తెలుగు సినిమాలలో బాలల పాత్రలు పాడిన పాటలు
పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.
‘లేరు కుశలవుల సాటి...
సరి వీరులు ధారుణిలో’....
‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!
చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.
చిన్నప్పుడు పెద్దప్పుడు:
పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక –
‘రావిచెట్టు తిన్నె చుట్టు
రాతి బొమ్మలు చెక్కాలోయ్
మంచి బొమ్మలు చెక్కాలోయ్
నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్’
అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.
‘ఓ దేవదా.. చదువు ఇదేనా
అయ్యవారు నిదరోతే తమరు
ఇలాగే దౌడుదౌడా’...
ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–
‘కలలు పండే కాలమంతా
కనుల ముందే కదిలిపోయే
లేత మనసుల చిగురుటాశ పూతలోనే
రాలిపోయే నిదురపోరా తమ్ముడా’...
అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.
బొమ్మల పెళ్లి:
నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.
చేదాము రారే కల్యాణము...
చిలకా గోరింక పెళ్లి సింగారము...
‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...
తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్‌ప్రెషన్ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?
చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకు
పెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లి
మర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:
పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.
అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే
ఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్ చదివితే
పరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?
ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.
తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...
కె.విశ్వనాథ్ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!
మారాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు
మామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...
భక్తి... దైవభక్తి:
పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్.
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
మరోపాట–
జీవము నీవే కదా...
నేటికీ నిలిచి ఉన్నాయి.
ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.
పిల్లలూ దేవుడూ చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే...
‘మూగనోము’లో–
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే....
సంభ్రమం... సందేహం:
పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–
అడిగానని అనుకోవద్దు
చెప్పకుండా దాటేయొద్దు
ఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రం
ఆ రోజుల్లో ఫోన్ ఒక వింత. ఇంట్లో ఫోన్ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్ ట్రింగ్’మన్నప్పుడల్లా సరదా. ఫోన్ రాకపోయినా రిసీవర్ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.
బూచాడమ్మ బూచాడు
బుల్లి పెట్టెలో ఉన్నాడు
కళ్లకెపుడు కనపడడు
కబురులెన్నో చెబుతాడు...
అనుబంధాల పాట:
పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...
నీకన్నా నాకెవరే...
‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...
చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలయ్యాము
ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్.
పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జోజోజో...
ఇక పిల్లలకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.
గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...
పాపం పసివాడు:
ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్ చేయగలదు. ‘లాస్ట్ ఇన్ ద డెజర్ట్’ అనే ఇంగ్లిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.
అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలి
నాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...
అంజలి అంజలి అంజలి:
ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్ కొట్టారు. గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల కోసం తీసిన చివరి హిట్ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.
అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.
పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.
ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వు
తెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్‌బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది.
‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం.
ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్.టి.ఆర్ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు.
‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్.. పారా హుషార్... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు.
Comments
Please login to add a commentAdd a comment