ప్రజల నమ్మకం చూరగొనేలా జడ్జిలు పనిచేయాలి
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచన
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు.
జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్‌లోని ‘జేఎస్‌డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు.
ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు.
భారత్‌లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్‌లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment