మన ఊరు– మన గుడి
దక్షిణకాశీగా పేరొందిన అంతర్వేది క్షేత్రం మహిమాన్వితమైనది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో విరాజిల్లుతున్న నర్శింహుని క్షేత్రాలలో ఇది పురాణ ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. స్వామివారి కల్యాణంలో భక్త కుటుంబాల వారే కర్తలుగా శుభ కార్యక్రమం జరిపించడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.
అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించారు. ఏటా మాఘమాసంçలో శుద్ధ సప్తమి (రథసప్తమి)నుంచి తొమ్మిది రోజులపాటు క్షేత్రంలో లక్ష్మీనరసింహుని దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు కనుల వైకుంఠంగా సాగుతాయి. మాఘమాసం సూర్యభగవానుడికి ప్రీతికరమైంది. సూర్యనారాయణమూర్తి సాక్షాత్తూ నారాయణ స్వరూపం. కలియుగంలో కనిపించే దేవుడు సూర్యనారాయణుడు.
ఈ కారణంగా రథ సప్తమి రోజు నుంచి కళ్యాణోత్సవాలు మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. 7వ తేదీ దశమి నాడు రాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో జరగనున్నాయి. తరువాత 8వ తేదీ భీష్మ ఏకాదశి నాడు నూతన వధూవరులుగా మూర్తీభవించే శ్రీస్వామి, అమ్మవార్లను రథంపై ఉంచి యాత్ర నిర్వహించనున్నారు.12వ తేదీ మాఘ పౌర్ణమి రోజున వశిష్ఠ నదీ సంగమ ప్రాంతాలలో స్వామివారికి చక్ర స్నానం
నిర్వహిస్తారు.
భక్తజనమే పెళ్లిపెద్దలుగా...
లక్ష్మీ నర్శింహస్వామి ఆలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి ఆయన కళ్యాణంలో పలు కుటుంబాల వారు కర్తలుగా నిలబడి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నరసింహుని కళ్యాణంలో గోదావరికి ఇరువైపుల వారు భాగస్వాములే. ఇటు కోనసీమ వాసులతోపాటు.. అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొన్ని కుటుంబాల వారు ఈ కళ్యాణతంతు లో తమ వంతు సేవలందిస్తారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి చక్రస్నానం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు వేద పండితుల చేతులు మీదుగా నిర్వహిస్తుండడం దశాబ్ధాల కాలంగా వస్తోంది.
కళ్యాణానికి ముందు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, కుమార్తెలు చేసే అవకాశం బెల్లంకొండ, ఉండపల్లి వారి కుటుంబాల వారికి దక్కింది.రథసప్తమి రోజున నిర్వహించే ముద్రికాలంకణలో స్వామికి పంచెను బెల్లంకొండ కుటుంబాల వారు, అమ్మవారికి చీర ఉండపల్లి కుటుంబాల వారు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణ మహోత్సవంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు రాజులు పెండ్లి కుమారుడి తరుపున నిలబడి కళ్యాణంలో పాల్గొంటారు. ప్రస్తుత వారసుడు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజాబహుద్దర్ కళ్యాణోత్సవాలకు కల్యాణం లో స్వామివారి తరపున నిలబడతారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన కలిదిండి కుటుంబానికి చెందిన సుబ్బరాజు ఆధ్వర్యంలో కల్యాణోత్సవానికి తలంబ్రాలను తీసుకువస్తున్నారు. అలాగే శృంగవరపాడుకు చెందిన రావి, యెనుముల కుటుంబాలకు చెందిన వారు రథోత్సవం రోజున స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. పల్లకి ముందు భాగంలో రావి కుటుంబానికి చెందివారు... వెనుక భాగంలో యెనుముల కుటుంబాల వారు స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి రథం వరకు తీసుకు వస్తారు. ఇలా పలు కుటుంబాల వారు స్వామి వారి కళ్యాణంలో భాగస్వాములు.
లక్ష్మీనరసింహుడే ఇక్కడ ఆదిదేవుడు
సాధారణంగా పరమేశ్వరుడికే ఆదిదేవుడని పేరు. అయితే కలియుగంలో నర, మృగ అవతారంలో మొట్టమొదటిగా ఉద్భవించిన రూపం లక్ష్మీ నరసింహస్వామి. ఈ కారణంగా పరమశివుడినే కాకుండా లక్ష్మీ నర్శింహ స్వామివారిని కూడా ఆదిదేవునిగా కొలుస్తారు ఇక్కడ.
ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు కల్యాణోత్సవాలు
7వ తేదీ రాత్రి 12.55 గంటలకు కళ్యాణ ముహూర్తం
స్వామివారి కళ్యాణ తంతులో పలు కుటుంబాల భాగస్వామ్యం
మొగల్తూరు రాజ వంశీయులతోపాటు సామాన్య కుటుంబాల వరకు..
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక
– నిమ్మకాయల సతీష్ బాబు, వి.ఎస్.బాపూజీ
సాక్షి, అమలాపురం, సఖినేటిపల్లి
ఫోటోలు: గరగ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment