
మాలీవుడ్‌లో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్‌తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి.
మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు.
థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్‌తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు.