
చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా రాణిస్తున్న యోగిబాబు రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొంత సమయం క్రితం సోషల్‌మీడియా ద్వారా ఒక పోస్ట్ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కల్పిత వార్తల పట్ల తాను చింతిస్తున్నట్లు యోగిబాబు తెలిపారు.

చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగిబాబు మరణించారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్ అయిపోయింది. దీంతో యోగి బాబు తన ఎక్స్ పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. 'నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కానీ, ఆ కారులో ఉన్నది నేను కాదు. కనీసం నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు.
సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను. తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతులు వంటి అనేకమంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని ఆయన తెలిపారు.
Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q
— Yogi Babu (@iYogiBabu) February 16, 2025