
తమిళ నటుడు కాదల్ సుకుమార్ కోలీవుడ్‌లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. శింబు కాదల్ వావ్తిల్లై (కుర్రాడొచ్చాడు), కమల్ హాసన్ విరుమాండి(పోతురాజు) వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుని ఛాన్సులు అందుకున్నాడు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన కాదల్ (ప్రేమిస్తే) చిత్రంలో అతని నటనకు ప్రశంసలు లభించినందున అతన్ని కాదల్ సుకుమార్ అని పిలుస్తారు. ప్రస్తుతం తిరుట్టు విశీల్, షుమ్మవే ఆడువోమ్ అనే 2 చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌లు కూడా ఆర్ధాంతరంగానే ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాల్లో నటించే ఛాన్స్‌లతో పాటు కొత్తగా దర్శకత్వం వహించడానికి కూడా అవకాశాలు తగ్గిపోయాయి.
కాదల్ సుకుమార్ యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గత జనవరిలో చైన్నె టీనగర్ ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఒక నటి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు కాదల్ సుకుమార్ తనను పెళ్లి చేసుకుంటానని, 3 సంవత్సరాలు కుటుంబాన్ని పోషిస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 7 లక్షలు డబ్బుతో పాటు నగలు తీసుకుని మోసం చేశాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సుకుమార్‌పై కేసు నమోదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలని అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది.
కాదల్ (ప్రేమిస్తే) సినిమా తెలుగులో కూడా విడుదలైంది. దీనిని దర్శకుడు శంకర్ తన బ్యానర్‌పై తక్కవ బడ్జెట్‌తో నిర్మించారు. భరత్, సంధ్యలకు పెళ్లి జరిపించిన స్టీఫెన్ పాత్రలో సుకుమార్ కనిపిస్తాడు. ఈ పాత్రతో అతనికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా అతను సుపరిచయమేనని చెప్పవచ్చు.