Contraception
-
నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే!
అన్యోన్యంగా ఉంటే.. పెళ్లి నూరేళ్ల పంట! లేదంటే.. రోజూ ఒక తంటా! మాటా మాటా పెరిగితే... విడాకుల మంట! చిత్రంగా..వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే భారతావనిలోనూ..సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని విడాకులు ఇప్పుడు క్షణాల మాటగా మారిపోయాయి. ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోయాయి. అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కన్పిస్తోంది. ఈ మూడు అంశాల వల్లే.. వైవాహిక వ్యవస్థ్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలేమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం. రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండటం. ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో మార్పులు వస్తుండటం.. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం. ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పలు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు.. అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే, ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం ఏడుకు చేరుకోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో ఆరుకు, ఆ్రస్టేలియాలో 5.2కు, లండన్‌లో 4.6కు, ఇటలీలో మరింత తక్కువగా అంటే 3.2కు చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి. చైనా, రష్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. వయసు మీరుతున్నా... ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అంటారు పెద్దోళ్లు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అస్సలు లేదు. దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు, పదిహేడేళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయి.. పిల్లల్ని కూడా కనేవారు. కానీ ఇప్పుడు? పాతికేళ్ల తరువాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. చదువుసంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి.. నాలుగు రాళ్లు వెనకేసుకున్న తరువాత కానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టరాదని అనుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ధనిక దేశాల్లో.. మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్వీడన్‌ను ఉదాహరణగా తీసుకుంటే 1990లలో సగటు పెళ్లీడు (మహిళలు) 28 ఏళ్లు కాగా.. 2017 నాటికి ఇది 34కు చేరింది. అయితే బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లీడు అనేది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నైజర్‌లో 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్‌లో పెళ్లీడు 1992లో 19.20 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి ఇది 21.40కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల్లో హెచ్చు తగ్గులు ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశం. ఇప్పుడు పక్కింటిలోనూ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత సాధారణమైపోయింది. దీన్ని బట్టి ప్రపంచం మొత్తమ్మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు వస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అంత స్పష్టంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వివరాల లోతులకు వెళ్లిన కొద్దీ పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తాయి. అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు విడాకుల శాతం 2.6గా ఉంటే యునైటెడ్ కింగ్డమ్లో కేవలం 0.70గా ఉండింది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తరువాత కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకూ గణనీయంగా పెరిగి ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం కలిసి ఉన్న తరువాతే విడిపోతుండటం. అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ విడాకులు ఏ దేశంలో ఎక్కువ.. ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ.. భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట.. ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ(1%) అని. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవులు, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్ వంటివి ఉన్నాయి. కారణాలివే.. అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్ లేక పోవడం, వాగ్వాదాలు, ఘర్షణలు, ఊబకాయం, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవడం, అసమాన్యత, హింస, అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు ఉన్న సార్వజనీన కారణాలు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే అంతే.. ఒక్కసారి కమిట్ అయితే.. జీవితాంతం కలిసుండాల్సి వచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి వాటికన్ సిటీ. రెండోది ఫిలిప్పీన్స్. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అస్సలు అవకాశమే లేదు. కాకపోతే ఫిలిప్పీన్స్‌లో ముస్లింలు షరియా చట్టం కింద విడాకులు పొందే అవకాశముంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్కూ విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ 2000లో రికార్డు సృష్టించింది. తరువాతి కాలంలో ఇప్పటివరకు సుమారు 30 దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు. పెళ్లికి.. పిల్లలకు సంబంధం లేదు! వైవాహిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న అతిపెద్ద ట్రెండ్ పెళ్లికి, సంతానం కలిగి ఉండటానికి మధ్య సంబంధం లేకపోవడం. అంటే.. పిల్లల్ని కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతోందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ధోరణి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌పెంట్ (ఓఈసీడీ) దేశాల్లో గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. సుమారు 38 దేశాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో పెళ్లి కాకుండా... లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్లు లేదా పెంచుకుంటున్న వారి శాతం 1960లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది. కోస్టారికాలో సుమారు 70 శాతం మంది పిల్లల జననానికి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ఇది మెక్సికోలో 65 శాతంగా, డెన్మార్క్‌లో 52 శాతంగా ఉంది. నెదర్లాండ్స్ (48), స్లొవేకియా (38), జర్మనీ (35) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాల్లో చిట్టచివరన ఉన్నది కొరియా (1.9 శాతం). అమెరికాలోని న్యూయార్క్, మిసిసిపీ రాష్ట్రాల్లో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని నిరూపించగలిగితే ‘ఏలియనేషన్’ ఆఫ్ అఫెక్షన్ కింద నష్టపరిహారం కోరుతూ కేసులేయవచ్చు. అల్యూటియాన్ దీవుల్లో పురుషులకు భార్యంటే మొహం మొత్తితే.. వస్తు మార్పిడి మాదిరిగా ఆహారం లేదా దుస్తుల కోసం వదిలించుకోవచ్చు! కెనడాకు పశ్చిమంగా... జపాన్‌కు తూర్పు దిక్కున ఉంటాయీ ద్వీపాలు. 99 ఏళ్ల వయసులో విడాకులు! 99 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వ్యక్తిగా 2011లో ఓ ఇటాలియన్ రికార్డు సృష్టించాడు. అరవై ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖలు ఈయన కంటపడ్డాయి. అంతే 96 ఏళ్ల భార్యతో తెగతెంపులు చేసేసుకున్నాడు. 1934లో జరిగిన వీరి పెళ్లి.. 2011లో పెటాకులైంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు
ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక పసిపాప భూమ్మీదికి వచ్చిన వార్త కంటే సంతోష కరమైన విషయం మరొకటి ఉండదు. భూమ్మీద అన్ని బాధలూ, వ్యాధులూ, మరణాలూ సంభవిస్తున్నప్పటికీ, శిశువు జన్మించడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తే కాదు, మానవజాతి భవిష్యత్తుకు కూడా గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే కడుపులో ఉన్న బిడ్డను అబార్షన్ రూపంలో చంపడం అంటే అది ఘోరమైన హత్య అని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ బిడ్డ పుట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. అత్యంత నిస్పృహలో, నిరాశాజనకమైన పరిస్థితుల్లో పుట్టే బిడ్డ జననం మహిళలను తరచుగా తీవ్రమైన కుంగుబాటుకూ, కొన్నిసార్లు వైద్యపరమైన సంక్లిష్టతల్లోకీ నెడుతుంటుంది. కానీ జన్మనివ్వడం అనేది మహిళలు, వారి కుటుంబాలు చేసుకోవలసిన ఎంపిక. అత్యవసరమైన సమయాల్లో అది వారి హక్కు, ఎంపికగా మాత్రమే ఉంటుంది. స్వచ్ఛంద మాతృత్వం అని కొంత మంది చెబుతున్నది, మహిళల గర్భస్రావ హక్కు. ఇది పునరుత్పత్తి, పనిలో సమానత్వానికి సంబంధించిన సాహసోపేతమైన ఫెమినిస్టు డిమాండుగా మాత్రమే లేదు. ఇది నిజంగానే మహిళ తన సొంత దేహంపై తాను మాత్రమే తీసుకోవలసిన ఎంపిక స్వాతంత్య్రంగా ఉంటుంది. అబార్షన్ అనేది వైద్యపరమైన అవసరమనీ, వైద్య శాస్త్రం స్వీయాత్మకమైన అంశంగా ఉండదనీ అమెరికన్ కాలేజీ ఆఫ్ ఆబ్‌స్టిట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఏసీఓజీ) చెప్పింది. అబార్షన్ రూపంలో గర్భధారణను తొలగించడానికి వైద్యపరమైన జోక్యం అవసరమైన పరిస్థితులు ఉంటాయి. మహిళ ఆరోగ్యాన్ని ఈ జోక్యమే కాపాడుతుంది. 2012లో సవితా హలప్పనవర్ అనే భారత సంతతి మహిళా డెంటిస్టు ఐర్లండులో రక్తంలో వ్యాధికారక క్రిములు ఉన్న కారణంగా ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లో దారుణంగా చనిపోయారు. అబా ర్షన్ చేసుకుంటానన్న ఆమె డిమాండును ఐర్లండ్ చట్టాలు తిరస్కరిం చాయి. ఆమె మరణం పెద్ద ఉద్యమానికి దారితీసి, ఐర్లండులో సంస్క రణలు తీసుకొచ్చింది. దీంతో 2018లో ఆరోగ్య బిల్లు (గర్భధారణ తొలగింపు క్రమబద్ధీకరణ చట్టం)ను కూడా ఆ దేశం ఆమోదించింది. 1973 నాటి ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును గత వారం అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహిళల అబార్షన్ హక్కును ఎత్తిపట్టిన ఆనాటి తీర్పును అమెరికన్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అదే సమయంలో గర్భస్రావ ప్రక్రియను విడివిడిగా రాష్ట్రాలు ఆమోదించచ్చు లేదా పరిమితం చేయవచ్చునని ఫెడరల్ కోర్టు పేర్కొంది. దీంతో గత పాతికేళ్లలో చట్టపరమైన అబార్షన్‌కు ఉన్న రక్షణలను తొలగించిన నాలుగు దేశాల్లో అమెరికా ఒకటిగా మారింది. అబార్షన్ చట్టాలపై ఆంక్షలు విధించడం అనేది మహిళలకు వ్యతిరేకంగా వివక్షలో ఒక రూపమని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయవాదులు, అడ్వకేట్ల హక్కుల సంస్థ అయిన సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్, అమెరికా సుప్రీంకోర్టు తాజా చర్యను నిశితంగా విమర్శించింది. అబార్షన్లపై తరచుగా జరుగుతున్న చర్చ గర్భస్థ పిండం, పిండంలో రూపు దిద్దుకుంటున్న జీవానికి సంబంధించి మానసిక, వైద్యపరమైన అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తోంది. అయితే పిల్లలను కనాలా, వద్దా అనే అంశాన్ని మహిళలు నిర్ణయించుకోవడం ఒక సామాజిక అడ్డంకిగా ఎందుకుందనే ప్రశ్నపై చర్చ జరగడం లేదు. మహిళలు కేవలం గర్భస్థ పిండాన్ని మోసేవారు మాత్రమే కాదు. ఇలాంటి అభిప్రాయంతోనే పిండంలో రూపొందుతున్న మరొక ప్రాణిని కాపాడే బాధ్యతను రాజ్యవ్యవస్థ తీసుకుని నిర్బంధ చట్టాలను అమలు చేస్తోంది. అబార్షన్ హక్కును నిషేధించడం మహిళకు ఎలాంటి అండనూ లేకుండా చేస్తుంది. ఆమె సొంత దేహం, ఆమె ఎంపిక అనేవి ఇంకా పుట్టని బిడ్డ కంటే ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మారిపోయాయి. కడుపులోని పిండాన్ని కాపాడటానికి మహిళ ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. మహిళ అంటే గర్భాన్ని మోయడం తప్ప ఒక వ్యక్తిగా ఇక ఏమాత్రం ఉండదన్నమాట. తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడినప్పడు అబార్షన్ చేసుకోవడాన్ని ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు అనుమతిస్తున్నాయి. అత్యాచారం ద్వారా, వివాహేతర సంబంధం ద్వారా గర్భం దాల్చినప్పుడు లేక బలహీనమైన పిండం కారణంగా గర్భస్రావాన్ని సగం దేశాలు అనుమతిస్తున్నాయి. కాగా ఆర్థిక, రాజకీయ కారణాలవల్ల లేక అభ్యర్థించిన కారణంగా గర్భస్రావాన్ని మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. ఆంక్షలతో కూడిన అబార్షన్ విధానాలు ఉన్న దేశాల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటోంది. అయితే అబార్షన్లపై ఆంక్షలు విధించిన దేశాల్లో అరక్షిత అబార్షన్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రసూతి మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. 1973 నాటి రో తీర్పు వల్ల అమెరికాలో వేలాదిమంది టీనేజర్లు బాల్యవివాహాన్ని, చిన్నతనంలోనే మాతృత్వాన్ని అధిగమించడానికి వీలయింది. అలాగే అవాంఛిత, అనూహ్యమైన గర్భధారణల కారణంగా తక్షణం వివాహాలు చేసుకోవలిసిన పరిస్థితినుంచి మహిళలను ఈ తీర్పు కాపాడింది. కానీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి తీర్పు రావడం అనేది మహిళల హక్కులపై తీవ్ర అఘాతం మాత్రమే కాదు... దశాబ్దాల స్త్రీవాద ఉద్యమం, మహిళల పునరుద్ధరణ, వారి హక్కుల రక్షణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అబార్షన్ చేసుకోగలగడానికీ, మహిళలు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తల్లులు కావాలో నిర్ణయించుకోవడానికీ మధ్య సాధారణమైన లింకు ఉంటోందనీ, ఇది మహిళల జీవితాంతం వారిపై ప్రభావాలు వేస్తోందనీ 2021 బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. మహిళల విద్య, ఆదాయం, కేరీర్, తమ పిల్లలకోసం కల్పించాల్సిన జీవితంపై ఇది పెను ప్రభావం చూపిస్తూంటుంది. రో వర్సెస్ వేడ్ తీర్పును రద్దు చేయడం ద్వారా అబార్షన్ని రద్దు చేయడం, లేదా పూర్తిగా ఆ హక్కుకే దూరం చేయడం అనేది మహిళల వ్యక్తిగత, ఆర్థిక జీవితాలను, వారి కుటుంబ జీవితాలను హరింప జేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అబార్షన్ చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును అమెరికన్ మహిళలు ప్రస్తుతం కోల్పోతుండగా, భారతదేశం మాత్రం 1971 నుంచే వైద్యపరంగా గర్భధారణ తొలగింపు చట్టం (ఎంటీపీ)ని కలిగి ఉంది. జనన లేదా కుటుంబ నియంత్రణ సాధనంగా ఇది ఉనికిలోకి వచ్చింది. 2021లో తీసుకొచ్చిన చట్ట సవరణ ద్వారా 24 వారాలలోపు గర్భస్రావం చేసుకునేందుకు ఈ చట్టం భారత మహిళలకు అనుమతించింది. మహిళల ఆరోగ్యానికి సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్లు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే గర్భధారణను తొలగించుకోవాలంటే భారత్‌లో వైద్యుల ఆనుమతి అవసరం. కానీ అవివాహిత మహిళలు గర్భస్రావాన్ని చేయించుకోవడం భారత్‌లో మహిళలకు కళంకప్రాయంగా ఉంటున్న స్థితి కొనసాగుతోంది. అబార్షన్ హక్కును వెనక్కు తీసుకోవడం అంటే ఆధునికతను మడతపెట్టేయడమే అవుతుంది. చట్టబద్ధమైన పద్ధతులు, వైద్యపరంగా సురక్షితమైన అబార్షన్లు లేకుంటే మహిళలు మరింత ప్రమాదంలో పడతారు. వారి జీవితాలు మరింతగా దుర్భరమవుతాయి. అనూహ్యమైన, అవాంఛితమైన గర్భధారణను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మహిళలు మరింత ప్రమాదకరమైన, అంధకారయుతమైన స్థానంలోకి నెట్టబడతారు. పైగా నిర్బంధ మాతృత్వం వల్ల వారి జీవిత గమనమే మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - వినీతా ద్వివేది అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్పీజేఐఎంఆర్ (‘మింట్’ సౌజన్యంతో) -
కరోనా: సురక్షితంగాని అబార్షన్లు 10 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు పిల్లలు కలగకుండా ఉండేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పురుషుల కండోమ్స్, స్త్రీల కండోమ్స్‌తోపాటు మాత్రలు, ఇంజెక్లు, ఆ తర్వాత స్టెరిలైజేషన్లు ఉన్నాయి. వీటిలో వేటిని ఎంత మంది వాడుతారో, ఏవీ వాడకుండా ఎంత మంది పిల్లలను కంటోరో? చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ 35 లక్షల స్టెరిలైజేషన్లు, 57 లక్షల ఇంట్రా–యుటరిన్ గర్భనిరోధక పరికరాలు, 18 లక్షల ఇంజెక్షన్లు, 41 కోట్ల సైకిళ్లకు సరిపోయే గర్భ నిరోధక మాత్రలు, 25 లక్షల అత్యవసర గర్బనిరోధక మాత్రలు, 32 కోట్ల కండోమ్స్‌ను మెడికల్ షాపుల ద్వారా కేంద్రం అందుబాటులో ఉంచింది. (వలస కార్మికులకు అండగా హైకోర్టులు) అయినప్పటికీ అనవసరంగా వచ్చే గార్భావకాశాలు కూడా భారత్‌లో ఎక్కువ. అందుకని ఈ ఏడాది కూడా 14.5 లక్షల అబార్షన్లు జరుగుతాయని, వాటిలో 8,34,042 సురక్షితంగానీ నాటు పద్ధతిలో అబార్షన్లు జరుగుతాయని, అయినప్పటికీ 6,79,864 ప్రసవాలు సంభవిస్తాయని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా అవాంఛిత ప్రెగ్నెసీల సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని, వాటిలో సురక్షితంగానీ అబార్షన్ల సంఖ్య పది లక్షలకు చేరుకుంటుందని ఆరోగ్య శాఖ అంచనాలు తెలియజేస్తున్నాయి. ప్రసవాల సంఖ్య 8,44,488 చేరుకోవచ్చని ఆరోగ్య శాఖ అంచనా. అవాంఛిత గర్భాలను తీసివేయక పోయినట్లయితే ప్రసవాల సంఖ్య మరింతగా పెరగుతుంది. సురక్షితంగానీ అబార్షన్ల వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. (అక్కడ నిషేధించారు.. మన దేశంలో ఎప్పుడు?) -
చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు!
ఒక బిడ్డ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అనే తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా జనాభా అదుపులో నాటు వైద్యాన్ని అశ్రయించినట్టు భావిస్తున్నదా? 70వ దశకంలో మొదలైన ఒక బిడ్డ విధానం అవాంఛనీయ పరిణామాల దిశగా చైనా సామాజిక వ్యవస్థను నడిపించిన మాట నిజం. ఈ వాస్తవాన్ని గడచిన నాలుగయిదేళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించక తప్పడం లేదు. అత్యంత కఠినంగా అమలు చేస్తున్న ఈ విధానం వల్ల భవిష్యత్తులో చైనా శ్రామిక కొరత సమస్యను ఎదుర్కోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీనితో ఎదురయ్యే ప్రభావాన్ని 2015 సంవత్సరానికే చైనా చవిచూడవలసి వస్తుంది. వీటన్నిటి ఫలితమే రెండో బిడ్డకు అవకాశం కల్పించాలన్న చైనా ప్రభుత్వ యోచన. ఆహారధాన్యాల కొరత రాకుండా ఉండడానికి చైనా జనాభాను అదుపు చేసింది. ఆ దేశం సాధించిన పురోగతికీ, జనాభా అదుపునకూ మధ్య సంబంధం ఎంత గాఢమైనదో తెలియదు కానీ, బలవంతపు కుటుంబ నియంత్రణ కారణంగా మూడు దశాబ్దాలుగా చైనా మాతృమూర్తులు మాత్రం ఘోరమైన క్షోభను మౌనంగా అనుభవించిన మాట వాస్తవం. ఈ జూన్ మధ్యలో జరిగిన ఘటన చైనా అధికారులకు వాస్తవాన్ని తెలుసుకునేటట్టు చేసింది. డాగ్జింగ్ నగరంలో తన నాలుగో బిడ్డ వివరాలు నమోదు చేసుకోవడానికి నిరాకరించిన ‘ఒకే బిడ్డ’ పథకం అమలు అధికారులు ఇద్దరిని ఒక పౌరుడు హత్య చేశాడు. ఇది గగ్గోలు పుట్టించింది. బిడ్డకు సంబంధించిన వివరాలు అధికారికంగా నమోదు కాకుంటే ఆ సమస్యలు ఎంత తీవ్రమైనవో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పౌరసత్వంతో పాటు, అన్ని ప్రభుత్వ పథకాలకు ఆ బిడ్డ దూరంగా ఉండవలసివస్తుంది. కానీ ఒకే బిడ్డ పథకం వల్ల ఇంతవరకు నలభై కోట్ల జననాలను అదుపు చేయడానికి వీలు కలిగిందని అధికారులు వాదిస్తున్నారు. దేశ జనాభా 130 కోట్ల దగ్గర ఆగిందంటే కారణం అదేనని కూడా వారు చెబుతున్నారు. కానీ జనాభా సంక్షోభం చైనాలో ప్రస్తుత వాస్తవమని జాతీయ ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషనర్ మావో క్యునన్ ఆగస్టు 3న వెల్లడిం చాడు. పట్టణ, నగర ప్రాంత దంపతులు ఒక బిడ్డ తరువాత కుటుంబ నియంత్రణ పాటించాలన్న పద్ధతిని 1978లో చైనా ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు యథాతథంగా వర్తించదు. మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టిన వారు, తరువాత ఇంకొక బిడ్డను కనడానికి అర్హులవుతారు. ఒక బిడ్డ విధానం వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన వ్యత్యా సం వచ్చిందన్న విమర్శ కూడా ఉంది. గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం చైనా జనాభాలో 13.7 శాతం (185 మిలి యన్లు) అరవైలకు దగ్గరగా ఉన్నారు, లేదా ఆ వయసుకు చేరుకున్నారు. ఈ సంఖ్య కేవలం 2015కే 22 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో సంతానానికి దూరంగా ఉండే జనాభా 5 కోట్ల 10 లక్షలుగా తేల్చారు. నిజానికి ఒక బిడ్డ నిబంధనను సడలించే పని చైనాలో కొన్నిచోట్ల 2007లోనే మొదలయింది.స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని ప్రాంతాలలో ఇది అమలవుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ షాంఘై నగరం. దీని ప్రకారం రెండో బిడ్డను కనాలనుకుంటున్న భార్యాభర్తలు ఇద్దరు ఒకే బిడ్డ నిబంధనను పాటించిన కుటుంబం నుంచి వచ్చినవారై ఉండాలి. ఇదే దేశమంతా అమలుచేయాలని యోచిస్తున్నారు. ఇది ఈ సంవత్సరాంతంలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో అమలులోకి రావచ్చు. జనాభా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీయే రూపొందిస్తుంది. జనాభాను నిలకడగా ఉంచాలన్న మౌలిక విధానాన్ని మార్చుకోకుండానే, సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే శ్రామికుల కొరతను నివారించేందుకు రెండో బిడ్డకు అవకాశం కల్పిస్తున్నారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అన్న తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. రెండో బిడ్డ గురించి ఇటీవల జరిపిన సర్వేలో 1400 మందిని ప్రశ్నించగా అందులో 53 శాతం తాము ఇందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు. ‘మెట్రోపోలిస్’ అనే పత్రిక ప్రచురించిన ఈ సర్వే ప్రకారం తమకు రెండో బిడ్డ కావాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్క బిడ్డే చాలనుకుంటున్నామని 28 శాతం చెప్పారు. 