పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో ఓ మధురానుభూతినికలిగించే అంశం. పెళ్లీడుకొచ్చిన ప్రతి ఒక్కరూ కాబోయే జోడిని ఊహించుకుంటూ కలల ప్రపంచంలో తేలియాడుతుంటారు. వివాహమైన తర్వాత చాలా జంటలు ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతుంటాయి. కానీ ఇటీవల కాలంలోవివాహమైన రెండు, మూడేళ్లకే విడాకుల కోసంకోర్టు మెట్లెక్కుతున్నారు. భార్యాభర్తల మధ్యఅపోహలు, అనుమానాలు, ఆర్థిక అసమానతలు, ఈర్షా్యద్వేషాలు తదితర కారణాలతో పండంటి కాపురాలను నిలువునా చీల్చుకుంటున్నారు.నూరేళ్లు నిలవాల్సిన మూడు ముళ్ల బంధంమూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది.
కర్నూలు : పెళ్లి ఎంత ఆడంబరంగా చేసుకుంటున్నారో అంతకంటే వేగంగా విడాకులకు సైతం సిద్ధమవుతున్నారు. ప్రేమ, అప్యాయతలతో ఆనందంగా గడపాల్సిన వారు అపోహలు, అనుమానాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు, వన్‌స్టాప్ సెంటర్లకు, న్యాయస్థానాలకు వస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం. ప్రతిరోజూ ఆయా కేంద్రాలకు మూడు నుంచి ఆరు జంటలు కౌన్సెలింగ్ కోసం వస్తున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. పెళ్లైన ఆరు నెలల నుంచి ఏడాది తిరగకుండానే అభిప్రాయ భేదాలు రావడం, గృహహింస, అనుమానాలు, సంసార జీవితం సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో దంపతులు విడిపోతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండేవి.
ఇప్పుడు అక్కడక్కడా ఉన్నా అమ్మాయి తరుపు వారు తమ కుమార్తె అత్తారింట్లో ఎందుకు చాకిరి చేయాలని భావించి వేరే కాపురం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్రమంలోనే పెళ్లికాని వరకు ఎంతో అప్యాయంగా ఉండే అన్నదమ్ములు వివాహమయ్యాక ఆస్తిగొడవలు, వేరు సంపాదన పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా వేరు కాపురాలు అధికమయ్యాయి. దీనికితోడు ఉద్యోగాలు చేసే వారు అధికం కావడంతో చిన్న కుటుంబాలు అధికమయ్యాయి. చిన్న కుటుంబాల్లో ఏవైనా గొడవలు వస్తే సర్ది చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు అధికమై చివరకు వారి బంధం విడాకులకు దారి తీస్తోంది. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌తో పాటు ఆయా స్టేషన్లకు ఏటా దాదాపు 2 వేల వరకు విడాకుల కేసులు నమోదు వుతున్నాయి. డొమెస్టిక్ వయెలెన్స్ సెంటర్‌కు ఏటా 150 కేసులు వస్తుండగా కౌన్సిలర్లు కొన్ని జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చేస్తున్నారు. కొందరు మాత్రం విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారు.
సర్దుకుపోతేనే సంసారం
మా వద్దకు పెళ్లైన రెండు, మూడేళ్లకే విడిపోవడానికి సిద్ధమయ్యే కేసులు అధికంగా వస్తున్నాయి. ఇందులో ప్రధాన కారణం సర్దుబాటులేకపోవడమే. మెట్టినింటి అలవాట్లు, పద్ధతులను ముందే భర్త/అత్త వివరించి చెప్పాలి. దీనికి అనుగుణంగా అమ్మాయి, అబ్బాయి కూడా సర్దుకుపోవాలి. చదువుకున్న వారు, ఉద్యోగుల్లో మనస్పర్థలు ఎక్కువగా వస్తున్నాయి. నీకంటే నేనేమీ తక్కువ కాదన్న భావన ఇద్దరిలోనూ ఎక్కువవుతోంది. – నర్మద, డొమెస్టిక్ వయొలెన్స్ సెంటర్(డీవీసీ), కౌన్సిలర్
ఇతరులతో పోల్చుకో కూడదు
ఆడమగా ఒకరి గురించి మరొకరి గుణగణాలు పూర్తిగా తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఈ కారణంగా మన ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. ఏ ఒక్కరూ 100 శాతం మంచిగా ఉండరు. ఏ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు ఒకే విధంగా ఉండవు. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. మనది ఇంకా మగవారిదే ఆర్థిక పెత్తనం ఉంటోంది. ఇద్దరూ సంపాదిస్తుంటే ఆడవారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. ఇతరులతో పోలికలు లేకుండా చూడాలి. – డాక్టర్ కె. నాగిరెడ్డి, మానసిక వ్యాధి నిపుణులు, కర్నూలు
పచ్చని సంసారానికి మార్గాలు
⇔ భాగస్వాముల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు.
⇔ చిన్న విషయాలకే ఒకరినొకరు అనుమానించకూడదు.
⇔ అసూయ పడేలా వ్యవహరించొద్దు.
⇔ అభద్రతా భావన కలిగించరాదు.
⇔ నిత్యం మీ చుట్టూనే తిరగాలని కోరుకోకూడదు.
⇔ ఇతరుల మధ్య చులకన భావంగా మాట్లాడకూడదు.
⇔ ఆర్థిక విషయాల్లో ఇద్దరి మధ్య దాపరికాలు వద్దు
⇔ పరస్పరం భాగస్వామికి ప్రేమ, గౌరవం ఇవ్వాలి.
⇔ సంసార బాధ్యతలు పంచుకోవాలి.
⇔ ఏ విషయంలోనైనా చర్చించడానికి, రాజీ పడడానికి అవకాశం ఇవ్వాలి.
⇔ వ్యక్తిగత, వృత్తి గత జీవితాన్ని సమన్వయ పరచుకోవాలి.
⇔ చిన్న చిన్న త్యాగాలు చేయాలి.
⇔ ఇద్దరి మధ్య అంతా పారదర్శకత ఉండాలి.
⇔ ఇద్దరి అనుబంధానికే కాక వారితో ముడిపడిన అన్ని బంధాలకు సమయాన్ని కేటాయించుకోవాలి.
మేనరికాల్లో మనమే టాప్
మేనరికపు వివాహాలు జిల్లాలో అధికంగా జరుగుతున్నాయి. కొత్త సంబంధాల కన్నా తెలిసిన వారికి ఇచ్చి పెళ్లి చేయడమే శ్రేయస్కరమని భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేవలం గ్రామీణులే గాక పట్టణాల్లో నివసించే విద్యావంతులు సైతం మేనరికాలకే ముందుగా ఓటు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య నిర్వహించిన సర్వేలో మేనరికపు వివాహాలు చేసుకునే రాష్ట్రాల్లో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నట్లు తేల్చింది. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని, కర్నూలు డివిజన్లలో మేనరికపు వివాహాలు ఎక్కువే. 32 శాతం మేనరికపు వివాహాలు జరుగుతున్నట్లు ఆ సర్వేలో పేర్కొంది. దీనికితోడు ఈ ప్రాంతంలో బాల్య వివాహాలు కూడా ఎక్కువే. కనీసం అమ్మాయిని డిగ్రీ దాకా చదివిస్తే భవిష్యత్‌లో ఆమె కాళ్లపై ఆమె నిలబడుతుందన్న ఆలోచన కూడా చాలా మందికి ఉండటం లేదు. బయటకు పంపించాలంటే భయం, ప్రేమ వ్యవహారాలతో పరువు పోతుందనే ఆందోళన బాల్య వివాహాల వైపు అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment