Changes in Laws related to Matrimonial system - Sakshi
Sakshi News home page

నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే! 

Published Fri, May 12 2023 4:21 AM | Last Updated on Fri, May 12 2023 9:20 AM

Changes in laws related to matrimonial system - Sakshi

అన్యోన్యంగా ఉంటే.. పెళ్లి నూరేళ్ల పంట!  లేదంటే.. రోజూ ఒక తంటా! 
మాటా మాటా పెరిగితే... విడాకుల మంట! 

చిత్రంగా..వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే భారతావనిలోనూ..సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని విడాకులు ఇప్పుడు క్షణాల మాటగా మారిపోయాయి. ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోయాయి. అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి. లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కన్పిస్తోంది. 

ఈ మూడు అంశాల వల్లే.. 
వైవాహిక వ్యవస్థ్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలేమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం. రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండటం.

ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో మార్పులు వస్తుండటం.. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం. ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పలు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. 

చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు.. 
అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే, ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం ఏడుకు చేరుకోవడం గమనార్హం.

దక్షిణ కొరియాలో ఆరుకు, ఆ్రస్టేలియాలో 5.2కు, లండన్‌లో 4.6కు, ఇటలీలో మరింత తక్కువగా అంటే 3.2కు చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి. చైనా, రష్యా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి.  

వయసు మీరుతున్నా... 
‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అంటారు పెద్దోళ్లు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అస్సలు లేదు. దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు, పదిహేడేళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయి.. పిల్లల్ని కూడా కనేవారు. కానీ ఇప్పుడు? పాతికేళ్ల తరువాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు.

చదువుసంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి.. నాలుగు రాళ్లు వెనకేసుకున్న తరువాత కానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టరాదని అనుకుంటున్నారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ధనిక దేశాల్లో.. మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

స్వీడన్‌ను ఉదాహరణగా తీసుకుంటే 1990లలో సగటు పెళ్లీడు (మహిళలు) 28 ఏళ్లు కాగా.. 2017 నాటికి ఇది 34కు చేరింది. అయితే బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లీడు అనేది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నైజర్‌లో 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్‌లో పెళ్లీడు 1992లో 19.20 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి ఇది 21.40కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

విడాకుల్లో హెచ్చు తగ్గులు 
ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశం. ఇప్పుడు పక్కింటిలోనూ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత సాధారణమైపోయింది. దీన్ని బట్టి ప్రపంచం మొత్తమ్మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు వస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అంత స్పష్టంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వివరాల లోతులకు వెళ్లిన కొద్దీ పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తాయి.

అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు విడాకుల శాతం 2.6గా ఉంటే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కేవలం 0.70గా ఉండింది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తరువాత కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉన్నట్లు తెలుస్తోంది.

కొరియా, నార్వే, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకూ గణనీయంగా పెరిగి ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం కలిసి ఉన్న తరువాతే విడిపోతుండటం.  

అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ 
విడాకులు ఏ దేశంలో ఎక్కువ.. ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ.. భారత్‌ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట.. ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ(1%) అని. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్‌ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవులు, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్‌ వంటివి ఉన్నాయి.   

కారణాలివే.. 
అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్‌ లేక పోవడం, వాగ్వాదాలు, ఘర్షణలు, ఊబకాయం, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవడం, అసమాన్యత, హింస, అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు ఉన్న సార్వజనీన కారణాలు. 

ఇక్కడ ఒక్కసారి కమిట్‌ అయితే అంతే.. 
ఒక్కసారి కమిట్‌ అయితే.. జీవితాంతం కలిసుండాల్సి వచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి వాటికన్‌ సిటీ. రెండోది ఫిలిప్పీన్స్‌. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అస్సలు అవకాశమే లేదు. కాకపోతే ఫిలిప్పీన్స్‌లో ముస్లింలు షరియా చట్టం కింద విడాకులు పొందే అవకాశముంది. సేమ్‌ సెక్స్‌ మ్యారేజెస్‌కూ విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్‌ 2000లో రికార్డు సృష్టించింది. తరువాతి కాలంలో ఇప్పటివరకు సుమారు 30 దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు.  

పెళ్లికి.. పిల్లలకు సంబంధం లేదు! 
వైవాహిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న అతిపెద్ద ట్రెండ్‌ పెళ్లికి, సంతానం కలిగి ఉండటానికి మధ్య సంబంధం లేకపోవడం. అంటే.. పిల్లల్ని కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతోందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ధోరణి ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌పెంట్‌ (ఓఈసీడీ) దేశాల్లో గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది.

సుమారు 38 దేశాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో పెళ్లి కాకుండా... లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్లు లేదా పెంచుకుంటున్న వారి శాతం 1960లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది. కోస్టారికాలో సుమారు 70 శాతం మంది పిల్లల జననానికి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ఇది మెక్సికోలో 65 శాతంగా, డెన్మార్క్‌లో 52 శాతంగా ఉంది. నెదర్లాండ్స్‌ (48), స్లొవేకియా (38), జర్మనీ (35) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాల్లో చిట్టచివరన ఉన్నది కొరియా (1.9 శాతం).

అమెరికాలోని న్యూయార్క్, మిసిసిపీ రాష్ట్రాల్లో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని నిరూపించగలిగితే ‘ఏలియనేషన్‌’ ఆఫ్‌ అఫెక్షన్‌ కింద నష్టపరిహారం కోరుతూ కేసులేయవచ్చు.

అల్యూటియాన్‌ దీవుల్లో పురుషులకు భార్యంటే మొహం మొత్తితే.. వస్తు మార్పిడి మాదిరిగా ఆహారం లేదా దుస్తుల కోసం వదిలించుకోవచ్చు!  కెనడాకు పశ్చిమంగా... జపాన్‌కు తూర్పు దిక్కున ఉంటాయీ ద్వీపాలు. 

99 ఏళ్ల వయసులో విడాకులు! 
99 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వ్యక్తిగా 2011లో ఓ ఇటాలియన్‌ రికార్డు సృష్టించాడు. అరవై ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖలు ఈయన కంటపడ్డాయి. అంతే 96 ఏళ్ల భార్యతో తెగతెంపులు చేసేసుకున్నాడు. 1934లో జరిగిన వీరి పెళ్లి.. 2011లో పెటాకులైంది.
-కంచర్ల యాదగిరిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement