట్ల గంగాధర్, ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement