Fetal murders
-
10 నెలల్లో 185 మంది శిశువులు గర్భంలోనే కన్నుమూత.. ఆ రెండు ఆస్పత్రుల్లోనే!
ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందన్న రోజుల నుంచి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసిన రోజులకు మానవ సమాజం దిగజారింది. మానవ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఇందుకేనా.. అన్నట్టు తలదించుకునేలా చోటు చేసుకుంటున్న సంఘటనలు నివ్వెరపరుస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో గర్భంలోనే ఆడ.. మగ అనే తేడా లేకుండా జరుగుతున్న శిశు హత్యలు గుండెలను పిండేస్తున్నాయి. కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదేనా మన విజ్ఞానాభివృద్ధి అనేలా ప్రశ్నిస్తున్నాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: వైద్య రంగం అభివృద్ధి చెందక ముందు పుట్టే బిడ్డ ఆడ.. మగ అని మాత్రమే చూసేవారు. ఒక్కో మహిళ పది మంది పిల్లలకు జన్మనిచ్చేది. ఏ బిడ్డయినా సమానంగానే పెంచేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలా సంతోషాలు వెల్లివిరిసేవి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పుట్టే బిడ్డ ఆడ.. మగ అనేది అమ్మ గర్భంలోనే స్కానింగ్ చేసి గుర్తిస్తున్నారు. అంగ వైకల్యాలను సైతం గర్భంలోనే పసిగట్టేస్తున్నారు. ఇంకేముంది ఆడ బిడ్డయితే గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు వైద్య రంగాన్ని సవాల్ చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయంలో అది ఆడ.. మగ.. అని చూడకుండా భ్రూణహత్యలకు దిగజారుతున్నారు. వైద్య రంగ విప్లవం మానవ అభివృద్ధికి దోహదపడేలా తప్ప ఇలా తల్లి గర్భంలోనే భ్రూణ హత్యలకు దారితీయడం దారుణం. నింగిలో సగం.. నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారు. అవకాశాలు దక్కితే తమ సత్తా చూపుతున్నారు. అయినా ఆడ పిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్లను ఎంతగా చదివించినా... వారు ఎంతగా రాణించినా పెళ్లి సమయంలో వరకట్న దురాచారం ఇంకా పీడిస్తూనే ఉంది. దీని ఫలితం ఆడ పిల్లలను వద్దనుకునే వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆడ పిల్లలను కోరుకునే వారు ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పది నెలల్లోనే... 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు 185 మంది గర్భంలోనే చనిపోయారు. వీరిలో 12 వారాల్లోపు చనిపోయిన వారు 135 మంది కాగా, 12 నుంచి 20 వారాల్లోపు చనిపోయిన వారు 50 మంది ఉన్నారు. ఈ మరణాల్లో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు అబార్షన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తెచ్చి అమలు చేస్తున్నా... కొందరు నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటుపడి లింగ నిర్ధారణ వెల్లడిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్నేళ్లుగా స్కానింగ్ కేంద్రాలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది. ఆ రెండు ఆస్పత్రుల్లోనే... జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం సంబంధిత ఆస్పత్రులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలిసింది. ఇదే సమయంలో అబార్షన్ కోసం తీసుకువచ్చే ఆర్ఎంపీ, ఆశ వర్కర్లకు ఆయా ఆస్పత్రులు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. కష్టమే! తగ్గుతున్న ఆడ పిల్లల సంఖ్య జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య నెలనెలా తగ్గిపోతుంది. వెయ్యి మంది బాలురుకు 940 మంది బాలికలే ఉన్నారు. 2021 డిసెంబరులో వెయ్యి మంది బాలురుకు 942 మంది బాలికలు ఉన్నారు. 2022 జనవరి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 940కి తగ్గింది. స్కానింగ్ చేయాల్సిన పరిస్థితులు ► జన్యు సంబంధమైన జీవ కణాల్లో కలిగే అసాధ«రణ మార్పు గుర్తించినప్పుడు ► ఎర్ర రక్తకణాల్లో అసాధారణ స్థితి ఉన్నప్పుడు. ► లింగ సంబంధిత వ్యాధులు గుర్తించినప్పుడు. ► స్కానింగ్‌కు చట్టం ఆమోదించే పరిస్థితులు. ► గర్భదారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు. ► గర్భిణికి రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. ► గర్భిణులు హానికారక మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల బారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు స్కానింగ్ చేయవచ్చు. సమాచారమిస్తే చర్యలు జిల్లాలో ఏ స్కానింగ్ సెంటర్‌లోనైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు సమాచారం ఇస్తే తనిఖీలు చేసి తీవ్రమైన చర్యలు చేపడతాం. అటువంటి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెడతాం. లింగ నిర్ధారణ వెల్లడి చట్టరీత్యా నేరమనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. అదే సమయంలో వివాహం కాకుండా గర్భం దాలుస్తున్న వారు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ -
కడుపులోనే కత్తెర
సాక్షి, నెల్లూరు: జిల్లాలో లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు రహస్యంగా జరిగిపోతున్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. అమాయకత్వం, పేదరికం, అవగాహన లోపంతో కడుపులో పడింది ఆడపిల్ల అని గుర్తించి గ్రామీణులు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు వైద్యులే ధనార్జనే ధ్యేయంగా అబార్షన్లు చేస్తుండటంతో ఆడ పిల్లలు బాహ్యప్రపంచం చూడకుండానే పిండంగానే కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాదు చంపేస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ఆరోగ్యశాఖ సిబ్బందే పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆడ, మగ అని అడగటం, చెప్పడం చట్ట రీత్యా నేరం. ఇలాంటి ప్రభుత్వ నినాదాలన్నీ ఆస్పత్రుల గోడలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. జిల్లాలో బాలికలు 939 మందే.. జిల్లాలో బాలికల శాతం నానాటికి దిగజారిపోతోంది. 2001లో వెయ్యి మంది పురుషులకు 984 మంది స్త్రీలు ఉండగా వీరిలో 0–6 ఏళ్ల లోపు ప్రతి వెయ్యి మంది బాలురకు 954 మంది బాలికలు ఉన్నారు. 2011 నాటికి 939కు చేరుకుంది. 2017 0–6 ఏళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మంది బాలురుకు 945 మంది బాలికలు ఉన్నారు. గతేడాది లెక్కల పక్రారం ప్రతి 1000 మంది బాలురుకు 928 మందే బాలికలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రతి వెయ్యి మంది బాలురుకు 953 మందికి పైగా బాలికలు ఉండాలని వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇష్టారాజ్యంగా స్కానింగ్ కేంద్రాలు.. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి పొందిన 209 స్కానింగ్ కేంద్రాలు ఉండగా మరి కొన్ని కేంద్రాలు అనుమతి లేకుండానే పని చేస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. గతంలో పని చేసిన డీఎంహెచ్ఓలు కొన్ని స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేస్తున్నారు. దీంతో ఆడ శిశువు అని తెలియగానే వెంటనే అబార్షన్ చేయడం పరిపాటి అయింది. జిల్లాలో నెలకు 60కుపైగా అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి, గూడూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకున్న సొంత స్కానింగ్ కేంద్రాల్లో ఈ తరహా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని ఆస్పత్రుల్లో పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను నిషేధించినా కొన్ని చోట్ల వాటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. పేదరిక భయం, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాసులకు కక్కుర్తి పడి కొందరు డాక్టర్లు యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే కరిగిస్తున్నారు. లేదంటే యథేచ్ఛగా ఆస్పత్రుల్లోనే అబార్షన్లు చేస్తున్నారు. దీని వల్ల జిల్లాలో బాలిక నిష్పత్తి తగ్గిపోతుంది. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖాధికారులు మాముళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశించినప్పుడో, మీడియాలో వార్తలు వచ్చినప్పుడో తప్ప వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు మేల్కోకపోతే భవిష్యత్‌లో అనంత నష్టం తప్పదంటున్నారు పలువురు వైద్య నిపుణులు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ చేసినట్లు రుజువైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఘటనులు జరిగితే రూ.10 వేలు జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తాం. లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా ఉన్న పీసీ, పీఎన్డీటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చట్టం అమలవుతోందో లేదో తెలుసుకునేందుకు త్వరలోనే ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. – జయశ్రీ, వైద్యశాఖమదర్ అండ్ చైల్డ్ డైరెక్టర్ -
గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలేమో?
ఒంగోలు టౌన్: ఆడపిల్ల బతకాలంటే తల్లి గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలి అన్నట్లుగా సమాజంలో ప్రస్తుత పరిస్థితులు ఉంటున్నాయని పలువురు కవులు వాపోయారు. ప్రజానాట్యమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎల్బీజీ భవన్లో ‘నన్ను బతకనివ్వరా’ అంటూ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవితా గోష్ఠిని నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలను కవులు, కవయిత్రులు తమ కవితల ద్వారా చదివి వినిపించారు. ప్రజానాట్యమండలి జిల్లా గౌరవాధ్యక్షుడు బీ దశర««ధ్ అధ్యక్షతన జరిగిన కవితా గోష్ఠిలో ప్రముఖ మహిళా కవి సింహాద్రి జ్యోతిర్మయి, నన్నపనేని రవి, కే లక్ష్మి, ఉన్నం జ్యోవాసు, ఎం. వెంకటఅప్పారావు, మూర్తి, ఎన్. రాధికారత్న, చింతపల్లి ఉదయజానకిలక్ష్మి, పాలూరి ప్రసాద్, కుర్రా ప్రసాద్, చాపల భాస్కర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గదవల్ల బాలకృష్ణ, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉబ్బా కోటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, నగర కార్యదర్శి కే చిన్నపరెడ్డి, డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లని తెలిస్తే చిదిమేస్తున్నారు
చిత్తూరు అర్బన్: పుట్టబోయేది ఆడబిడ్డ అని తేలితే కడుపులోనే కడతేరుస్తున్నారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే కాసుల కక్కుర్తితో ఈ దుష్టసంస్కృతికి తెరలేపారు. తాజాగా చిత్తూరు నగరంలోని ఓ ఆస్పత్రిలో జరుగుతున్న భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షల గుట్టురట్టయ్యింది. అధికారులు గురువారం ఆ ఆస్పత్రిపై దాడి చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ స్వర్ణ విజయగౌరి మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో ఉన్న నాయుడు బిల్డింగ్స్‌లోని శివప్రకాశ్ నర్సింగ్ హోమ్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంలో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయంటూ కేంద్ర నిఘా వ్యవస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. తమిళనాడు నుంచి గర్భిణులను తీసుకొచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని.. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తేలితే ఇంజెక్షన్లు, మందుల ద్వారా కడుపులోనే చిదిమేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జాతీయ లింగ నిర్ధారణ నిరోధక, పర్యవేక్షణ బృందం చిత్తూరుకు చేరుకుంది. నగరంలోని హైరోడ్డులో ఉన్న మహిళా మధ్యవర్తి వద్దకు ఓ గర్భిణిని తీసుకెళ్లారు. కడుపులో ఉన్నది ఏ మగబిడ్డో, ఆడబిడ్డో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆమెకు చెప్పారు. అయితే ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని చెప్పగా.. ఆ మొత్తాన్ని ఆమెకు అందజేశారు. దీంతో ఆమె సూచనల మేరకు గర్భిణిని ఆటోలో ఎక్కించుకుని శివప్రకాశ్ నర్సింగ్ హోం గైనకాలజిస్టు డాక్టర్ శోభ వద్దకు తీసుకెళ్లారు. రూ.4 వేలు వైద్యురాలికి అందజేసి.. వెయ్యి రూపాయలను మధ్యవర్తి తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్య కెమెరాల్లో చిత్రీకరించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఇంతలో కేంద్ర బృంద సభ్యులు స్థానిక పోలీసుల్ని తీసుకుని ఒక్కసారిగా ఆస్పత్రిపై దాడులు చేసి.. అబార్షన్లు చేయడానికి ఉపయోగించే మాత్రలు, స్కానింగ్ యంత్రాలను, పెద్ద మొత్తంలో పలు రకాల మందుల్ని సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. అత్యధికులు తమిళ వాసులే.. నర్సింగ్ హోంకు తీసుకువస్తున్న వారిలో తమిళనాడు వాసులే అధికంగా ఉన్నారని డీఎంహెచ్‌వో చెప్పారు. శివప్రకాశ్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులతో పాటు వైద్యురాలిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందన్నారు. కాగా, నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న నవీన్ స్కానింగ్ సెంటర్‌పై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసిన అధికారులు.. అక్కడ పనిచేస్తున్న చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మహిళా డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన పలు ప్రైవేట్ నర్సింగ్ హోం నిర్వాహకులు.. ఆస్పత్రులు మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
ఆ బాధ్యత అత్తలదే!
ఝుంఝున్: లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు. మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎమ్)ను రాజస్తాన్‌లోని ఝుంఝున్‌లో మోదీ ప్రారంభించారు. ‘సమాజంలో ప్రతిఒక్కరూ సమానమే. బాలురతో సమానంగా బాలికలు నాణ్యమైన విద్యను అందుకోవాలి. బాలిక ఎప్పటికీ భారం కారాదు. ఆమె మన కుటుంబానికి గర్వకారణం. చుట్టుపక్కల చూడండి. మన కూతుళ్లు దేశప్రతిష్టను ఎలా పెంచుతున్నారో గమనించండి. కుమారులతో సమానంగా కూతుళ్లను పెంచండి’ అని అన్నారు. నవభారత నిర్మాణం కోసం మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పుతీసుకురావటం, మహిళాశక్తిని సరైన పద్ధతిలో వినియోగించుకోవటం చాలా అవసరమన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాలనుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ‘తరగతి గదుల నుంచి క్రీడాప్రాంగణాల వరకు ప్రతిచోటా వారు రాణిస్తున్నారు. అందుకే నేడు బాలికలకు సమానత కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ లింగ వివక్ష చూపకూడదు. దేశంలో బాలికల భ్రూణహత్యలు జరుగుతుండటం మనం సిగ్గుపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. ఈ దారుణమైన అలవాటును సమాజం నుంచి రూపుమాపేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయాలి. మనమింకా 18వ శతాబ్దపు ఆలోచనలతోనే ఉన్నాం. అలాంటప్పుడు 21 శతాబ్దపు పౌరులమని చెప్పుకునే హక్కు మనకెక్కడిది’ అని మోదీ పేర్కొన్నారు. బాలికలను పురిట్లోనే చంపేయటం ద్వారా ఈ తరం ఇబ్బందులు పడుతోందని.. భవిష్యత్ తరాలకోసం పెను ప్రమాదాన్ని స్వాగతిస్తున్నట్లేనన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్‌తోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని.. బాలికలకు సరైన విద్యనందించటం, విస్తృత ప్రచారం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావటం అత్యంత అవసరమన్నారు. తక్కువకాలంలో ఈ దిశగా భారీ మార్పును సాధించలేమని ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే సమాజంనుంచి ఈ చెడు సంప్రదాయం తొలగిపోయేందుకు ఐదారు తరాలు పడుతుందన్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను, మిషన్ ఇంద్రధనుష్ (జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం) ద్వారా చిన్నారులు, మహిళల్లో వస్తున్న సానుకూల మార్పునూ మోదీ వివరిం చారు. అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. కున్వర్బాయిని గుర్తుచేసుకున్న మోదీ కొందరు మహిళలు మార్గదర్శకమైన కార్యక్రమాల ద్వారా దేశ చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు స్ఫూర్తిగా నిలిచిన దివంగత కున్వర్బాయిను గుర్తుచేసుకున్నారు. షి ఇన్స్పైర్ మి హ్యాష్‌ట్యాగ్‌తో గురువారం ప్రధాని పలు ట్వీట్లు చేశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో కన్నుమూసిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 106 ఏళ్ల కున్వర్బాయి జీవితం స్ఫూర్తిదాయకం. ఆమెకున్న మేకలు అమ్మి తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించారు. స్వచ్ఛభారత్‌లో ఆమె భాగస్వామ్యం మరువలేనిది. ఆమెనుంచి ఆశీర్వాదం తీసుకున్న రోజును ఎన్నటికీ మరవబోను’ అన్నారు. -
నడివీధిలో శైశవ గీతం!
మంటగలుస్తున్న మానవత్వం రోడ్డు పాలవుతున్న పసికందులు శిశువిహార్‌కి ఏటా వంద మందికి పైనే పదేళ్లలో 2346 మంది... సామాజిక-ఆర్థిక కారణాలే నేపథ్యంత పాపం, పుణ్యం, ప్రపంచమార్గం.. కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని పూవుల్లారా,అరుుదారేడుల పాపల్లారా...తండ్రిసందిటా..తల్లి కౌగిటా ఉండాల్సిన..మీరు వీధి పాలవుతున్నారు... ఈ పాపం ఎవరిది..? ఈ అమానుషానికి అంతం ఎప్పుడు? ..మహానగరంలో మానవత్వం మంటగలుస్తోంది... పక్షానికో పసికందు రోడ్డు పాలవుతోంది...గడిచిన నెల రోజుల కాలంలోనే నలుగురు చిన్నారులు బోడ్డూడక ముందే పొత్తిళ్లకు దూరమై వార్తల్లోకి ఎక్కారు... వీరిని అక్కున చేర్చుకునే శిశువిహార్‌కు దశాబ్ద కాలంలో 2346 మంది చేరారు. వీరిలో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఉదంతాల వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వీధుల పాలవుతున్న వారిలో కొందరు బతికి బట్టకడుతుండగా... వీధి జంతువుల బారినపడి ప్రాణాలు వదులుతున్న సంఘటనలూ ఉన్నారుు. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: నగరంలో వివిధ కారణాలతో రోడ్డు పాలవుతున్న పసిగుడ్డుల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్ల అంటే చులకన భావన, భారం అనే ఉద్దేశం ఇప్పటికీ అనేక మందిలో ఉంది. కాస్త వైద్యపరమైన అవగాహన కలిగిన వారు గర్భస్థ దశలోనే స్కానింగ్ తదితరాలను ఆశ్రరుుంచడం ద్వారా పుట్టబోయేది ఎవరో తెలుసుకుంటున్నారు. ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం నిషేధించిన ‘డిమాండ్’ను బట్టి జరుగుతూనే ఉన్నారుు. అలా పుట్టబోయే వారి వివరాలు తెలుసుకుంటున్న వారిలో అనేక మంది గర్భస్రావం వంటి వాటి వైపు మొగ్గుతూ భ్రూణ హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం లేని దిగువ మధ్య తరగతి, కింది తరగతులకు చెందిన వారు బిడ్డ పుట్టే వరకు ఆగి ఆపై ఆడపిల్ల అరుుతే వీధుల పాలు చేస్తున్నారు. రోడ్డు పాలవుతున్న ఆడశిశువులతో పోలిస్తే మగ శిశువుల సంఖ్య 5 శాతం కూడా ఉండట్లేదు. కారణాలు అనేకం... మాతృత్వాన్ని మరిచి పుట్టిన బిడ్డల బొడ్డూడక ముందే నడిరోడ్డుపై వదిలేయడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సామాజిక నేపథ్యం, ఆర్థిక కారణాలు, కుంటుంబ పరిస్థితులు వీటన్నింటి ప్రభావం ఉందని వివరిస్తున్నారు. ఆడపిల్లలను వదిలించుకోవాలనే భావన ప్రధాన కారణంగా ఉంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, భార్యాభర్తల మధ్య స్పర్థలు, సక్రమంగా లేని కుటుంబ నేపథ్యాల కారణంగానూ మాతృత్వాన్ని మర్చిపోతున్నారు. దీనికి తోడు పుట్టిన బిడ్డలో వైకల్యాలు, గుండెకు రంధ్రం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నప్పుడూ వారిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలానా బిడ్డ కావాలంటూ ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆ ఫలితం లభించకపోరుునా వదిలించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య నగరాల కంటే దాని చుట్టుపక్కల విస్తరించి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు. అసాంఘికశక్తులుగా మారే ప్రమాదం... ఈ రకంగా వీధుల పాలవుతున్న శిశువులు పెరిగే కొద్దీ మానసికంగా ధ్వేషభావాన్ని పెంచుకునే అవకాశం ఉందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజంపై ఏహ్యభావం పెరగడం, ఆలనాపాలనా లేకపోవడం ఫలితంగా పెడదారులు పట్టి అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. పెరిగే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాల కారణంగా వీరిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందని, త్వరగా వ్యసనాలకు బానిసలు కావడంతో పాటు కరుడుగట్టిన వారిగానూ మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇలా పసిగుడ్డులు రోడ్డు పాలు కావడంతో తల్లి తప్పు ఎంత ఉంటుందో... తండ్రి తప్పూ అదే స్థారుులో ఉంటుంది. శిశువిహార్‌కు 2346 మంది... నగరంతో పాటు శివారు జిల్లాల్లోనూ లభించే పసివాళ్లను సంరక్షణ నిమిత్తం అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న శిశువిహార్‌కు పంపిస్తారు. ఈ కేంద్రానికి గడిచిన పదేళ్ళ కాలంలో 2346 మంది శిశువులు రాగా... వీరిలో 1720 మంది ఆడశిశువులే. స్పష్టంగా చూస్తే ఇక్కడా ‘వివక్ష’ కనిపిస్తోంది. ఆడపిల్లను స్వేచ్ఛగా బతకనీయలేని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేంద్రం అధికారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆడపిల్లలు కావడం, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య స్పర్థల తదితర కారణాలతో రోడ్డు పాలైన శిశువులను అవసరమైన స్థారుులో సంరక్షిస్తాం. అర్హులను గుర్తించడం ద్వారా పదేళ్ళల్లో 1063 మందిని దత్తతిచ్చాం. మరో 229 మంది తల్లిదండ్రుల్ని గుర్తించి వారికి అప్పగించాం. ఇక్కడకు వచ్చిన శిశువుల్ని కంటికి రెప్పలా కాపాడటంతో పాటు వారి కాళ్ళపై వాళ్ళు నిలిచే వారకు తోడుగా ఉంటాం’ అని అన్నారు. అనేక సందర్భాల్లో పోలియోతో పాటు ఇతర వ్యాధులు సోకిన, అవయవాలు సరిగ్గా లేకండా పుట్టిన శిశువుల్ని ఇలా వదిలేయడం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఇవి హత్యలు కాదా? 19.04.2016: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డ బావి నాలాలో నాలుగు రోజుల పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 16.05.2016: రెండు రోజుల వయస్సున్న ఆడ శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి ఓ ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి ఎస్సార్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్పెంటర్ శివ ఇచ్చిన సమాచారంతో ఇది వెలుగులోకి వచ్చింది. 04.07.2016: చిక్కడపల్లి ఠాణా పరిధిలోని హరినగర్‌లోని ఓ ఇంటి పై భాగంలో పడి ఉన్న ఆడ శిశువు మృతదేహాన్ని స్థానికుల సాయంతో పోలీసులు స్వాధీనం చేసకున్నారు. 6.10.2016: బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద పొదల్లో ఓ పసికందు ఏడుపు విని స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అది వచ్చేసరికి శిశువు చనిపోరుుంది. వీటికి బాధ్యులెవరు? 18.05.2016:హుమాయున్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కై లాష్ నగర్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోలోంచి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును గుడ్డల్లో చుట్టి పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు శిశువును ఆస్పత్రికి చేర్చారు. 07.08.2016: ఏడాదిన్నర వయస్సున్న ఓ పాపని గుర్తుతెలియని వ్యక్తులు గాంధీ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళారు. వాహనాలు పార్క్ చేసే సెల్లార్లో ఈ పాపను గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి సమాచారం ఇచ్చాడు. పోలీయో సోకిందనే కారణంగానే పాపను వదిలినట్లు గుర్తించారు. 04.10.2016: హయత్‌నగర్ నుంచి కుంట్లూరు వెళ్ళే దారిలో పాపయ్య గూడ చౌరస్తా వద్ద చెట్ల పొదల్లో రెండు నెలల శిశువును పోలీసులు గుర్తించారు. పాప ఏడుపు విన్న స్థానికుల సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులు శిశువును శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. 10.10.2016: పంజగుట్ట ఠాణా పరిధిలోని రాజ్‌భవన్ రోడ్డులోని అప్పయ్యగుడి వీధిలో ఓ చెత్తకుండీనే శిశువు పొత్తిళ్ళయ్యారుు. చెత్తకుప్ప సమీపంలో పసిగుడ్డు ఉండటాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు చెప్పడంతో వారు రెస్క్యూ చేశారు. అది నిర్ధారిస్తే నేరమే ‘పసివాళ్ళును ఇలా ఏలాంటి ఆధారం లేకుండా నిర్దాక్షణ్యంగా రోడ్లపై వదిలేయడం కూడా చట్ట ప్రకారం నేరమే. వీరితో పాటు వృద్ధుల కోసం కొన్నేళ్ళ క్రితం ప్రత్యేక చట్టం వచ్చింది. దీని ప్రకారం అలా అమానుషంగా వ్యవహరించే వారికి శిక్షించవచ్చు. అరుుతే ఇలాంటి కేసుల్లో ఆ శిశువుల్ని వదిలేసిన తల్లిదండ్రులు ఎవనేది గుర్తిచడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఈ చట్టం పూర్తిస్థారుులో అమలుకావట్లేదు. అవకాశం ఉన్నా అనేక సందర్భాల్లో విభాగాలు పట్టించుకోవట్లేదు.’ - రామకృష్ణ, మాజీ డీఎస్పీ -
ఆడబిడ్డని తెలిస్తే అంతం!
మానవ జీవన చక్రపరంపరకు కారకమైన మూలాలు మొగ్గ దశలోనే రాలిపోతున్నాయి. లోకం చూడకుండానే మాతృగర్భంలోనే మాడిపోతున్నాయి. ఊపిరి పోసేవారే.. ఉసురు తీస్తున్నారు. చట్టాలను కాదని గుట్టుగా సాగుతున్న లింగనిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలకు కారణమవుతున్నాయి. ఆడ బిడ్డని తెలిస్తే చాలు కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు రెచ్చిపోతున్నారు. అనుభవం, అర్హతలు లేకపోయినా అబార్షన్లు చేస్తూ తల్లుల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు. ఆర్ఎంపీలు, పీఎంపీలే స్పెషలిస్ట్‌లా? జిల్లాలో పలు చోట్ల ఆర్ఎంపీ, పీఎంపీలు అబార్షన్ స్పెషలిస్టులుగా చెలామణి అవుతున్నారు. కేవలం ప్రథమచికిత్సలు మాత్రం చేయాల్సిన వీరు రహస్యంగా ఇలాంటి పనులు చేస్తున్నా అడిగేవారే లేరు. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు లాంటి చోట్లే కాకుండా పలమనేరు, వీకోట, పుంగనూరు, పీలేరు తదితర పట్టణాల్లోనూ తుదకు మండల కేంద్రాల్లోనూ అబార్షన్లు చేస్తున్నట్టు సమాచారం. - గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు - స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ - జిల్లాలో పెచ్చుమీరుతున్న భ్రూణహత్యలు - భారీగా తగ్గుతున్న బాలికల నిష్పత్తి పలమనేరు : జిల్లాలో భ్రూణ హత్యల పరంపర కొనసాగుతోంది. ఏటా 890 వరకు జరుగుతున్నట్టు అధికారుల అంచనా. ఇందులో అబార్షన్లు వికటించి తల్లులూ మృత్యువాత పడుతున్నారు. ఈ మరణాలు పది వరకు ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఇలా - భార్యాభర్తలు బిడ్డకు బిడ్డకూ మధ్య ఎడం కావాలనుక్నునప్పుడు వారి సమ్మతితో మాత్రం అదికూడా అర్హత కల్గిన వైద్యుల వద్ద గర్భస్రావం చేసుకోవచ్చు. - గర్భంలో పెరుగుతున్న శిశువువల్ల తల్లికి ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకు చేయవచ్చు. - గర్భం దాల్చిన 12 వారాల్లోపు సింగిల్ గైనకాలజిస్ట్, 20 వారాలు వరకు ఇరువురు స్పెషలిస్టులు అబార్షన్ చేయవచ్చు. ఇదిగో సాక్ష్యం - పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ ఆర్ఎంపీ రోజూ అబార్షన్ కేసులు ఎక్కువగా చేస్తున్నట్టు తెలిసింది. - కొందరు ఏజెంట్లను నియమించుకుని వారికి కమీషన్లు ఇస్తూ నిత్యం ఇలాంటి కేసులనే చేస్తున్నట్టు సమాచారం. - ఇదే పట్టణంలో ఓ పేరుమోసిన డాక్టర్ సైతం అబార్షన్లు చేస్తున్నట్టు తెలిసింది. - ఈ మధ్యనే రెండు నెలల పసికందును రోడ్డుపక్కనే పడేయడం దుమారం రేగింది. - కొందరు నర్సులూ రహస్యంగా అబార్షన్లు చేస్తున్నారు. - తిరుపతిలో అయితే ఇలాంటి ఆర్ఎంపీ, పీఎంపీలు యాభై మంది వరకు ఉన్నారు. - మదనపల్లెలో ఈ మధ్యనే ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేశాడు. కానీ అది వికటించడంతో ఆ మహిళని కుటుంబ సభ్యులు సీఎంసీకి తీసుకెళ్లారు. - బెరైడ్డిపల్లెకు చెందిన ఓ మహిళకు మూడో గర్భం కూడా ఆడపిల్లే అని స్కానింగ్‌లో తేలడంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీ వద్ద ఇటీవల అబార్షన్ చేయించుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంది. - స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియగానే పిండాన్ని తుంచేస్తున్నారు. పీఎన్డీటీ అమలు అంతంతమాత్రమే అబార్షన్లు నిరోదించేందుకు ప్రభుత్వం పీఎన్డీటీ (ప్రొహిబిట్ ప్రివెన్షనల్ డయోగ్నోస్టిక్ టెక్నాలజీస్-1994 ) చట్టాన్ని పెట్టింది. దీన్ని మరింత సవరించి 2011 నుంచి నిబంధనలను కఠినతరం చేసింది. స్కానింగ్ సెంటర్లకి కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండి, భార్యాభర్తల అంగీకారం, వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ ఇవేమీ జరగడం లేదు. తగ్గుతున్న బాలికల నిష్పత్తి భ్రూణ హత్యల కారణంగా జిల్లాలో బాలికల సంఖ్య ఏటా తగ్గుముఖం పడుతోంది. 1991లో వెయ్యిమంది బాలురకు బాలికల సంఖ్య 970 గా ఉండేది. ఇది 2001లో 955, 2011లో 931కు పడిపోయింది. -
చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు!
ఒక బిడ్డ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అనే తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా జనాభా అదుపులో నాటు వైద్యాన్ని అశ్రయించినట్టు భావిస్తున్నదా? 70వ దశకంలో మొదలైన ఒక బిడ్డ విధానం అవాంఛనీయ పరిణామాల దిశగా చైనా సామాజిక వ్యవస్థను నడిపించిన మాట నిజం. ఈ వాస్తవాన్ని గడచిన నాలుగయిదేళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించక తప్పడం లేదు. అత్యంత కఠినంగా అమలు చేస్తున్న ఈ విధానం వల్ల భవిష్యత్తులో చైనా శ్రామిక కొరత సమస్యను ఎదుర్కోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీనితో ఎదురయ్యే ప్రభావాన్ని 2015 సంవత్సరానికే చైనా చవిచూడవలసి వస్తుంది. వీటన్నిటి ఫలితమే రెండో బిడ్డకు అవకాశం కల్పించాలన్న చైనా ప్రభుత్వ యోచన. ఆహారధాన్యాల కొరత రాకుండా ఉండడానికి చైనా జనాభాను అదుపు చేసింది. ఆ దేశం సాధించిన పురోగతికీ, జనాభా అదుపునకూ మధ్య సంబంధం ఎంత గాఢమైనదో తెలియదు కానీ, బలవంతపు కుటుంబ నియంత్రణ కారణంగా మూడు దశాబ్దాలుగా చైనా మాతృమూర్తులు మాత్రం ఘోరమైన క్షోభను మౌనంగా అనుభవించిన మాట వాస్తవం. ఈ జూన్ మధ్యలో జరిగిన ఘటన చైనా అధికారులకు వాస్తవాన్ని తెలుసుకునేటట్టు చేసింది. డాగ్జింగ్ నగరంలో తన నాలుగో బిడ్డ వివరాలు నమోదు చేసుకోవడానికి నిరాకరించిన ‘ఒకే బిడ్డ’ పథకం అమలు అధికారులు ఇద్దరిని ఒక పౌరుడు హత్య చేశాడు. ఇది గగ్గోలు పుట్టించింది. బిడ్డకు సంబంధించిన వివరాలు అధికారికంగా నమోదు కాకుంటే ఆ సమస్యలు ఎంత తీవ్రమైనవో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పౌరసత్వంతో పాటు, అన్ని ప్రభుత్వ పథకాలకు ఆ బిడ్డ దూరంగా ఉండవలసివస్తుంది. కానీ ఒకే బిడ్డ పథకం వల్ల ఇంతవరకు నలభై కోట్ల జననాలను అదుపు చేయడానికి వీలు కలిగిందని అధికారులు వాదిస్తున్నారు. దేశ జనాభా 130 కోట్ల దగ్గర ఆగిందంటే కారణం అదేనని కూడా వారు చెబుతున్నారు. కానీ జనాభా సంక్షోభం చైనాలో ప్రస్తుత వాస్తవమని జాతీయ ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషనర్ మావో క్యునన్ ఆగస్టు 3న వెల్లడిం చాడు. పట్టణ, నగర ప్రాంత దంపతులు ఒక బిడ్డ తరువాత కుటుంబ నియంత్రణ పాటించాలన్న పద్ధతిని 1978లో చైనా ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు యథాతథంగా వర్తించదు. మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టిన వారు, తరువాత ఇంకొక బిడ్డను కనడానికి అర్హులవుతారు. ఒక బిడ్డ విధానం వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన వ్యత్యా సం వచ్చిందన్న విమర్శ కూడా ఉంది. గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం చైనా జనాభాలో 13.7 శాతం (185 మిలి యన్లు) అరవైలకు దగ్గరగా ఉన్నారు, లేదా ఆ వయసుకు చేరుకున్నారు. ఈ సంఖ్య కేవలం 2015కే 22 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో సంతానానికి దూరంగా ఉండే జనాభా 5 కోట్ల 10 లక్షలుగా తేల్చారు. నిజానికి ఒక బిడ్డ నిబంధనను సడలించే పని చైనాలో కొన్నిచోట్ల 2007లోనే మొదలయింది.స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని ప్రాంతాలలో ఇది అమలవుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ షాంఘై నగరం. దీని ప్రకారం రెండో బిడ్డను కనాలనుకుంటున్న భార్యాభర్తలు ఇద్దరు ఒకే బిడ్డ నిబంధనను పాటించిన కుటుంబం నుంచి వచ్చినవారై ఉండాలి. ఇదే దేశమంతా అమలుచేయాలని యోచిస్తున్నారు. ఇది ఈ సంవత్సరాంతంలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో అమలులోకి రావచ్చు. జనాభా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీయే రూపొందిస్తుంది. జనాభాను నిలకడగా ఉంచాలన్న మౌలిక విధానాన్ని మార్చుకోకుండానే, సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే శ్రామికుల కొరతను నివారించేందుకు రెండో బిడ్డకు అవకాశం కల్పిస్తున్నారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అన్న తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. రెండో బిడ్డ గురించి ఇటీవల జరిపిన సర్వేలో 1400 మందిని ప్రశ్నించగా అందులో 53 శాతం తాము ఇందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు. ‘మెట్రోపోలిస్’ అనే పత్రిక ప్రచురించిన ఈ సర్వే ప్రకారం తమకు రెండో బిడ్డ కావాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్క బిడ్డే చాలనుకుంటున్నామని 28 శాతం చెప్పారు. 12 శాతం మాత్రం తాము సంతానం కోసం ఆలోచించడం లేదని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ చైనా ప్రభుత్వం రెండో బిడ్డను కనడానికి అభ్యంతరం లేదని ప్రకటిస్తే చైనాలో ఏటా 95 లక్షల జననాలుకు పూర్వరంగం ఏర్పడుతుంది. ఒకే బిడ్డ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే 2020 నాటికి స్త్రీల కంటె 24 మిలియన్ పురుషులు అదనంగా ఉంటారు. వీరిలో పది శాతం పురుషుల జీవితం తోడు లేకుండానే గడిచిపోతుంది. చైనాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కావచ్చు, కానీ ఒక కుటుంబంలో మరో బిడ్డ రావడం ప్రాకృతికమైన అంశం. ఆ బిడ్డను వదులుకోవలసి రావడం అనుబంధాలకు సంబంధించిన అతిసున్నితమైన అంశం. ఆంక్షలకు విరుద్ధంగా కొందరు తల్లులు రెండో బిడ్డను, ఇంకొందరు తల్లులు మూడో బిడ్డను గర్భం దాల్చితే వారిపట్ల ప్రభుత్వాధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. చైనా కుటుంబ నియంత్రణ విభాగం మాజీ అధికారి ఝాంగ్ వీక్వింగ్ దారుణమైన విష యం బయటపెట్టారు. చైనా వైద్య ఆరోగ్య శాఖలో 1,50,000 ఉద్యోగులు ఉండగా, ఇం దులో మూడో వంతు వృత్తిపరమైన అర్హతలు లేనివారే. వీరే కుటుంబ నియంత్రణను అమ లు చేస్తారు. ఇక గర్భనిరోధకాలు వాడటం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న దుష్ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయని గౌంగ్ఝువాలో ఉన్న సన్యెట్సెన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జియెమింగ్ చెప్పారు. ఏడో నెలలో గర్భస్రావాలు చేయ డం వల్ల తల్లులు ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. తమ బాధను ఆ మృత శిశువుల పక్కన రాతపూర్వకంగా ఉంచుతున్నారు. ఇలాంటి ఒక ఘటనే కొద్దికాలం క్రితం కలకలం రేపింది. కొన్ని సందర్భాలలో బిడ్డను కంటె, ఆ శిశువులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపుతున్న సంగతి కూడా బయటపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా గర్భం తో ఉన్న మహిళలను ఎనిమిదో నెలలో కూడా అధికారులు ఆస్పత్రులకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించిన సంఘటనలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా మరో బిడ్డను కనకుండా ప్రభుత్వం స్త్రీల గర్భాలలో ఏర్పాటు చేసే గర్భనిరోధక సాధనం (ఐయూడీ) వల్ల కూడా విపరీతమైన దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సాధనం ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు గడిచినా మళ్లీ తనిఖీ చేసి తొల గించే వ్యవస్థ అక్కడ లేదు. దీనితో చాలామంది స్త్రీలు గర్భాశయాన్ని తొలగించుకోవలసి వస్తున్నది. కుటుంబ నియంత్రణ లేదా, ప్రసవాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం గురించి ‘ది బీజింగ్ న్యూస్’ వెల్లడించింది. ఈ సంవత్సరం మార్చి 19న ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భస్థ సంబంధమైన శస్త్రచికిత్స జరిగినపుడు హ్యూబీ అనే మహిళ మరణిస్తే అధికారులు నష్టపరిహారం పేరుతో ఆమె భర్త షెంగ్ హోగ్జియా నోరు నొక్కేశారు. అతడికి పది లక్షల యెన్లు ఇచ్చారు. అభివృద్ధిని ఎవరూ కాదనలేరు. కానీ అది మానవీయ కోణంతో జరగకపోతే ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. అది గమనించాలి. - డాక్టర్ గోపరాజు నారాయణరావు