మన భాగ్యనగరం, హైదరాబాద్ అనగానే బిర్యానీ, కేఫ్‌లు, వివిధ కమ్మని వంటకాలు ఒక్కసారిగా గుర్తొస్తాయి. అలాంటి హైదరాబాద్‌లో భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఓ బేకరీలోని బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తినేవారట. ఆయన మెనూలో తప్పనిసరిగా ఆ బేకరీ అల్పాహారం ఉంటుందట. బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ నెహ్రూ ఇష్టపడే హైదరాబాద్ బేకరీ, దాని విశేషాలు గురించి చూద్దామా..!
మన భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) గారి జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లలంటే నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని బలంగా విశ్వసించేవారు.
ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. పిల్లల అభివృద్ధికి వారి సంక్షేమానికి ఎంతో కృషి చేయడంతో ఆయన పుట్టిన రోజు అయిన నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన మన భాగ్యనగరంలో మెచ్చిన బేకరీ, దాని కథాకమామీషు ఏంటో చూద్దాం.
హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ల తోపాటు ఉస్మానియా బిస్కెట్లుకు ఫేమస్. ఇక్కడ లాబొనెల్ బేకరీ, కరాచీ బేకరీ వంటి అనేక రకాల బేకరీలు కూడా ప్రసిద్ధిగాంచినవే. వాటిలో మన జవహర్‌లాల్ నెహ్రూ అల్పాహారంలో భాగమైన బేకరీ బ్రెడ్ ఒకటి ఉంది. అదే సుభాన్ బేకరీ. దీన్ని 1948లో సయ్యద్ ఖాదర్ స్థాపించారు. ఇది ఐకానిక్ బేకరీ దమ్ కే రోట్, ఖరీస్, క్లాసిక్ ఉస్మానియా బిస్కెట్లకు పేరుగాంచింది.
ఈ సయ్యద్ బేకరీ ప్రారంభించడానికి ముందు సికింద్రాబాద్‌లో బ్రిటిష్ రెజిమెంట్‌కు బ్రెడ్ సరఫరా చేసే బేకరీలో పనిచేశాడు. ఆ తర్వాత చిన్న గ్యారేజీలో బ్రెడ్ అమ్ముతూ హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌కు వెళ్లాడు. అతడి బ్రెడ్ తయారీలోని నాణ్యతకు విపరీతమైన ప్రజాదరణ రావడంతో ఖాదర్ వ్యాపారం బాగా పెరిగింది. అలా నాంపల్లిలో బేకరీని స్థాపించే స్థాయికి చేరుకున్నాడు. ఆ బేకరీకి తన కొడుకు సుభాన్ పేరు పెట్టాడు. అలా క్రమంగా ఈ సుభాన్ బేకరీ హైదరాబాద్‌లోనే నెంబర్ వన్ బేకరీగా మంచి పేరుతెచ్చుకుంది. ఔ
1950వ దశకంలో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సుభాన్ బేకరీలోని రొట్టెల రుచికి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఈ బ్రెడ్‌ని తన అల్పాహారంలో భాగంగా చేసుకుని ఆస్వాదించడం ప్రారంభించారు నెహ్రూ. ముఖ్యంగా మన హైదరాబాద్‌కు వస్తే తన రోజువారీ అల్పాహారంలో భాగంగా ఆ బేకరీ బ్రెడ్‌ని తీసుకురావాలని పట్టుబట్టేవారని సమాచారం. దీంతో సుభాన్ బేకరీ మరింత పేరురావడమే గాక నగరంలోని నవాబులు, ఇతర ప్రముఖులు, సెలబ్రిటీలు కస్టమర్ల అవ్వడం మొదలైంది.
అయితే 1960లలో విపరీతమైన పోటీ పెరగడంతో పెద్ద బేకరీలు మార్కెట్‌లోకి ప్రవేశించడంతో సుభాన్ బేకరీకి పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఖాదర్ వారుసులు దీన్ని మరింత మెరుగపరిచి విభిన్నమైన రుచులతో కూడిన ఆహారపదార్థాలను అందిస్తూ ఆహార ప్రియుల మన్ననలను అందుకుంటున్నారు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment