అంకితభావంతో సేవలందించా: సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి అంకితభావంతో దేశానికి సేవలందించానని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తన పదవీ కాలాన్ని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అనే భయం, ఉత్కంఠ తనలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు.
బుధవారం భూటాన్‌లోని ‘జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ స్కూల్ ఆఫ్ లా’ మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘నా పదవీ కాలం ముగింపునకు వచి్చంది. భవిష్యత్తు, గతానికి సంబంధించి భయాలు, ఆందోళనలు నా మనసులో నిండిపోయాయి. ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తుతున్నాయి. నేను సాధించాల్సినవన్నీ సాధించానా? ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీ కాలాన్ని చరిత్ర ఏ విధంగా నిర్ణయిస్తుంది? ఎలా గుర్తుపెట్టుకుంటుంది? చేయాల్సిన పనులు భిన్నంగా చేశానా? లేదా? భవిష్యత్తు తరాల న్యాయమూర్తులకు, న్యాయ నిపుణులకు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఎలాంటి వారసత్వాన్ని అందించబోతున్నాను? ఈ ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు నా నియంత్రణలో లేవు.
బహుశా కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు కనిపెట్టలేనేమో! గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేశా. పదవికి పూర్తి న్యాయం చేయాలని ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే నిర్ణయించుకునేవాడిని. రాత్రి సంతృప్తితో నిద్రకు ఉపక్రమించేవాడిని. న్యాయవాద వృత్తి అనే ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడానికి, మనల్ని మనం పునఃసమీక్షించుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నానా? లేక నా వైపు నేను ప్రయాణిస్తున్నానా? అని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రశ్నించుకోవాలి. భయాలు, సందేహాలు విడిచిపెట్టాలి. లక్ష్యం వైపు సాగే ప్రయాణాన్ని ఆస్వాదించాలి. భయాలను ఎదిరించడంలోనే మన అభివృద్ధి దాగి ఉంటుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆయన 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేశారు.
Comments
Please login to add a commentAdd a comment