చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు! | China Enforces Its One Baby Policy to control population | Sakshi
Sakshi News home page

చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు!

Published Tue, Aug 13 2013 12:24 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు! - Sakshi

చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు!

ఒక బిడ్డ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అనే తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది.
 
ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా జనాభా అదుపులో నాటు వైద్యాన్ని అశ్రయించినట్టు భావిస్తున్నదా?  70వ దశకంలో మొదలైన ఒక బిడ్డ విధానం అవాంఛనీయ పరిణామాల దిశగా చైనా సామాజిక వ్యవస్థను నడిపించిన మాట నిజం. ఈ వాస్తవాన్ని గడచిన నాలుగయిదేళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించక తప్పడం లేదు. అత్యంత కఠినంగా అమలు చేస్తున్న ఈ విధానం వల్ల భవిష్యత్తులో చైనా శ్రామిక కొరత సమస్యను ఎదుర్కోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
 
వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీనితో ఎదురయ్యే ప్రభావాన్ని 2015 సంవత్సరానికే చైనా చవిచూడవలసి వస్తుంది. వీటన్నిటి ఫలితమే రెండో బిడ్డకు అవకాశం కల్పించాలన్న చైనా ప్రభుత్వ యోచన. ఆహారధాన్యాల కొరత రాకుండా ఉండడానికి చైనా జనాభాను అదుపు చేసింది. ఆ దేశం సాధించిన పురోగతికీ, జనాభా అదుపునకూ మధ్య సంబంధం ఎంత గాఢమైనదో తెలియదు కానీ, బలవంతపు కుటుంబ నియంత్రణ కారణంగా మూడు దశాబ్దాలుగా చైనా మాతృమూర్తులు మాత్రం ఘోరమైన క్షోభను మౌనంగా అనుభవించిన మాట వాస్తవం.
 
 ఈ జూన్ మధ్యలో జరిగిన ఘటన చైనా అధికారులకు వాస్తవాన్ని తెలుసుకునేటట్టు చేసింది. డాగ్జింగ్ నగరంలో తన నాలుగో బిడ్డ వివరాలు నమోదు చేసుకోవడానికి నిరాకరించిన ‘ఒకే బిడ్డ’ పథకం అమలు అధికారులు ఇద్దరిని ఒక పౌరుడు హత్య చేశాడు. ఇది గగ్గోలు పుట్టించింది. బిడ్డకు సంబంధించిన వివరాలు అధికారికంగా నమోదు కాకుంటే ఆ సమస్యలు ఎంత తీవ్రమైనవో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
 
 పౌరసత్వంతో పాటు, అన్ని ప్రభుత్వ పథకాలకు ఆ బిడ్డ దూరంగా ఉండవలసివస్తుంది. కానీ ఒకే బిడ్డ పథకం వల్ల ఇంతవరకు నలభై కోట్ల జననాలను అదుపు చేయడానికి వీలు కలిగిందని అధికారులు వాదిస్తున్నారు. దేశ జనాభా 130 కోట్ల దగ్గర ఆగిందంటే కారణం అదేనని కూడా వారు చెబుతున్నారు. కానీ జనాభా సంక్షోభం చైనాలో ప్రస్తుత వాస్తవమని  జాతీయ ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషనర్ మావో క్యునన్ ఆగస్టు 3న వెల్లడిం చాడు. పట్టణ, నగర ప్రాంత దంపతులు ఒక బిడ్డ తరువాత కుటుంబ నియంత్రణ పాటించాలన్న పద్ధతిని 1978లో చైనా ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు యథాతథంగా వర్తించదు.
 
  మొదటి కాన్పులో  ఆడబిడ్డ పుట్టిన వారు, తరువాత ఇంకొక బిడ్డను కనడానికి అర్హులవుతారు. ఒక బిడ్డ విధానం వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన వ్యత్యా సం వచ్చిందన్న విమర్శ కూడా ఉంది. గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం చైనా జనాభాలో 13.7 శాతం (185 మిలి యన్లు) అరవైలకు దగ్గరగా ఉన్నారు, లేదా ఆ వయసుకు చేరుకున్నారు. ఈ సంఖ్య కేవలం 2015కే 22 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో సంతానానికి దూరంగా ఉండే జనాభా 5 కోట్ల 10 లక్షలుగా తేల్చారు.
 
 నిజానికి ఒక బిడ్డ నిబంధనను సడలించే పని చైనాలో కొన్నిచోట్ల 2007లోనే మొదలయింది.స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని ప్రాంతాలలో ఇది అమలవుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ షాంఘై నగరం. దీని ప్రకారం రెండో బిడ్డను కనాలనుకుంటున్న  భార్యాభర్తలు ఇద్దరు ఒకే బిడ్డ నిబంధనను పాటించిన కుటుంబం నుంచి వచ్చినవారై ఉండాలి. ఇదే దేశమంతా అమలుచేయాలని యోచిస్తున్నారు. ఇది ఈ సంవత్సరాంతంలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో అమలులోకి రావచ్చు. జనాభా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీయే రూపొందిస్తుంది. జనాభాను నిలకడగా ఉంచాలన్న మౌలిక విధానాన్ని మార్చుకోకుండానే, సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే శ్రామికుల కొరతను నివారించేందుకు రెండో బిడ్డకు అవకాశం కల్పిస్తున్నారు.
 
 ఏమైనా చైనా ఒకే బిడ్డ అన్న తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. రెండో బిడ్డ గురించి ఇటీవల జరిపిన సర్వేలో 1400 మందిని ప్రశ్నించగా అందులో 53 శాతం తాము ఇందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు.
 
  ‘మెట్రోపోలిస్’ అనే పత్రిక ప్రచురించిన ఈ సర్వే ప్రకారం తమకు రెండో బిడ్డ కావాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్క బిడ్డే చాలనుకుంటున్నామని 28 శాతం చెప్పారు. 12 శాతం మాత్రం తాము సంతానం కోసం ఆలోచించడం లేదని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ చైనా ప్రభుత్వం రెండో బిడ్డను కనడానికి అభ్యంతరం లేదని ప్రకటిస్తే చైనాలో ఏటా 95 లక్షల జననాలుకు పూర్వరంగం ఏర్పడుతుంది. ఒకే బిడ్డ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే  2020 నాటికి స్త్రీల కంటె 24 మిలియన్ పురుషులు అదనంగా ఉంటారు. వీరిలో పది శాతం పురుషుల జీవితం తోడు లేకుండానే గడిచిపోతుంది.
 
 చైనాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కావచ్చు, కానీ ఒక కుటుంబంలో మరో బిడ్డ రావడం ప్రాకృతికమైన అంశం. ఆ బిడ్డను వదులుకోవలసి రావడం అనుబంధాలకు సంబంధించిన అతిసున్నితమైన అంశం. ఆంక్షలకు విరుద్ధంగా కొందరు తల్లులు రెండో బిడ్డను, ఇంకొందరు తల్లులు మూడో బిడ్డను గర్భం దాల్చితే వారిపట్ల ప్రభుత్వాధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
 
 ఈ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. చైనా కుటుంబ నియంత్రణ విభాగం మాజీ అధికారి ఝాంగ్ వీక్వింగ్ దారుణమైన విష యం బయటపెట్టారు. చైనా వైద్య ఆరోగ్య శాఖలో 1,50,000 ఉద్యోగులు ఉండగా, ఇం దులో మూడో వంతు వృత్తిపరమైన అర్హతలు లేనివారే. వీరే కుటుంబ నియంత్రణను అమ లు చేస్తారు. ఇక గర్భనిరోధకాలు వాడటం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న దుష్ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయని గౌంగ్‌ఝువాలో ఉన్న సన్‌యెట్‌సెన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జియెమింగ్ చెప్పారు.
 
  ఏడో నెలలో గర్భస్రావాలు చేయ డం వల్ల తల్లులు ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. తమ బాధను ఆ మృత శిశువుల పక్కన రాతపూర్వకంగా ఉంచుతున్నారు. ఇలాంటి ఒక ఘటనే కొద్దికాలం క్రితం కలకలం రేపింది. కొన్ని సందర్భాలలో బిడ్డను కంటె, ఆ శిశువులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపుతున్న సంగతి కూడా బయటపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా గర్భం తో ఉన్న మహిళలను ఎనిమిదో నెలలో కూడా అధికారులు ఆస్పత్రులకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించిన సంఘటనలు జరిగాయి.
 
  నిబంధనలకు విరుద్ధంగా మరో బిడ్డను కనకుండా ప్రభుత్వం స్త్రీల గర్భాలలో ఏర్పాటు చేసే గర్భనిరోధక సాధనం (ఐయూడీ) వల్ల కూడా విపరీతమైన దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సాధనం ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు గడిచినా మళ్లీ తనిఖీ చేసి తొల గించే వ్యవస్థ అక్కడ లేదు. దీనితో చాలామంది స్త్రీలు గర్భాశయాన్ని తొలగించుకోవలసి వస్తున్నది.
 
  కుటుంబ నియంత్రణ లేదా, ప్రసవాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం గురించి ‘ది బీజింగ్ న్యూస్’ వెల్లడించింది. ఈ సంవత్సరం మార్చి 19న ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భస్థ సంబంధమైన శస్త్రచికిత్స జరిగినపుడు హ్యూబీ అనే మహిళ మరణిస్తే అధికారులు నష్టపరిహారం పేరుతో ఆమె భర్త షెంగ్ హోగ్జియా నోరు నొక్కేశారు. అతడికి పది లక్షల యెన్‌లు ఇచ్చారు. అభివృద్ధిని ఎవరూ కాదనలేరు. కానీ అది మానవీయ కోణంతో జరగకపోతే ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. అది గమనించాలి.
 - డాక్టర్ గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement