పెళ్లి రోజే.. మహిళ బలవన్మరణం
* వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య
* విచారణ చేపట్టాలని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు
వెంకటాపురం, న్యూస్‌లైన్ : పెళ్లిరోజు వేడుకలు నిర్వహించుకోవాల్సిన ఆ ఇల్లాలు ఆదనపుకట్నం వేధింపులకు బలైపోయింది. భర్త వేధింపులు భరించలేక పెళ్లి రోజునే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని వెలుతుర్లపల్లిలో సోమవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. వెలుతుర్లపల్లి గ్రామానికి చెందిన తౌట్‌పర్తి ప్రవీణ్‌రావుకు, గోదావరిఖనికి చెందిన వెలిశాల స్వప్న(27)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో కుమారులు వర్షిత్, అర్జున్ జన్మించారు.
పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రవీణ్‌రావు ఆదనపు వరకట్నం కావాలని స్వప్నను వేధించడం మొదలుపెట్టాడు. పెద్ద మనుషుల సమక్షంలో పలుసార్లు పంచాయితీ నిర్వహించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో స్వప్న ప్రవీణ్‌రావుపై గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించివేశారు. అయినా వేధిస్తుండడంతో స్వప్న ఏడాదిపాటు తల్లిగారింటివద్దనే ఉంది. ఆ తర్వాత పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి స్వప్నను అత్తగారింటికి పంపించారు. కట్నం కోసం కుటుంబంలో తర చూ గొడవలు జరుగుతుండేవని బంధువులు పేర్కొన్నారు.
ఆదివారం మేడారం జాతరకు స్వప్న, ప్రవీణ్‌రావుతోపాటు కుటుంబసభ్యులు వెళ్లి రాత్రి తిరిగి వచ్చారు. మేడారంలో దంపతుల మధ్య గొడవ జరిగిందా లేదా కట్నం కోసం కుటుంబ సభ్యులు రాత్రివేళ వేధింపులకు గురిచేశారో తెలియదుకాని సోమవారం పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన స్వప్న తెల్లవారుజామునే నిద్రలేచి క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబ సభ్యులు స్వప్నను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. తన కూతురు ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరు తూ మృతురాలి తండ్రి రాజేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.