పెళ్లికి ముందు లేక వివాహేతర సంబంధంలో జన్మించిన సంతానానికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉందా? అనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటుకాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల్లో జన్మించిన పిల్లలు కూడా చట్టబద్ధమైన వారసులేనని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఉమ్మడి కుటుంబంలో((Hindu Joint Family) తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలకు కూడా హక్కు ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాంటి సంబంధంలో జన్మించిన పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుగా చూడాలని, ఆ బిడ్డ అన్యం పుణ్యం ఎరుగనదని తెలిపింది.
వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు ఇతర పిల్లల మాదిరిగానే అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. రేవణ సిద్దప్ప వర్సెస్ మల్లికార్జున్ (2011) కేసులో ఈ ప్రశ్నలు తలెత్తాయి. ఐతే అప్పటి జస్టిస్ (రిటైర్డ్) జిఎస్ సింఘ్వి, ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం సెక్షన్ 16(3)లోని సవరణ ప్రధానాంశాన్ని ప్రస్తావిస్తూ.. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని, వారికి చెల్లుబాటయ్యే వివాహంలో జన్మించిన పిల్లల మాదిరి హక్కులు ఉంటాయని అప్పట్లో బెంచ్ ఉత్తర్వులిచ్చింది. అయితే పూర్వికుల ఆస్తిలో వాటా ఉండదని అభియప్రాయపడింది.
ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండిపోయింది. దీనిపై ప్రస్తుత చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి గతంలో బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించింది. ఆయా వివాహేతర సంబంధంలో పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించింది. అలాగే తల్లిదండ్రులకు వారి పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో కూడా ఈ పిల్లలకు వాటా పొందే హక్కు ఉందని పేర్కొంది.
(చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!)
Comments
Please login to add a commentAdd a comment