పెళ్లి వేళ...మృత్యుహేల
► అల్వాల్ బ్రిడ్జిపై కారు-బైక్ ఢీ
► ప్రమాదంలో ముగ్గురి మృతి
► మృతుల్లో తాత, మనవరాలు
► మరో ఇద్దరి పరిస్థితి విషమం
► పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం
బొల్లారం: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న ఆ ఇంట్లో పెను విషాదం. మరో రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇల్లు కన్నీటి సంద్రంగా మారింది. అల్వాల్ బ్రిడ్జిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పెళ్లి కొడుకు తాత, మామ కూతురు మృతి చెందగా... మేనమామ, మేనత్త సహా ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. హృదయ విదారకమైన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలివీ... చంపాపేట విష్ణుపురి కాలనీకి చెందిన కృష్ణమాచారి (70) మనవడి (కూతురి కొడుకు) పెళ్లి ఈ నెల 30న జరుగనుంది. సోమవారం పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణమాచారి కుటుంబంతో సహా హకీంపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక తిరిగి చంపాపేటకు బయలుదేరారు.
కృష్ణమాచారి, ఆయన భార్య కౌసల్య (60), చిన్న కుమారుడు శ్రీనివాస్ చారి, కోడలు స్వప్న (32), వారి కుమార్తెలు మిల్కీ అలియాస్ వర్షిత (5), వైపీ (4), పెద్ద కొడుకు జగన్ పిల్లలు కమలి (7), సుదాన్ష్ (5), మరో బంధువు సాయికిరణ్ (22) కారులో (ఏపీ 29 బీబీ 4454)లో ఇంటికి వెళ్తున్నారు. బొల్లారం దాటాకఅల్వాల్ రైల్వే వంతెనపై వీరి కారును ఎదురుగా వేగంగా వస్తున్న పల్సర్ బైక్ (టీఎస్08 ఈఎన్ 1529) ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన కారు రైల్వే వంతెనపై నుంచి కింద పడిపోయింది. బైక్‌తో ఢీకొట్టిన శక్తిసింగ్ కూడా కింద పడిపోయాడు.
కారు ముందు సీట్లో కూర్చున్న కృష్ణమాచారి (70), ఆయన పెద్ద కుమారుడు జగన్ కూతురు కమలి (7) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన శక్తిసింగ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కారును నడిపిన శ్రీనివాస్ చారి, ఆయన భార్య స్వప్నల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కారు వెనుకే పెద్ద కుమారుడు
కృష్ణమాచారి పెద్ద కుమారుడు జగన్, తన భార్యతో కలసి కారు వెనకాలే బైక్‌పై వస్తున్నారు. అల్వాల్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కారు ప్రమాదానికి గురైనట్లు జగన్ గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకుని కారులోని తన కుటుంబ సభ్యులను బయటకు తీశారు. స్థానికుల సహకారంతో వారిని వెంటనే తిరుమలగిరిలోని స్టెర్లింగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిన కృష్ణమాచారి, కమలితో పాటు కారును ఢీకొట్టి తీవ్ర గాయాలపాలైన శక్తి సింగ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ శక్తిసింగ్ మృతి చెందాడు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే హకీంపేటలోని పెళ్లి బృందం పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఓ వైపు తన కుమార్తె కమలి, తండ్రి కృష్ణమాచారి కన్నుమూయడం... తమ్ముడు, మరదలు... మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉండటంతో జగన్ వేదన వర్ణనాతీతం. బంధుమిత్రుల రోదనలతో ఆస్పత్రి వద్ద మంగళవారం విషాదఛాయలు అలముకున్నాయి.
ఓవర్ లోడ్... అతివేగమే కారణమా?
బైక్ అతి వేగంగా రావడం... కారులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బొల్లారం నుంచి అల్వాల్ వైపు వెళ్తున్న కారు... రైల్వే బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో బైక్‌ను ఢీకొట్టి కుడివైపున ఉన్న రైతుబజార్ వైపు రోడ్డు కింద పడిపోవడం గమనార్హం. అల్వాల్ నంచి బొల్లారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ బ్రిడ్జి దిగుతున్న క్రమంలో మలుపులో అదుపు తప్పి కారుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. బైకును తప్పిం చుకునే క్రమంలో కారును నడిపిస్తున్న శ్రీనివాస్ కుడివైపునకు తిప్పి ఉండవచ్చని తెలుస్తోంది.
శక్తిసింగ్ సోదరుడి ఫిర్యాదు
రాంగ్ రూట్‌లో వచ్చి తన సోదరుడి బైక్‌ను ఢీకొట్టడంతోనే అతను మృతి చెందాడని మృతునిసోదరుడు రాణా ప్రతాప్ సింగ్ బొల్లారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డిక్కిలో పడుకొని....
ప్రమాదానికి గురైన కారులో ఐదుగురు పెద్ద వారితో పాటు నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మృతి చెందిన కమలి ముందు సీట్లో కూర్చుంది. వెనుక సీట్లో కూర్చున్న చిన్నారులు సుదాన్ష్, వైపీకి సైతం గాయాలయ్యాయి. డిక్కీలో పడుకున్న వర్షిత స్వల్ప గాయాలతో బయటపడింది.