బాల్యం అమూల్యం, ఆ అమూల్యమైన బాల్యం దృఢంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుం టుంది. బాల్యం బాగా లేకపోతే పౌరులు కూడా ఊసురోమని తయారౌతారు. మన నాయకులు స్వచ్ఛ భారత్ అంటున్నారు. బేటీ బచావ్– బేటీ పడావ్ అంటున్నారు. ఇంకా చాలా నినాదాలిస్తున్నారు. కానీ ఈ నినాదాలు నిజరూపం దాల్చడం లేదు. 28 శాతం మంది పిల్లలు బాల కార్మికులుగా బతుకు బండిని లాగుతున్నారనీ, అమ్మాయిల్లో 31 శాతం మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయనీ, పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒకరు మొదటి జన్మదినం చూడకుండానే కన్నుమూస్తున్నారనీ, 11 శాతం మంది పిల్లలు మాఫియా చేతుల్లో మగ్గిపోతున్నారనీ, సర్కారు వారి గణాం కాలే సెలవిస్తున్నాయి.
పరిస్థితి ఈ విధంగా ఉంటే పెద్దలు నినాదాలకే పరిమితమైతే పిల్లలు బాగుపడేదెన్నడు? సత్పౌరులుగా ఎదిగేదెన్నడు? ఈ దేశం బాగుపడేదెప్పుడు అనే ప్రశ్న ప్రతి వారినీ పీడించేదే. స్వచ్ఛ భారత్ అని సెలవిస్తూ కోట్లు తగలేస్తున్నవారు, ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌లో చెత్తకుప్పల దగ్గర విషాహారం తిని ఐదుగురు అమాయక పిల్లలు చనిపోవడం స్వచ్ఛభారత్‌కి మచ్చకాదా? మున్సిపాలిటీ చెత్త బళ్లు లాగుతున్న బాల, బాలికలు అనునిత్యం దర్శనమిస్తుంటారు. మీ స్వచ్ఛ భారత్ పిల్లల్ని పక్కనబెట్టి పెద్దలకు పరిమితమైందా?
ఇక బేటీ పడావ్– బేటీ బచావ్ అన్న నినాదానికి వస్తే ఉన్న స్కూళ్లను మూసేస్తుంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు. బేటీ బచావ్ అనే మీ నినాద తీవ్రత ఎంతవరకు వెళ్లిందంటే 2014 నుంచి నేటి వరకు బాలికలపై 7 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగాయి. ఇవి కేవలం పోక్సో చట్ట ప్రకారం నమోదైన లెక్కలు మాత్రమే. బాలికలపై అత్యాచారాలు చేసి చెరపట్టిన వారిలో ప్రజా ప్రతినిధులు సహితం ఉన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు.
ప్రజల కోసమే పుట్టానని ప్రగల్భాలు పలికే ఓ ముఖ్యమంత్రి గారి ఏలుబడిలో ఒకే జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 18 అత్యాచారాలు జరిగాయి. ఇది సిగ్గు చేటైన విషయం కాదా? అమ్మాయిల చదువును ప్రోత్సహిస్తారా లేక షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి అని పెళ్లి చేసుకొని పరాన్నభుక్కుగా వర్ధిల్లమని దీవిస్తారా?
అర్ధరాత్రి పెద్దనోట్ల రద్దు అని ప్రకటన చేసి ప్రజల్ని పరుగులు పెట్టించిన పెద్దలు, బాల కార్మిక వ్యవస్థ రూపు మాపడానికి అలాంటి ప్రకటన చేసి ఓ గడువు విధించి అనంతరం మీ వద్ద బాల కార్మికులుంటే కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేస్తే బాల కార్మిక సమస్య తీరిపోదా, కేవలం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అని కోట్లు ఖర్చు చేసి తద్దినాల్లా తంతు ముగిస్తే సరిపోతుందా.
పిల్లలు విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవనం, ఆటపాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట–పాటల సౌకర్యాలు కల్పించి బాల బాలికలను భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటే భావి తరం మిమ్మల్ని క్షమిస్తుందా, పిల్లలను అనేక వ్యాధుల నుంచి దూరం ఉంచే పౌష్టికాహారం, కనీసం రక్షిత మంచినీరు అందించలేని మీరు చిన్నారుల ముందు దోషులు కాక మరేమౌతారు అని ప్రశ్నిస్తున్నది. బాలల హక్కుల కమిషన్లను సహితం నీరుకారుస్తూ, పిల్లల హక్కులని ఎందుకు కాలరాస్తున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా? దోషులుగా నిలబడతారో? బాలవీరులుగా పిల్లలను తీర్చిదిద్ది చరిత్రలో వీరులుగా నిలిచిపోతారో కేంద్ర, రాష్ట్ర పాలకులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
రచయిత: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం
మొబైల్ : 93910 24242
Comments
Please login to add a commentAdd a comment