సాక్షి, విశాఖపట్నం: మహావిశాఖ నగరం.. భక్తజన సంద్రంగా మారింది. శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు సింహాచల గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహా్ననికి భక్తుల సంఖ్య లక్షలకు చేరింది. సంప్రదాయం ప్రకారం సింహగిరి దిగువన ఉన్న తొలి పావంచా వద్ద మధ్యాహ్నం 2.40 గంటలకు సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథ్, నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ కొబ్బరికాయ కొట్టి ప్రచార రథయాత్రని ప్రారంభించారు.
సింహాచలం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్డు, సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం.. వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఏటా గిరి ప్రదక్షిణ రోజు నగరంలో వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోంది.
ఆదివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో సింహాద్రి అప్పన్న మహిమ అంటూ.. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాల్లో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల్ని పరిశీలించారు. సముద్రస్నానం చేసే భక్తులకు అప్పూఘర్ వద్ద ఏర్పాట్లు చేశారు. అనేకమంది భక్తులు సముద్రస్నానం ఆచరించి మళ్లీ ప్రదక్షిణ కొనసాగించి.. స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు సీపీ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో 2,100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో భక్తులు గిరిప్రదక్షిణ సమయంలోను, స్వామి దర్శన సమయంలోను ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ చర్యలు చేపట్టారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మొత్తం 102 పాయింట్లలో 7.34 లక్షల మందికి మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించారు.
భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 31 వైద్య శిబిరాలను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. 20కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించాయి. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ వంతున మొత్తం 16 అంబులెన్స్‌లను ఉంచారు. గిరి ప్రదక్షిణ మార్గములో పలు స్వచ్ఛంద సేవాసంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా తాగునీరు, శీతలపానీయాలు, మజ్జిగ, టీ, బాదంపాలు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశాయి.
నేడు ఆషాఢ పౌర్ణమి
గిరి ప్రదక్షిణ అనంతరం సోమవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నని లక్షలాదిమంది దర్శించుకోనున్నారు. స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న క్యూ లైన్లకు అదనంగా క్యూ లైన్లను కొండపైన ఉన్న బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు.
సోమవారం ఆర్జితసేవల్ని రద్దుచేసిన దేవస్థానం.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతి వేళలుగా నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యాన్నదానం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment