
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది.
చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.
‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్‌ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్‌రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి.
– 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్
∙అవార్డు అందుకుంటున్న సుకుమార్
మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్‌లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్‌గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్.
– ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్
నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా.
– నటి రమాప్రభ
‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు.
– జలంధర, చంద్రమోహన్ సతీమణి
చంద్రమోహన్‌గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్‌గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్‌గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్‌మెంట్‌కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు.
– నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు.
– నిర్మాత యలమంచిలి రవిశంకర్
‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్‌ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం.
– హీరోయిన్ మీనాక్షీ చౌదరి
నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు.
– హీరో కిరణ్ అబ్బవరం
మా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం.
– హీరో తేజ సజ్జా
‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం.
– దర్శకులు సుజిత్ అండ్ సందీప్
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం.
– దర్శకుడు యదు వంశీ
‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది.
– హీరో ధర్మ
ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్.
– డైరెక్టర్ దుష్యంత్
ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు.
– నిర్మాత ధీరజ్ మొగిలినేని
మా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు.
– హీరో సుహాస్
వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్
– హీరోయిన్ ఎన్. శివాని
‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను.
– హీరో నాని
‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు.
– హీరోయిన్ మృణాల్ ఠాకూర్
‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్‌ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను.
– డైరెక్టర్ శౌర్యువ్
మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి
‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది.
– నిర్మాత హర్షిత్ రెడ్డి
‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు.
– నిర్మాత ఎస్‌కేఎన్
‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం.
– దర్శకుడు సాయి రాజేశ్
2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్‌మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్‌గా ఉంది.
– హీరోయిన్ వైష్ణవీ చైతన్య
‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్‌గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది.
– దర్శకుడు వేణు యెల్దండి
నన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు.
– డైరెక్టర్ కల్యాణ్ శంకర్