
బ్రేకులు ఫెయిలై.. బీచ్‌రోడ్డులోకి దూసుకుపోయి..
తప్పిన పెను ప్రమాదం
పార్కులోకి చొచ్చుకెళ్లిన లారీ
అల్లిపురం: మంగళవారం ఉదయం 6.50 గంటలు.. ప్రభాత వేళ సముద్రపు అలలు తీరాన్ని తాకుతుండగా, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక్కసారి పెద్ద శబ్దం. ఇసుక లారీ సృష్టించిన బీభత్సం. నోవాటెల్ హోటల్ రోడ్డులో పైనుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై బీచ్‌రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో బీచ్‌రోడ్డులో వాహనాల నిషేధం అమలులో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. మరో పది నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటే, ఊహించని ఘోరం జరిగిపోయేది. ఈ ఘటనలో ఒక పాదచారికి గాయాలు కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివీ..
శ్రీకాకుళం నుంచి ఫిషింగ్ హార్బర్‌కు 40 టన్నుల ఇసుకతో ఓ లారీ బీచ్‌రోడ్డు మీదుగా వస్తోంది. బీచ్‌రోడ్డులో నగర ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వేకువజాము 4.30 నుంచి ఉదయం 7 గంటల వరకు, వీఎంఆర్డీఏ పార్కు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ వాహనాల నిషేధం ఉంటుంది. వీఎంఆర్డీఏ పార్కు వద్ద రోడ్డు మూసివేసి ఉండటంతో లారీ డ్రైవర్ ఏయూ మీదుగా పందిమెట్ట పైనుంచి నోవాటెల్ డౌన్‌కు దిగాడు. ఆ సమయంలో లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి, బీచ్ వైపు దూసుకుపోయింది. ప్రమాదాల నివారణకు రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద ప్లాస్టిక్ ఇసుక డబ్బాలను ఢీకొట్టింది.
ఫుట్‌పాత్ మీదుగా గోడను ఢీకొట్టి, అవతలి వైపు సర్వీసు రోడ్‌లోకి ఎగిరిపడి.. పార్కులోకి చొచ్చుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెల్లివీధికి చెందిన తుపాకుల వెంకట రవికుమార్ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్.కె.బీచ్‌కు వాకింగ్‌కు వెళ్తుండగా, ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పార్కు గోడ దెబ్బతింది. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగించారు. రవికుమార్‌ను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో ఇక్కడే రెండు ప్రమాదాలు
గతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కాగా.. బస్సులో పిల్లలు లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ప్రమాదంలో ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రక్షణ గోడను ఢీకొట్టి అవతలి వైపు గల సర్వీ సు రోడ్డులోకి వెళ్లింది. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి తన కుటుంబంతో సహా అక్కడ సేదతీరుతున్నారు. ఈ ప్రమాదంలో అతని తండ్రి చనిపోగా, అధికారికి కాళ్లు విరిగిపోయాయి. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment