![Supreme Court Asks If It Can Direct Legislature To Make Uniform Laws - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/21/SUPREME-COURT-ORIGINAL-4.jpg.webp?itok=OC5eOzTE)
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది.
‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది.
‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత
స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు.
Comments
Please login to add a commentAdd a comment