ఆడబిడ్డని తెలిస్తే అంతం!
మానవ జీవన చక్రపరంపరకు కారకమైన మూలాలు మొగ్గ దశలోనే రాలిపోతున్నాయి. లోకం చూడకుండానే మాతృగర్భంలోనే మాడిపోతున్నాయి. ఊపిరి పోసేవారే.. ఉసురు తీస్తున్నారు. చట్టాలను కాదని గుట్టుగా సాగుతున్న లింగనిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలకు కారణమవుతున్నాయి. ఆడ బిడ్డని తెలిస్తే చాలు కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు రెచ్చిపోతున్నారు. అనుభవం, అర్హతలు లేకపోయినా అబార్షన్లు చేస్తూ తల్లుల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు.
ఆర్‌ఎంపీలు, పీఎంపీలే స్పెషలిస్ట్‌లా?
జిల్లాలో పలు చోట్ల ఆర్‌ఎంపీ, పీఎంపీలు అబార్షన్ స్పెషలిస్టులుగా చెలామణి అవుతున్నారు. కేవలం ప్రథమచికిత్సలు మాత్రం చేయాల్సిన వీరు రహస్యంగా ఇలాంటి పనులు చేస్తున్నా అడిగేవారే లేరు. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు లాంటి చోట్లే కాకుండా పలమనేరు, వీకోట, పుంగనూరు, పీలేరు తదితర పట్టణాల్లోనూ తుదకు మండల కేంద్రాల్లోనూ అబార్షన్లు చేస్తున్నట్టు సమాచారం.
- గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు
- స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ
- జిల్లాలో పెచ్చుమీరుతున్న భ్రూణహత్యలు
- భారీగా తగ్గుతున్న బాలికల నిష్పత్తి
పలమనేరు : జిల్లాలో భ్రూణ హత్యల పరంపర కొనసాగుతోంది. ఏటా 890 వరకు జరుగుతున్నట్టు అధికారుల అంచనా. ఇందులో అబార్షన్లు వికటించి తల్లులూ మృత్యువాత పడుతున్నారు. ఈ మరణాలు పది వరకు ఉన్నట్లు సమాచారం.
నిబంధనలు ఇలా
- భార్యాభర్తలు బిడ్డకు బిడ్డకూ మధ్య ఎడం కావాలనుక్నునప్పుడు వారి సమ్మతితో మాత్రం అదికూడా అర్హత కల్గిన వైద్యుల వద్ద గర్భస్రావం చేసుకోవచ్చు.
- గర్భంలో పెరుగుతున్న శిశువువల్ల తల్లికి ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకు చేయవచ్చు.
- గర్భం దాల్చిన 12 వారాల్లోపు సింగిల్ గైనకాలజిస్ట్, 20 వారాలు వరకు ఇరువురు స్పెషలిస్టులు అబార్షన్ చేయవచ్చు.
ఇదిగో సాక్ష్యం
- పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ ఆర్‌ఎంపీ రోజూ అబార్షన్ కేసులు ఎక్కువగా చేస్తున్నట్టు తెలిసింది.
- కొందరు ఏజెంట్లను నియమించుకుని వారికి కమీషన్లు ఇస్తూ నిత్యం ఇలాంటి కేసులనే చేస్తున్నట్టు సమాచారం.
- ఇదే పట్టణంలో ఓ పేరుమోసిన డాక్టర్ సైతం అబార్షన్లు చేస్తున్నట్టు తెలిసింది.
- ఈ మధ్యనే రెండు నెలల పసికందును రోడ్డుపక్కనే పడేయడం దుమారం రేగింది.
- కొందరు నర్సులూ రహస్యంగా అబార్షన్లు చేస్తున్నారు.
- తిరుపతిలో అయితే ఇలాంటి ఆర్‌ఎంపీ, పీఎంపీలు యాభై మంది వరకు ఉన్నారు.
- మదనపల్లెలో ఈ మధ్యనే ఓ ఆర్‌ఎంపీ అబార్షన్ చేశాడు. కానీ అది వికటించడంతో ఆ మహిళని కుటుంబ సభ్యులు సీఎంసీకి తీసుకెళ్లారు.
- బెరైడ్డిపల్లెకు చెందిన ఓ మహిళకు మూడో గర్భం కూడా ఆడపిల్లే అని స్కానింగ్‌లో తేలడంతో స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్ద ఇటీవల అబార్షన్ చేయించుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంది.
- స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియగానే పిండాన్ని తుంచేస్తున్నారు.
పీఎన్‌డీటీ అమలు అంతంతమాత్రమే
అబార్షన్లు నిరోదించేందుకు ప్రభుత్వం పీఎన్‌డీటీ (ప్రొహిబిట్ ప్రివెన్షనల్ డయోగ్నోస్టిక్ టెక్నాలజీస్-1994 ) చట్టాన్ని పెట్టింది. దీన్ని మరింత సవరించి 2011 నుంచి నిబంధనలను కఠినతరం చేసింది. స్కానింగ్ సెంటర్లకి కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండి, భార్యాభర్తల అంగీకారం, వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. కానీ ఇవేమీ జరగడం లేదు.
తగ్గుతున్న బాలికల నిష్పత్తి
భ్రూణ హత్యల కారణంగా జిల్లాలో బాలికల సంఖ్య ఏటా తగ్గుముఖం పడుతోంది. 1991లో వెయ్యిమంది బాలురకు బాలికల సంఖ్య 970 గా ఉండేది. ఇది 2001లో 955, 2011లో 931కు పడిపోయింది.