12 శాతం మాత్రం తాము సంతానం కోసం ఆలోచించడం లేదని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ చైనా ప్రభుత్వం రెండో బిడ్డను కనడానికి అభ్యంతరం లేదని ప్రకటిస్తే చైనాలో ఏటా 95 లక్షల జననాలుకు పూర్వరంగం ఏర్పడుతుంది. ఒకే బిడ్డ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే 2020 నాటికి స్త్రీల కంటె 24 మిలియన్ పురుషులు అదనంగా ఉంటారు. వీరిలో పది శాతం పురుషుల జీవితం తోడు లేకుండానే గడిచిపోతుంది. చైనాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కావచ్చు, కానీ ఒక కుటుంబంలో మరో బిడ్డ రావడం ప్రాకృతికమైన అంశం. ఆ బిడ్డను వదులుకోవలసి రావడం అనుబంధాలకు సంబంధించిన అతిసున్నితమైన అంశం. ఆంక్షలకు విరుద్ధంగా కొందరు తల్లులు రెండో బిడ్డను, ఇంకొందరు తల్లులు మూడో బిడ్డను గర్భం దాల్చితే వారిపట్ల ప్రభుత్వాధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. చైనా కుటుంబ నియంత్రణ విభాగం మాజీ అధికారి ఝాంగ్ వీక్వింగ్ దారుణమైన విష యం బయటపెట్టారు. చైనా వైద్య ఆరోగ్య శాఖలో 1,50,000 ఉద్యోగులు ఉండగా, ఇం దులో మూడో వంతు వృత్తిపరమైన అర్హతలు లేనివారే. వీరే కుటుంబ నియంత్రణను అమ లు చేస్తారు. ఇక గర్భనిరోధకాలు వాడటం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న దుష్ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయని గౌంగ్ఝువాలో ఉన్న సన్యెట్సెన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జియెమింగ్ చెప్పారు. ఏడో నెలలో గర్భస్రావాలు చేయ డం వల్ల తల్లులు ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. తమ బాధను ఆ మృత శిశువుల పక్కన రాతపూర్వకంగా ఉంచుతున్నారు. ఇలాంటి ఒక ఘటనే కొద్దికాలం క్రితం కలకలం రేపింది. కొన్ని సందర్భాలలో బిడ్డను కంటె, ఆ శిశువులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపుతున్న సంగతి కూడా బయటపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా గర్భం తో ఉన్న మహిళలను ఎనిమిదో నెలలో కూడా అధికారులు ఆస్పత్రులకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించిన సంఘటనలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా మరో బిడ్డను కనకుండా ప్రభుత్వం స్త్రీల గర్భాలలో ఏర్పాటు చేసే గర్భనిరోధక సాధనం (ఐయూడీ) వల్ల కూడా విపరీతమైన దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సాధనం ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు గడిచినా మళ్లీ తనిఖీ చేసి తొల గించే వ్యవస్థ అక్కడ లేదు. దీనితో చాలామంది స్త్రీలు గర్భాశయాన్ని తొలగించుకోవలసి వస్తున్నది. కుటుంబ నియంత్రణ లేదా, ప్రసవాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం గురించి ‘ది బీజింగ్ న్యూస్’ వెల్లడించింది. ఈ సంవత్సరం మార్చి 19న ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భస్థ సంబంధమైన శస్త్రచికిత్స జరిగినపుడు హ్యూబీ అనే మహిళ మరణిస్తే అధికారులు నష్టపరిహారం పేరుతో ఆమె భర్త షెంగ్ హోగ్జియా నోరు నొక్కేశారు. అతడికి పది లక్షల యెన్లు ఇచ్చారు. అభివృద్ధిని ఎవరూ కాదనలేరు. కానీ అది మానవీయ కోణంతో జరగకపోతే ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. అది గమనించాలి. - డాక్టర్ గోపరాజు నారాయణరావు