ఛిద్రమైన టెంపో వాహనాన్ని పరిశీలిస్తున్న కర్నూలు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప
వెల్దుర్తి/మదనపల్లె/మదనపల్లె టౌన్: కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ వాహనం హైవేపై డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ పక్క రోడ్డులో వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. టెంపో వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సాయంతో వాటిని బయటకు తీశారు. మృతుల బ్యాగుల్లో లభించిన ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్ల ఆధారంగా వారంతా చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బాలాజీ నగర్‌కు చెందిన రఫీ, జాఫర్, దస్తగిరి కుటుంబాలకు చెందిన వారిగాగుర్తించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన ఆయన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలిచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి ముందు అమకతాడు టోల్‌గేట్ దాటుతున్న మినీబస్సు
అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా..
మృతుల్లో 12 మంది యాత్రికులు కాగా.. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వీరంతా చిత్తూరు జిల్లా మదనపల్లి వాసులే. డ్రైవర్లు మినహా అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మదనపల్లి బాలాజీ నగర్‌కు చెందిన షేక్ నౌజీరాబీ (65)తోపాటు ఆ కుటుంబానికి చెందిన 16 మంది రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో మొక్కు తీర్చుకునేందుకు టెంపో ట్రావెలర్ వాహనంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో మదనపల్లి నుంచి బయలుదేరారు. దూర ప్రయాణం కావడంతో బస్సు డ్రైవర్ కం ఓనర్ నజీర్ (55) వెంట మరో డ్రైవర్ షఫీ(38)ని కూడా వెళ్లాడు. వారంతా ప్రయాణిస్తున్న టెంపో వెల్దుర్తి మండలం మదార్‌పురం ఫ్లైఓవర్‌పై గల చిన్న మలుపు వద్ద అదుపు తప్పి కుడివైపు డివైడర్‌ను ఢీకొని.. పల్టీలు కొడుతూ అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో వరంగల్ నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీని ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో టెంపోలోని ఇద్దరు డ్రైవర్లతో పాటు షేక్ నౌజీరాబీ (65), ఆమె పెద్ద కుమారుడు దస్తగి రి(50), ఆయన భార్య అమ్మాజాన్ (35), పిల్లలు షామ్రిన్ (16), ఆమ్రిన్ (15), నౌజీరాబీ రెండో కుమారుడైన షేక్ రఫీ (36), భార్య షేక్ మస్తాని అలియాస్ అమ్ములు (32), కుమారుడు మహ్మద్ రిహాన్(1), నౌజీరాబీ మూడో కుమారుడు షేక్ జాఫర్‌వలి (30), భార్య రోషిణి (29), కుమార్తె నౌజియా (34), ఆమె అత్త అమీర్‌జాన్ (63) వాహనంలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. దస్తగిరి కుమారుడు ఖాసిఫ్, రఫీ కుమార్తె యాస్మిన్, జాఫర్‌వలి కుమార్తె ఆస్మా, కుమారుడు ముసా ఆసిన్ గాయపడగా.. వారిని 108 వాహనంలో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం అక్కడికే తరలించారు. ప్రమాద సమయంలో టెంపో ట్రావెలర్‌ను ఓనర్ కమ్ డ్రైవర్ నజీర్ నడుపుతున్నాడు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కర్నూలు ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. కలెక్టర్ వీరపాండియన్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్‌తో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్షించారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
అంతా కష్టజీవులే
గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన షేక్ నౌజీరాబీ (65) తన భర్త ఇమాంసాహెబ్ చనిపోయాక తన ముగ్గురు కుమారులు, కుమార్తెను తీసుకుని 20 ఏళ్ల క్రితం మదనపల్లెకు వలస వచ్చారు. అంతా ఒకే వీధిలో వేర్వేరుగా అద్దెకు ఇళ్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు దస్తగిరి గుజిరీ(ఇనుప తుక్కు) వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రెండో కొడుకు రఫీ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. మూడో కొడుకు జాఫర్‌వలీ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు నౌజియా భర్త అన్సర్ ఆటోడ్రైవర్. వీరంతా ఏరోజుకారోజు కష్టపడుతూ సంపాదించిన మొత్తంతో ఇంటిని నడుపుకుంటూ ఉన్నంతలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. పిల్లలు ఎంత కష్టపడినా ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం, అభివృద్ధి కనిపించకపోవడంతో తల్లి నౌజిరాబీ బెంగ పెట్టుకుంది. అజ్మీర్ దర్గాకు వెళ్లి వస్తే మంచి జరుగుతుందని చుట్టుపక్కల వారు చెప్పడంతో.. అజ్మీర్ వెళ్లొద్దామని కోరింది. తల్లి తీర్చేందుకు సిద్ధపడిన కుమారులు మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన టెంపో ట్రావెలర్‌లో హైదరాబాద్, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, అజ్మీర్ వెళ్లే నిమిత్తం 12 రోజులకు బేరం కుదుర్చుకున్నారు.
‘యా ఖాజా.. ఏ ఆప్‌నే క్యా కియా!’
‘యా ఖాజా... ఏ ఆప్‌నే క్యా కియా.. ఓ ఆప్‌కీ జియారత్‌కే లియే బడే హీ ఖుషీసే నిఖ్లేతే.. మగర్ ఆప్ కీ జియారత్ సే పహలే హీ ఉన్కో ఇస్ దారే పానీసే లే ఛలే..’ (దేవుడా.. ఏమిటీపని చేశావ్. నీ దర్శనం కోసం సంతోషంగా వస్తుంటే.. దర్శించుకోకుండానే నీలో ఐక్యం చేసుకున్నావా) అంటూ బాలాజీనగర్‌లో నౌజీరాబీ బంధువులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలియడంతో నౌజిరాబీ బంధువులు, పరిచయస్తులు ఆమె ఇంటి వద్దకు వచ్చి భగవంతుడు ఆ కుటుంబానికి అన్యాయం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దైవ దర్శనానికి వెళ్లాలన్న ఆ తల్లి కోరిక తీరకుండానే కుటుంబం మొత్తం అల్లా దగ్గరకు చేరుకున్నారంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన నలుగురు చిన్నారుల పరిస్థితిని తలచుకుని ఆవేదనకు గురయ్యారు.
ప్రధాని సంతాపం
సాక్షి, ఢిల్లీ: టెంపో ట్రావెలర్ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఆత్మీయులను కోల్పోయిన వారితో నా ఆలోచనలు ఉంటాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment