beti bachao beti padavo
-
నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య
జాతీయ బాలికా దినోత్సవం ఏటా జనవరి 24న జరుపుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశాలు... బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, అత్యాచారాలపై అవగాహన కల్పించడం,; విద్య, ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి బాలికా దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకుని భారత్ 2008 నుండీ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆడ, మగ – ఇద్దరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ లింగవివక్షతో గర్భంలో ఉండగానే స్కానింగ్లతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇప్పటికీ గర్భస్రావం చేయిస్తున్నారు. మన సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని ఆడ శిశువుల అంతానికి ఉపయోగించడం దారుణం. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలు ఉన్నారు. దీంతో దేశంలో ఇప్పుడు మగ పిల్లలకు వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకని దుఃస్థితి వచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా బాలికల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. 2015 లో ‘బేటీ బచావో, బేటీ పఢావో’, ‘షాదీ ముబారక్’ వంటి పథకాలు బాల్య వివాహాలను కొంతవరకు తగ్గించాయి. స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యా వంతులు అవుతారని భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఆనాటి నుండి నేటి వరకూ బాలికల విద్య నిర్లక్ష్యానికి గురి అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 82 శాతం మగవారు, 65 శాతం బాలికలు అక్షరాస్యులుగా ఉన్నారు. మిగతా 35 శాతం బాలికలు బడికి దూరంగానే ఉన్నారు. 2009 విద్యాహక్కు చట్టం ఫలితంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో వెనుకబడిన తరగతుల బాలికలు చదువుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. అయినప్పటికీ పల్లెటూర్లలో బాలికల అక్షరాస్యత తక్కువగానే ఉంది. ఏ లక్ష్యాలపై అవగాహన కల్పించడానికి బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నామో... వాటిని సాకారం చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలకూ బాధ్యత ఉంది. (క్లిక్ చేయండి: మన క్రీడాకారిణులకు బాసట ఏది?) – సయ్యద్ షఫీ, హనుమకొండ (జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం) -
‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?
న్యూఢిల్లీ: 2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్ పార్టీ/నిపుణులతో సోషల్ ఆడిట్ కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. -
సలాం..హైదరాబాద్!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంపై అధికారులు దృష్టి సారించడంతో ఈ ఫలితాలొచ్చాయి. ప్రభుత్వ శాఖలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మండల స్థాయి ప్రత్యేక కార్యచరణకు సిద్ధమైంది. ఇప్పటికే బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం అమలులో హైదరాబాద్‌కు కేంద్ర స్థాయి గుర్తింపు లభించడంతో అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ సిటీగా రూపు దిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు బస్తీ నుంచి బడి వరకు పెద్దఎత్తున ప్రచారోద్యమం, అవగాహన సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. మండల స్థాయి అధికారులు, తహాసీల్దార్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనుంది మరోవైపు కౌమార బాలికల, సంరక్షణ, పోషకాహారం, రుతుక్రమం, పిల్లలపై జరిగే అత్యాచారం వంటి అంశాలపై ప్రతి కుటుంబంలో చైతన్యం తెచ్చేందుకు జిల్లా స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పిల్లల సంఘటనలు జరిగినప్పుడు గట్టిగా అంటే నో అని అరవడం, గో అంటే భయపడకుండా అక్కడి నుంచి పరుగేత్తి చెప్పడం, టెల్ అంటే భయపడకుండా ఆ సంఘటన గురించి చెప్పడం, అవసరమైనే 1098 కు ఫోన్ చేసే విధంగా చైతన్యం కల్గించే విధ ంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఇకనుంచిగుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికార యం త్రాంగం నిర్ణయించింది. చిన్నారులను చైతన్యం పర్చేందుకు అన్ని ఉన్నత పాఠశాలల్లో పెయింటింగ్స్ వేయించనుంది. టీచర్ల సంఖ్యను బట్టి నాలుగు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు పాఠశాల స్థాయి లో బాలికల రక్షణకు బాధ్యత అప్పగించనున్నారు. బాలికల నిష్పత్తి పెరుగుతోంది.. నగరంలో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. నాలుగేళ్లలో హైదరాబాద్ మహా నగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 970 కు చేరుకుంది. వాస్తవంగా 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు బాలికల నిష్పత్తి తక్కువగా ఉండటం అందోళన కలిగించింది. మూడేళ్ల క్రితం జనవరి 22న నగరంలో బేటీæ బచావో. బేటీ పడావో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి విస్తత ప్రచారానికి నడుంబిగించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. హైదరాబాద్‌లో బాలికల నిష్పత్తి 2011–12 914 2014–15 942 2015–16 938 2016–17 967 2017–18 968 2018–19 970 -
లేటు వయసులో బడికి వెళ్తున్న ఎమ్మెల్యే
ఉదయ్‌పూర్/రాజస్తాన్ : పెద్దయిన తర్వాత చదువు కొనసాగించడం అందరూ అసాధ్యమనుకుంటారు. రాజకీయ నాయకులైతే అది అసలు కుదరని పని అనుకుంటారు. కానీ చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు ఓ సీనియర్ ఎమ్మెల్యే. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో మళ్లీ బడి బాట పట్టాడు. ఏడో తరగతితోనే ఆగిపోయిన తన చదువును గ్రాడ్యుయేషన్ వరకూ తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ రూరల్ ఎమ్మెల్యే , బీజేపీ నేత ఫూల్సింగ్ మీనా (59)కు నలుగురు కూతుళ్లు. చిన్న తనంలోనే తండ్రి చనిపోవడంతో మీనా పాఠశాల చదువును మధ్యలోనే ఆపేశారు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయం పనులను చేసుకుంటూ చదువును కొనసాగించలేకపోయారు. అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. కానీ చదువు మాత్రం పాఠశాల స్థాయికే పరిమితమైంది. ఎమ్మెల్యే అయ్యాక పదో తరగతి చదివారు. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ‘మా నాన్న చనిపోవడంతో చదువు మానేశాను. ఎమ్మెల్యే అయ్యాక ప్రధాన మంత్రి ‘బేటి బచావో బేటి పడావో’ ప్రచారంలో భాగంగా గిరిజన బాలికల్ని విద్యావంతులు చేయడం కోసం కృషి చేయాలకున్నాను. దీని కంటే ముందు నేను విద్యావంతున్ని కావాలనుకున్నాను. నా కూతుళ్లు కూడా ప్రోత్సాహకాన్ని అందించారు. దీంతో 2013లో ఓపెన్ టెన్త్‌లో చేరాను. కానీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పరీక్షకు హాజరు కాలేకపోయాను. 2016లో పదో తరగతి పాసయ్యాను. 2017లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. విద్య అందరికి అవసరం. అందరూ చదువుకోవాలి’ అని ఎమ్మెల్యే ఫూల్ సింగ్ మీనా తెలిపారు. అంతే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘బేటి బచావో బేటి పడావో’ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ బాలికలు చదువుకోవాలని ప్రచారం చేస్తున్నారు. సెంకడరీ విద్యలో 80శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఉచితంగా విమానయాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా 2016లో ఇద్దరు విద్యార్థులు, 2017లో ఆరుగురు విద్యార్థులు విమానంలో ప్రయాణించారు. ఇక నుంచి జనరల్ విద్యార్థులు కూడా 80 శాతం మార్కులు సాధిస్తే ఉచిత విమానయాన సదుపాయం కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఏదేమైనా అటు పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సహిస్తూ.. ఇటు తను చదువుకుంటూ విద్యకు వయసు అడ్డురాదని నిరూపించారు ఎమ్మెల్యే ఫూల్సింగ్ మీనా. -
బంధువుల నుంచే లైంగిక వేధింపులు
సాక్షి,సిటీబ్యూరో: బంధువుల నుంచే దాదాపు 90 శాతం చిన్నారులు లైగింక వేధింపులకు గురవుతున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అన్నారు. శుక్రవారం బేటి బచావో–బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అమ్మాయిలపై కాకుండా అబ్బాయిలపై కూడా లైగింక వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. కౌమార బాలికల, సంరక్షణ, పోషకాహారం, రుతుక్రమం, లైంగికదాడులపై తల్లిదండ్రులను చైతన్యం చేసేందుకు జిల్లా స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. బాలికల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని, పీవోసీఎస్‌వో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. నో, గో, టెల్ అనే పదాలతో పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలన్నారు. సురక్షితమైన స్పర్ష, ఫోక్సో చట్టంపై చిన్నారులకు అవగాహన అవసరమన్నారు. పిల్లల అఘాయిత్యాలు ఎదురైతే గట్టిగా అరవడం, గో అంటే అక్కడి నుంచి పరుగెత్తి చెప్పడం, టెల్ అంటే భయపడకుండా ఆసంఘటన చెప్పడం నేర్పించాలన్నారు. అవసరమైతే 1098కు ఫోన్ చేసేలా చైతన్యం కల్గించాలన్నారు. నోడల్ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ గర్భిణీలు అల్ట్రాసౌండ్ చెక్ ఆప్ కోసం వెళ్లినప్పుడు లింగనిర్ధారణ చేసే సెంటర్లపై నిఘా పెట్టాలని సూచించారు. బ్రూణ హత్యలను నియంత్రించాలన్నారు. ఆడపిల్లలను చంపవద్దని ప్రభుత్వానికి అప్పజెప్పాలని వారిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గర్బిణీæ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ అయితే నాలుగు విడుతలుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సునంద మాట్లాడుతూ 914 అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నామని, గర్భిణులకు 16 గుడ్లు ఇవ్వడం ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతి గర్భిణీ స్త్రీ పేరును అంగన్ వాడి కేంద్రాల్లో నమోదు చేయించాలన్నారు. ఆర్బీఎస్కే శ్రీవాణి మాట్లాడుతూ పుట్టుకతోనే వచ్చే లోపాలు గుర్తించి వారికి చికిత్స అందజేస్తున్నామని, రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ ఐఓఎస్ ప్రసన్న మాట్లాడుతూ చిన్నారులను పెంచుకోలేని పరిస్ధితిలో చిన్నారులను హాస్టళ్లు, శిశు విహార్‌లో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అర్బన్ కమిటీ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి. ప్రాజెక్టు డైరెక్టర్ డి.సౌజన్య , ఇంతీయాజ్ పాల్గొన్నారు. -
బాల్యం బాగుంటేనే భవిష్యత్తు
బాల్యం అమూల్యం, ఆ అమూల్యమైన బాల్యం దృఢంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుం టుంది. బాల్యం బాగా లేకపోతే పౌరులు కూడా ఊసురోమని తయారౌతారు. మన నాయకులు స్వచ్ఛ భారత్ అంటున్నారు. బేటీ బచావ్– బేటీ పడావ్ అంటున్నారు. ఇంకా చాలా నినాదాలిస్తున్నారు. కానీ ఈ నినాదాలు నిజరూపం దాల్చడం లేదు. 28 శాతం మంది పిల్లలు బాల కార్మికులుగా బతుకు బండిని లాగుతున్నారనీ, అమ్మాయిల్లో 31 శాతం మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయనీ, పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒకరు మొదటి జన్మదినం చూడకుండానే కన్నుమూస్తున్నారనీ, 11 శాతం మంది పిల్లలు మాఫియా చేతుల్లో మగ్గిపోతున్నారనీ, సర్కారు వారి గణాం కాలే సెలవిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే పెద్దలు నినాదాలకే పరిమితమైతే పిల్లలు బాగుపడేదెన్నడు? సత్పౌరులుగా ఎదిగేదెన్నడు? ఈ దేశం బాగుపడేదెప్పుడు అనే ప్రశ్న ప్రతి వారినీ పీడించేదే. స్వచ్ఛ భారత్ అని సెలవిస్తూ కోట్లు తగలేస్తున్నవారు, ఉత్తరప్రదేశ్‌లోని నూర్పూర్లో చెత్తకుప్పల దగ్గర విషాహారం తిని ఐదుగురు అమాయక పిల్లలు చనిపోవడం స్వచ్ఛభారత్‌కి మచ్చకాదా? మున్సిపాలిటీ చెత్త బళ్లు లాగుతున్న బాల, బాలికలు అనునిత్యం దర్శనమిస్తుంటారు. మీ స్వచ్ఛ భారత్ పిల్లల్ని పక్కనబెట్టి పెద్దలకు పరిమితమైందా? ఇక బేటీ పడావ్– బేటీ బచావ్ అన్న నినాదానికి వస్తే ఉన్న స్కూళ్లను మూసేస్తుంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు. బేటీ బచావ్ అనే మీ నినాద తీవ్రత ఎంతవరకు వెళ్లిందంటే 2014 నుంచి నేటి వరకు బాలికలపై 7 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగాయి. ఇవి కేవలం పోక్సో చట్ట ప్రకారం నమోదైన లెక్కలు మాత్రమే. బాలికలపై అత్యాచారాలు చేసి చెరపట్టిన వారిలో ప్రజా ప్రతినిధులు సహితం ఉన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు. ప్రజల కోసమే పుట్టానని ప్రగల్భాలు పలికే ఓ ముఖ్యమంత్రి గారి ఏలుబడిలో ఒకే జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 18 అత్యాచారాలు జరిగాయి. ఇది సిగ్గు చేటైన విషయం కాదా? అమ్మాయిల చదువును ప్రోత్సహిస్తారా లేక షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి అని పెళ్లి చేసుకొని పరాన్నభుక్కుగా వర్ధిల్లమని దీవిస్తారా? అర్ధరాత్రి పెద్దనోట్ల రద్దు అని ప్రకటన చేసి ప్రజల్ని పరుగులు పెట్టించిన పెద్దలు, బాల కార్మిక వ్యవస్థ రూపు మాపడానికి అలాంటి ప్రకటన చేసి ఓ గడువు విధించి అనంతరం మీ వద్ద బాల కార్మికులుంటే కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేస్తే బాల కార్మిక సమస్య తీరిపోదా, కేవలం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అని కోట్లు ఖర్చు చేసి తద్దినాల్లా తంతు ముగిస్తే సరిపోతుందా. పిల్లలు విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవనం, ఆటపాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట–పాటల సౌకర్యాలు కల్పించి బాల బాలికలను భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటే భావి తరం మిమ్మల్ని క్షమిస్తుందా, పిల్లలను అనేక వ్యాధుల నుంచి దూరం ఉంచే పౌష్టికాహారం, కనీసం రక్షిత మంచినీరు అందించలేని మీరు చిన్నారుల ముందు దోషులు కాక మరేమౌతారు అని ప్రశ్నిస్తున్నది. బాలల హక్కుల కమిషన్లను సహితం నీరుకారుస్తూ, పిల్లల హక్కులని ఎందుకు కాలరాస్తున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా? దోషులుగా నిలబడతారో? బాలవీరులుగా పిల్లలను తీర్చిదిద్ది చరిత్రలో వీరులుగా నిలిచిపోతారో కేంద్ర, రాష్ట్ర పాలకులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రచయిత: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
ఆడబిడ్డకు అండ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా:ఆడబిడ్డకు ఇక అందలం వేయనున్నారు. కంటికి రెప్పలా కాపాడి ఉన్నత చదువులు చెప్పించే బృహత్తర క్రతువుకు నాంది పడనుంది. ఆడ శిశువుని గర్భంలోనే ప్రాణాలు తీస్తున్న అమానవీయ సంఘటనలకు ఇక చరమగీతం పాడేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. బాలికను సంరక్షించు.. బాలికను చదివించు(బేటీ బచావో–బేటీ పడావో) కార్యక్రమం అమలుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిక కావడమే దీనికి ప్రధాన కారణం. ఈనేపథ్యంలో ఆడబిడ్డలకు ఇంక మంచిరోజులు వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నారుల లింగ నిష్పత్తి (సీఎస్ఆర్)లో జిల్లా అథమ స్థాయిలో ఉంది. జాతీయ సగటు కంటే కూడా వెనకబడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. 2018–19 ఏడాది నుంచి బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ విభాగాలు పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే చిన్నారుల లింగ నిష్పత్తి మెరుగుపడనుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం చిన్నారుల లింగ నిష్పత్తిలో కనీసం రెండు శాతం మెరుగుదల రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పథకం ఉద్దేశం ఇదీ.. ఆడపిల్ల అంటే.. సమాజంలో ఇంకా చిన్నచూపు, వివక్ష కొనసాగుతోంది. మహానగరానికి చుట్టూ మన జిల్లా విస్తరించి ఉన్నా బాలికల పట్ల అసమానతలు ఇంకా తొలగడం లేదు. గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తేలగానే పిండాన్ని ఛిద్రంచేస్తున్న సంఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి హీనమైన చర్యల వల్ల జిల్లాలో ఏటా చిన్నారుల లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం నమోదవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు గాను.. 933 మంది అమ్మాయిలే ఉన్నారు. గత 18 ఏళ్ల కిందటే కాస్త మెరుగైన నిష్పత్తిలో చిన్నారులు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2001లో 1000:959 ఉండగా 2011 వచ్చేసరికి 1000:933కు పడిపోవడం ఆడశిశువులకు సమాజం ఏమాత్రం గౌరవం ఇస్తోందో ఇట్టే తెలుసుకోవచ్చు. బేటీ బచావో.. బేటా పడావో పథకం ద్వారా లింగ వివక్షను సమూలంగా రూపుమాపడం ప్రధాన ఉద్దేశం. అంతేగాకుండా తల్లి గర్భం నుంచి భూమిపై అడుగు పెట్టిన ప్రతి ఆడ శిశువును స్వేచ్ఛగా బతకనివ్వడంతోపాటు సంరక్షణకు పెద్దపీట వేస్తారు. ఉన్నత విద్య అందించి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి పురుషులతో సమానంగా తీర్చిదిద్దడం అంతిమ లక్ష్యం. అమలు ఇలా.. తల్లి గర్భంలోనే ఆడపిల్లల ఉసురు తీయడానికి ప్రధాన కారణం స్కానింగ్ కేంద్రాలే అనేది నగ్న సత్యం. కొన్ని ప్రాంతాల్లో పీసీ–పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల్ని యథేచ్ఛగా చేస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తేలగానే ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో.. తొలుత స్కానింగ్ కేంద్రాలపై యంత్రాంగం నిఘా పెట్టాలని యంత్రాంగం నిర్ణయిచింది. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తనిఖీ చేయడం ద్వారా కొంత మేరకు గర్భస్థ లింగ నిర్ధారణను నియంత్రించవచ్చని భావిస్తోంది. పుట్టిన తర్వాత కూడా ఆడబిడ్డలపై వివక్షనూ దూరం చేయడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యువతీయువకులు, నవ దంపతులు, గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులను వివిధ కార్యక్రమాల ద్వారా చైతన్యపర్చనున్నారు. అలాగే వైద్యులు, మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంల భాగస్వామ్యం తీసుకోనున్నారు. తద్వారా ఆడపిల్లల నిష్పత్తి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. -
ఆ బాధ్యత అత్తలదే!
ఝుంఝున్: లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు. మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎమ్)ను రాజస్తాన్‌లోని ఝుంఝున్‌లో మోదీ ప్రారంభించారు. ‘సమాజంలో ప్రతిఒక్కరూ సమానమే. బాలురతో సమానంగా బాలికలు నాణ్యమైన విద్యను అందుకోవాలి. బాలిక ఎప్పటికీ భారం కారాదు. ఆమె మన కుటుంబానికి గర్వకారణం. చుట్టుపక్కల చూడండి. మన కూతుళ్లు దేశప్రతిష్టను ఎలా పెంచుతున్నారో గమనించండి. కుమారులతో సమానంగా కూతుళ్లను పెంచండి’ అని అన్నారు. నవభారత నిర్మాణం కోసం మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పుతీసుకురావటం, మహిళాశక్తిని సరైన పద్ధతిలో వినియోగించుకోవటం చాలా అవసరమన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాలనుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ‘తరగతి గదుల నుంచి క్రీడాప్రాంగణాల వరకు ప్రతిచోటా వారు రాణిస్తున్నారు. అందుకే నేడు బాలికలకు సమానత కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ లింగ వివక్ష చూపకూడదు. దేశంలో బాలికల భ్రూణహత్యలు జరుగుతుండటం మనం సిగ్గుపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. ఈ దారుణమైన అలవాటును సమాజం నుంచి రూపుమాపేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయాలి. మనమింకా 18వ శతాబ్దపు ఆలోచనలతోనే ఉన్నాం. అలాంటప్పుడు 21 శతాబ్దపు పౌరులమని చెప్పుకునే హక్కు మనకెక్కడిది’ అని మోదీ పేర్కొన్నారు. బాలికలను పురిట్లోనే చంపేయటం ద్వారా ఈ తరం ఇబ్బందులు పడుతోందని.. భవిష్యత్ తరాలకోసం పెను ప్రమాదాన్ని స్వాగతిస్తున్నట్లేనన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్‌తోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని.. బాలికలకు సరైన విద్యనందించటం, విస్తృత ప్రచారం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావటం అత్యంత అవసరమన్నారు. తక్కువకాలంలో ఈ దిశగా భారీ మార్పును సాధించలేమని ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే సమాజంనుంచి ఈ చెడు సంప్రదాయం తొలగిపోయేందుకు ఐదారు తరాలు పడుతుందన్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను, మిషన్ ఇంద్రధనుష్ (జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం) ద్వారా చిన్నారులు, మహిళల్లో వస్తున్న సానుకూల మార్పునూ మోదీ వివరిం చారు. అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. కున్వర్బాయిని గుర్తుచేసుకున్న మోదీ కొందరు మహిళలు మార్గదర్శకమైన కార్యక్రమాల ద్వారా దేశ చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు స్ఫూర్తిగా నిలిచిన దివంగత కున్వర్బాయిను గుర్తుచేసుకున్నారు. షి ఇన్స్పైర్ మి హ్యాష్‌ట్యాగ్‌తో గురువారం ప్రధాని పలు ట్వీట్లు చేశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో కన్నుమూసిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 106 ఏళ్ల కున్వర్బాయి జీవితం స్ఫూర్తిదాయకం. ఆమెకున్న మేకలు అమ్మి తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించారు. స్వచ్ఛభారత్‌లో ఆమె భాగస్వామ్యం మరువలేనిది. ఆమెనుంచి ఆశీర్వాదం తీసుకున్న రోజును ఎన్నటికీ మరవబోను’ అన్నారు. -
ధీర వనితల మధ్య ఎవరామె?
సాక్షి, శ్రీనగర్ : ఆడపిల్లల మనుగడ, రక్షణ మరియు సాధికారత నిర్ధారించడానికి.. సమన్వయం అభిసరణ ప్రయత్నాలు అవసరం ఉందని భావించిన ప్రభుత్వం బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఎంపిక చేసిన సుమారు 100కు పైగా జిల్లాల్లో వీటిపై విస్తృతంగా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఈ కార్యక్రమం కోసం వెలసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. కశ్మీర్ వేర్పాటు వాద నేత అషియా అంద్రబి ఫోటోను బ్యానర్లో పొందుపరచటంతో అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. కోకర్నాగ్ పట్టణంలో ఈ ఫ్లెక్సీని అధికారులు కట్టారు. ఇందులో ప్రధాని ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, కల్పనా చావ్లా, సానియా మీర్జా, కిరణ్ బేడీ తదితరులతోపాటు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే అందులో అంద్రబి ఫోటో కూడా ఉంది. ప్రభావవంతమైన మహిళల ఫోటోల నడుమ ఆమె ఫోటో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దక్తరన్-ఇ-మిలాత్ చీఫ్ అయిన అంద్రబి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కశ్మీర్ వేర్పాటు వాద నాయకురాలిగా ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. పాక్ ముఖ్యదినాల్లో ఆ దేశ జెండాను మన దగ్గర ఎగరవేసిందన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఫ్లెక్సీలో ఆమె ఫోటో వ్యవహారంపై బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ సెథీ స్పందించారు. ఇప్పటికే ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయగా.. దర్యాప్తనకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. -
'బేటీ బచావో' ఐడియా కేంద్రానిది కాదు.. నాది!
ఉదయ్ పూర్: దేశంలో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు, ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పించాలని ప్రారంభించిన 'బేటీ బచావో బేటీ పడావో' పథకం టైటిల్ తనదని, కేంద్రం తన అనుమతి లేకుండా దాన్ని ఉపయోగించుకుంటోందని ఓ మహిళా పోలీసు ఆరోపించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కేంద్రానికి ఈ టైటిల్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఉదయ్ పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన భాతి తెలిపారు. ఆర్టీఐ ఇచ్చిన వివరాలు సంతృప్తికరంగా లేవని, అందుకే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో' టైటిల్ తన క్రియేటివిటీ అని, తనను టైటిల్ రూపకర్తగా గుర్తించాలంటూ లేఖలో రాసినట్లు వివరించారు. చరిత్ర, ఇంగ్లీష్ లలో పీజీ పూర్తిచేసిన భాతి మొదట్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం మీద ఆసక్తితో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 20ఏళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. 1999లో తొలిసారి 'బేటీ బచావో బేటీ పడావో'ను పొయెట్రీకి వాడానని, ఆ తర్వాత 2005లో ఓ కార్యక్రమంలో చెప్పినట్లు ఆమె తెలిపారు. పబ్లిసిటీ కోసమో, డబ్బు కోసమో ఈ పని చేయడం లేదని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలకు పంపిన ఆర్టీఐ సమాధానాలు సరిగా లేవని చెప్పారు. బాలికల సంరక్షణ, అబార్షన్లపై తాను కొన్ని రచనలు చేశానని, రాష్ట్రంలో బాలికల సంరక్షణకు సంబంధించి కొన్ని పోస్టర్లను తయారుచేసి 2002లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు మెయిల్ కూడా చేశానని, కానీ వాటికి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. ప్రధానమంత్రి తన వినతిని పరిశీలించి సమాధానం ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యను పెంచేందుకు 'బేటీ బచావో బేటీ పడావో' పథకాన్ని హర్యానాలో ప్రారంభించారు.