ఆ బాధ్యత అత్తలదే! | On Women's Day, Modi expands 'Beti Bachao Beti Padhao' drive | Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత అత్తలదే!

Published Fri, Mar 9 2018 2:32 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

On Women's Day, Modi expands 'Beti Bachao Beti Padhao' drive - Sakshi

ఝంఝన్‌లో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ లబ్ధిదారులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

ఝుంఝున్‌: లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు. మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ (ఎన్‌ఎన్‌ఎమ్‌)ను రాజస్తాన్‌లోని ఝుంఝున్‌లో మోదీ ప్రారంభించారు. ‘సమాజంలో ప్రతిఒక్కరూ సమానమే. బాలురతో సమానంగా బాలికలు నాణ్యమైన విద్యను అందుకోవాలి. బాలిక ఎప్పటికీ భారం కారాదు. ఆమె మన కుటుంబానికి గర్వకారణం. చుట్టుపక్కల చూడండి. మన కూతుళ్లు దేశప్రతిష్టను ఎలా పెంచుతున్నారో గమనించండి. కుమారులతో సమానంగా కూతుళ్లను పెంచండి’ అని  అన్నారు. నవభారత నిర్మాణం కోసం మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పుతీసుకురావటం, మహిళాశక్తిని సరైన పద్ధతిలో వినియోగించుకోవటం చాలా అవసరమన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాలనుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.

మనం 21వ శతాబ్దంలో ఉన్నామా?
‘తరగతి గదుల నుంచి క్రీడాప్రాంగణాల వరకు ప్రతిచోటా వారు రాణిస్తున్నారు. అందుకే నేడు బాలికలకు సమానత కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ లింగ వివక్ష చూపకూడదు. దేశంలో బాలికల భ్రూణహత్యలు జరుగుతుండటం మనం సిగ్గుపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. ఈ దారుణమైన అలవాటును సమాజం నుంచి రూపుమాపేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయాలి.

మనమింకా 18వ శతాబ్దపు ఆలోచనలతోనే ఉన్నాం. అలాంటప్పుడు 21 శతాబ్దపు పౌరులమని చెప్పుకునే హక్కు మనకెక్కడిది’ అని మోదీ పేర్కొన్నారు. బాలికలను పురిట్లోనే చంపేయటం ద్వారా ఈ తరం ఇబ్బందులు పడుతోందని.. భవిష్యత్‌ తరాలకోసం పెను ప్రమాదాన్ని స్వాగతిస్తున్నట్లేనన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్‌తోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని.. బాలికలకు సరైన విద్యనందించటం, విస్తృత ప్రచారం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావటం అత్యంత అవసరమన్నారు.

తక్కువకాలంలో ఈ దిశగా భారీ మార్పును సాధించలేమని ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే సమాజంనుంచి ఈ చెడు సంప్రదాయం తొలగిపోయేందుకు ఐదారు తరాలు పడుతుందన్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను, మిషన్‌ ఇంద్రధనుష్‌ (జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం) ద్వారా చిన్నారులు, మహిళల్లో వస్తున్న సానుకూల మార్పునూ మోదీ వివరిం చారు. అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్‌ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు.  

కున్వర్‌బాయిని గుర్తుచేసుకున్న మోదీ
కొందరు మహిళలు మార్గదర్శకమైన కార్యక్రమాల ద్వారా దేశ చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు స్ఫూర్తిగా నిలిచిన దివంగత కున్వర్‌బాయిను గుర్తుచేసుకున్నారు. షి ఇన్‌స్పైర్‌ మి హ్యాష్‌ట్యాగ్‌తో గురువారం ప్రధాని పలు ట్వీట్లు చేశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో కన్నుమూసిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 106 ఏళ్ల కున్వర్‌బాయి జీవితం స్ఫూర్తిదాయకం. ఆమెకున్న మేకలు అమ్మి తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించారు. స్వచ్ఛభారత్‌లో ఆమె భాగస్వామ్యం మరువలేనిది. ఆమెనుంచి ఆశీర్వాదం తీసుకున్న రోజును ఎన్నటికీ మరవబోను’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement