నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది.
కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.
కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్‌తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment