పిల్లలు తమ తల్లిదండ్రుల కంటి దీపాలు. వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో దేదీప్యమానంగా వెలుగుతుండటమే తల్లిదండ్రులు, పెద్దలు కోరుకునేది. ఈ నెల 14వ తేదీ బాలల దినోత్సవం. ఈ సందర్భంగా... పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పెద్దలు గమనించాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని అంశాలివి...
అప్పుడే పుట్టిన పిల్లలకు ఏడుపే వాళ్ల భాష. తమ తాలూకు బాధలను పెద్దలకు తెలియజెప్పడానికి వాళ్లు ఏడుపునే సాధనంగా ఎంచుకుంటారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి.
పిల్లల్లో ఏడుపుకు కొన్ని కారణాలు
ఆకలి వేసినప్పుడు,
భయపడినప్పుడు, ∙దాహం వేసినప్పుడు
ఒక్కరే ఉండి బోర్‌గా అనిపించినప్పుడు ∙పక్క తడి అయినప్పుడు,
వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు
కాంతి బాగా ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా పళ్లు వస్తున్నప్పుడు,
ఇన్‌ఫెక్షన్‌లు ముఖ్యంగా యూరినరీ ఇన్‌ఫెక్షను వచ్చినప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్)
జ్వరం జలుబు, చెవినొప్పి వంటి సాధారణ లేదా కొన్ని తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారా తెలియజేస్తారు.
1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు.
ఇన్‌ఫెన్‌టైల్ కోలిక్...
చిన్న పిల్లల్లో ఏడుపుకు ముఖ్యమైన కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆకలి వేయడంగానీ, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్‌కు కొన్ని కారణాలు.
ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్, కడుపులోని గాలి వెళ్లిపోయేందుకు తేన్పు వచ్చేలా చూడటం అంటే ఎఫెక్టివ్ బర్పింగ్‌తో ఏడుపు మాన్పించవచ్చు.
చికిత్స వరకు వెళ్లాల్సివస్తే... కొందరికి యాంటీస్పాస్మోడిక్స్‌తో పాటు బాగా అవసరమైన పరిస్థితుల్లో మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనేవి ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి.
ఏడాది నుంచి రెండేళ్ల వరకు...
ఏడాది వయసు నుంచి పిల్లలు కొద్దికొద్దిగా సపోర్ట్ తీసుకుంటూ నిలబడుతుండటం, కొద్ది కొద్దిగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మళ్లీ పడిపోతూ, మళ్లీ నిలబడుతుండటం చేస్తుంటారు. వీళ్లు నిలబడుతుండటానికి సపోర్ట్ ఇస్తూ ఆడుకునేలా చేస్తుండాలి. ఈ టైమ్‌లోనే పిల్లలు రివాల్వింగ్ చైర్స్ వంటివి పట్టుకుని నిలబడానికి ప్రయత్నించినప్పుడు అవి చక్రాల మీద జారిపోయి, పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇక ఏ వస్తువును పడితే ఆ వస్తువును కదిలించడానికి ప్రయత్నించడం, సొరుగులు లాగేయడం వంటివి చేస్తుంటారు. ఈ సమయాల్లో వారి వెనకే ఉంటూ ప్రోత్సహిస్తూనే, వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.
రెండేళ్ల వయసు నుంచి స్కూలుకు వెళ్లే సమయం వరకు...
ఈ టైమ్‌లో పిల్లలను కాస్త ఆరుబయట ఆడనివ్వాలి. వాళ్లు ఆరుబయటకు వెళ్తుంటే భయపడకుండా కాస్త నీరెండలోకి, మట్టిలోకి వెళ్లడానికి అనుమతించాలి. కాకపోతే ఎండ నేరుగా తగలకుండా హ్యాట్ లాంటిది వాడటం, ఒళ్లంతా కప్పి ఉంచేలా దుస్తులు తొడగడం, అవసరమైతే 30 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
కాకపోతే ఆరుబయట ఆడుకుని వచ్చాక వాళ్ల ఒళ్లు తుడిచి, చేతులు శుభ్రంగా కడగాలి. మట్టితో ఆడుకోనివ్వని పిల్లల కంటే అలా ఆడుకున్న చిన్నారులకే ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మూడు నుంచి ఐదేళ్ల వయసుకు..
ఈ వయసులో చిన్నారులు ఇతర పిల్లలతో కలిసి ఆడుతుంటారు. అలా ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఈ టైమ్‌లో ట్రైసైకిల్ లేదా సైకిల్ నేర్చుకునేలా సపోర్ట్ చక్రాలున్న సైకిల్, బంతిని విసిరి పట్టుకునే ఆటలు (థ్రోయింగ్ అండ్ క్యాచింగ్), గెంతడం, స్కిప్కింగ్, డాన్సింగ్ వంటి యాక్టివిటీస్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ వయసు పైబడిన పిల్లలు, వాళ్ల వయసుకు తగినట్లుగా కాస్తంత పెద్ద ఆటలను ఆడేలా చూడాలి.
అన్ని టీకాలూ టైముకు ఇప్పించడం...
పిల్లలకు ఆయా సమయాల్లో ఇప్పించాల్సిన టీకాలు (వ్యాక్సినేషన్) తప్పక ఇప్పించాలి. ఈ టీకాల షెడ్యూలు చిన్నపిల్లల డాక్టర్లందరి దగ్గరా ఉంటుంది. వారిని సంప్రదించి... డీటీఏపీ, ఫ్లూ, హెచ్‌ఐబీ, ఎమ్‌ఎమ్‌ఆర్, పోలియో, రొటా వైరస్ మొదలైన వ్యాక్సిన్లు అన్నింటినీ ఆయా సమయాలకు ఇప్పిస్తూ ఉండాలి.
ఆహారం విషయంలో...
పాలు మరిచిన పిల్లలకు మొదట్లో గుజ్జుగా చేసిన అన్నం, పప్పు, నెయ్యి వంటి ఆహారాన్ని అందిస్తూ, క్రమంగా ఘనాహారం వైపు మళ్లించేలా చేయాలి. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటూ మార్కెట్లో లభ్యమయ్యేవాటి కంటే ఇంట్లో ఆరోగ్యకరమైనన పరిస్థితుల్లో వండిన భోజనాన్ని తాజాగా అందిస్తుండటమే మేలు.
‘క్లీన్ ప్లేట్ రూల్’ వద్దు...
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కొందరు తల్లులు తాము ప్లేట్‌లో వడ్డించినదంతా పిల్లలు తినేయాలని అనుకుంటుంటారు. పిల్లలను ఘనాహారం వైపు మళ్లించే వీనింగ్ ప్రక్రియ సమయంలో ప్లేట్‌లో పెట్టిందంతా పిల్లలు తినేయాలని అనుకోవద్దు. కడుపు నిండిన వెంటనే వారు తినడానికి విముఖత చూపుతారు. అప్పుడు ఫీడింగ్ ఆపేయాలి. ఈ ‘క్లీన్ ప్లేట్ రూల్’ బదులుగా చిన్నారులకు చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినిపించడం మేలు.
ఇక పిల్లలు కాస్త ఎదిగాక అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పీచు పుష్కలంగా ఉండేలా పొట్టుతీయని కాయధాన్యాలతో వండిన అన్నం, మాంసాహారం తినిపించేవారు చికెన్, చేపలు, తాజా పండ్లతో కూడిన ఆహారాలు అందిస్తూ వారికి అన్ని పోషకాలు అందేలా జాగ్రత్త తీసుకోవాలి. వారు మితిమీరి బరువు పెరగకుండా ఉండేందుకు నెయ్యి, వెన్న వంటి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఉప్పు వంటి వాటిని పరిమితంగా ఇవ్వడం మేలు.
పిల్లలకు తినిపించేటప్పుడు తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, వారు ముద్ద నమిలి మింగేవరకు ఆగి, అప్పుడు మరో ముద్ద పెట్టడం, ఆహారం వారికి ఇష్టమయ్యే రీతిలో చాలా రకాల (వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్) ఆహారాలను మార్చి మార్చి రుచిగా, కాస్తంత గుజ్జుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
ఇక పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పెద్దలు వాళ్లతో కమ్యూనికేట్ అవుతూ ఉండటం, వాళ్ల ఫీలింగ్స్ గురించి మాట్లాడటం, ప్రతికూల ఆలోచనలను, ధోరణులను దగ్గరికి రాకుండా చూడటం, వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుండటం, వాళ్ల సెల్ఫ్ ఎస్టీమ్‌కు భంగం రానివ్వకుండా ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడటం, మొదట్లో చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచి, వాటిని నెరవేర్చగానే చిన్న చిన్న బహుమతులు అందిస్తూ ప్రోత్సాహపూర్వకంగా ప్రశంసించడం, వారికై వారు తమ లక్ష్యాలను మెల్లగా పెద్దవిగా చేసుకునేలా చూడటం, విఫలమైనప్పుడు ఏమాత్రం నిరుత్సాహపరచకుండా మరింత ప్రోత్సహించడం చేస్తూ వాళ్లు అన్నివిధాలా మానసిక, శారీరక ఆరోగ్యాలతో ఎదిగేలా చేయాలి.
(చదవండి: పిల్లలూ దేవుడూ చల్లని వారే)
Comments
Please login to add a commentAdd a comment