పిల్లలకు బంధువులంటే ఇష్టం. బాబాయ్, మావయ్య, పెదనాన్న, పిన్ని, అత్తయ్య, అమ్మమ్మ... బంధువులొస్తే వీరికి సంబరం. కాని దురదృష్టవశాత్తు కొందరు పిల్లలకు బంధువులుండరు. ఒకోసారి అమ్మో, నాన్నో కూడా వారితో వీరికి బంధువుగా మారి ఆదుకుంటోంది ‘వాల్మీకి గురుకులం’ అనే శరణాలయం. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి ఈ పిల్లలనుతానొక బంధువుగా కలిసింది. ఈ సమాజమే ఇటువంటి బాలలకు బంధుగణం అని మాట కలిపింది.
అక్కడున్న పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. అందరూ కలిసి ఆడుకుంటూ భోజనం చేస్తూ ఒకేచోట గడుపుతూ మనమంతా ఒకరికొకరం అనే స్థయిర్యంతో బతుకుతారు. అయితే ఒక్కోసారి వారిని దిగులు కమ్ముకోవచ్చు. అమ్మో నాన్నో గుర్తుకు రావచ్చు. ఆ సమయాన్ని మనం దాటించగలగాలి. ఇలాంటి చోటుకు వీలున్న సమయాలలో వెళుతూ పలకరిస్తూ ఉంటే, వారితో సమయం గడుపుతూ ఉంటే వారి లోకం మనకు పరిచయం అవుతుంది. వారి చిరునవ్వుకు మన చిరునవ్వు తోడైతే కారే కన్నీరు తోక ముడుస్తుంది.
అందుకే రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపానప్రొద్దుటూరులో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో సుమారు 50 మంది చిన్నారులు దర్శకుడు సుకుమార్ కుమార్తె, చైల్డ్ సెలబ్రిటీ అయిన సుకృతిని చూసి కేరింతలు కొట్టారు. షేక్‌హ్యాండ్‌లు ఇచ్చారు. సరదా కబుర్లతో సమయమే తెలియలేదు అన్నట్టుగా గడిపారు.నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడి పిల్లల కోసం సుకృతి తెచ్చిన పండ్లు, చాక్లెట్లతో తియ్యని వేడుకగా మారింది. వంటి తియ్యటి కార్యక్రమమిది. ఇక సుకృతి తెచ్చిన పుస్తకాలు ఒక మంచి కానుక వారికి. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలు తమ గురించి తాము సుకృతితో మనసువిప్పి మాట్లాడారు.
ఈ బాధ్యత మనందరిదీ...
‘సాక్షి’ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్లే ఇలాంటి చిన్నారుల సామాజిక, మానసిక స్థితిగతులపైన అవగాహన వచ్చింది. వీళ్లూ నాలాంటి చిన్నారులే.. వీళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నాయో చూస్తే ఆశ్చర్యమేసింది. చదువులతో పాటు డ్యాన్సులు చేస్తున్నారు, క్రీడల్లో రాణిస్తున్నారు. వారు వచ్చిన నేపథ్యం వేరు.. ఇక్కడ పొందిన పరిపక్వత వేరు. వారి మదిని తడిమి చూస్తే మాత్రం ఊహించని వేదన దాగుంది. అది మనం తీర్చలేనిది. కానీ వీలైనంత ఆత్మీయత,ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత.
నేను ఇక్కడ పిల్లలు అందరితో కలిసి డ్యాన్సులు చేశాను. వారు నాకిష్టమైన అల్లు అర్జున్ గురించి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ పారిస్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్ సితార గురించి, నా చదువులు, లక్ష్యాలు ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పచ్చని పొలాల మధ్య ఉన్న వాల్మీకి గురుకులం నాకో మధుర ఙ్ఞాపకం గా నిలిచిపోతుంది. నాన్న తెరకెక్కిస్తున్న పుష్ప–2 విషయాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. నా ఆలోచనల్లో చాలా మార్పులకు ఈ విజిట్ కారణమైంది.
– సుకృతి
లైబ్రరీ... కల్చరల్ టూర్
మా దగ్గర 55 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం యుక్త వయసు వచ్చిన చిన్నారుల్ని అనాథ ఆశ్రమంలో ఉంచకూడదు... కాబట్టి ఆ వయసుకొచ్చిన 15 మందిని ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీల్లో చదివిస్తూ, హాస్టల్స్‌లో చేర్చాం. అనాథలు, నిరుపేద పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ స్టైల్ పేరుతో వంద మందికి సరిపడేలా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. డైనింగ్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని నిర్మిస్తున్నాం. మా సేవలన్నీ దాతల విరాళాలపైనే నిర్వహిస్తున్నాం. పిల్లలకు చదువులు మాత్రమే కాదు... వినూత్న అనుభవాలు, ఆలోచనలు కల్పించాలనే లక్ష్యంతో కల్చరల్ టూర్‌ను ప్లాన్ చేశాం.
ఇందులో భాగంగా చెన్నైలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలకు ఇక్కడ 4 రోజుల విడిది కల్పించి విభిన్నప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక, అధునాతన జీవనశైలి పై అవగాహన కల్పించాం. మరికొద్ది రోజుల్లో మా చిన్నారులను కూడా చెన్నైకు తీసుకెళ్లనున్నాం. అంతేకాకుండా మా పిల్లలందరినీ విమానంలో గగనతల విహారం చేయించాం. న్యూట్రిషన్ కోసం ఎగ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్మీకి పిల్లల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు గుడ్లు అందిస్తున్నాం. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదల విద్యకు 500కు పైగా సైకిళ్లను అందించాం.
– హరి కిషన్ వాల్మీకి, సంస్థ నిర్వాహకులు
స్ఫూర్తిదాయకమైనది
నేను ఆమెరికాలో ఆంకాలజీ డాక్టర్ గా పని చేశాను. గత కొన్నేళ్లుగా ఇక్కడి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనే ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. ఏడాదికి సరిపడా ఫీజులు ఒకేసారి చెల్లిస్తాను. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు బయటకు వెళుతుంటే కాస్త బాధగానూ, అంతకు మించిన సంతోషంగానూ ఉంటుంది.
– డా. రోహిణీ , సంస్థకు ప్రధాన సహాయకురాలు
ఎప్పుడూ చిల్డ్రన్స్ డేనే
మాకెప్పుడూ చిల్డ్రన్స్‌డేలానే ఉంటుంది. ఇక్కడ అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వీరు అందించిన ఏ సహకారాన్ని వృ«థాగా పోనివ్వను.
– మారుతి
మాదో కుటుంబం
మేముంటున్న ‘వాల్మీకి గురుకులం’ అనా«థ ఆశ్రమంలా అనిపించదు. మాదో పెద్ద కుటుంబం. సౌకర్యాలు, వసతులే కాదు.. ఇక్కడ ప్రేమ, ఆప్యాయతలకు కొదువ లేదు. మాకెప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు. కాకపోతే రోజూ 14 కిలోమీటర్లు స్కూల్‌కు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ఎవరైనా దాతలు సహకారమందిస్తే వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాం.
– గౌతమ్ సాయి
ఇదే గురుకులానికి హెల్ప్ చేస్తా
నేను బాగా చదువుకుని, మంచి జాబ్ చేస్తూ ఇదే గురుకులంలోని మరి కొందరు చిన్నారులకు సహకారం అందించాలనుంది. ఇవాళ వచ్చిన సుకృతి అక్క మాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా విషయాలు చెప్పింది. సినిమా హీరోలు ఎలా ఉంటారు... వారి జీవితాలు ఎలా గడుస్తాయి.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాను.
– అనిల్
ప్రేమ, తోడ్పాటు కావాలి
అప్పుడప్పుడు బాధ అనిపించినా ఇక్కడ ఆ ఆలోచనలకు తావు లేదు. మేం చాలా గౌరవంగా, ఆరోగ్యంగా మంచి చదువులను పొందుతున్నాం. జాలి, దయ కన్నా ప్రేమ, తోడ్పాటు జీవితాన్ని ముందుకు తీసుకెళతాయని తెలుసుకున్నాను.
– భాను ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment