![Fornications And Divorce Hikes In Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/11/divorce.jpg.webp?itok=DRsx5faR)
కర్నూలు నగరానికి చెందిన ఆనంద్ మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. భార్యాబిడ్డలను అడ్డుతొలగించుకునేందుకు గత మంగళవారం వారిద్దరినీ గొంతునులిమి చంపేశాడు.
కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన భార్య ఎస్తేరిపై అనుమానంతో భర్త కృష్ణ కత్తితో గొంతు కోసి, ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
డోన్ సమీపంలో ఈ నెల ఒకటో తేదీన భార్యపై అనుమానంతో ఆమె భర్త తన 9 నెలల కుమారుడు గణేష్‌ను చంపి, మరుసటిరోజు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ నెలలో జరిగిన ఘటనలు ఇవి.
కర్నూలు(హాస్పిటల్): ఇటీవల కాలంలో జిల్లాలో వివాహేతర సంబంధాల వల్ల హత్య, ఆత్మహత్య ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మంటగలుస్తున్న మానవ సంబంధాలకు ఇవి మాయని మచ్చగా నిలుస్తున్నాయి. ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్లలో మూడు నుంచి నాలుగు వరకు ఇలాంటి అంశాలపైనే పంచాయితీలు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. భార్యాభర్తలిద్దరికీ సర్దిచెప్పి పంపించడంతోనే అధిక సమయం సరిపోతుందని పలువురు పోలీసులు చెబుతున్నారు.
సన్నగిల్లుతున్న నమ్మకం..
పెళ్లయిన ఏడాదికే భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లుతోంది. ఇద్దరికీ పెళ్లికాకముందు ఇతరులతో పరిచయం, స్నేహం ఉండటం. దాన్ని అలాగే కొనసాగిస్తుండటం, ఆ విషయాన్ని దంపతుల్లో ఏ ఒక్కరూ పెళ్లయిన తర్వాత సహించలేకపోవడం వల్ల ఒకరిపై మరొకొరికి నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ క్రమంలోనే భార్య/భర్త సెల్‌ఫోన్‌లో, బహిరంగ ప్రదేశాల్లో, శుభ కార్యాలయాల్లో కాస్త చనువుగా మాట్లాడినా అనుమానం మరింత బలపడుతోంది. దీనికితోడు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల చెప్పుడు మాటలకు అనుమానం మరింత బలపడుతోంది. అనుమానం పెనుభూతమై హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువే...
గతంలో వినోదం కోసం పార్కులు, సినిమాలకు వెళ్లేవారు. కుటుంబ సభ్యులందరూ వారానికి ఒకసారైనా బయటకు కలిసి వెళ్లేవారు. దీనివల్ల వారి కష్టసుఖాలు పంచుకునేవారు.అన్యోన్యంగా గడిపేవారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు రంగ ప్రవేశం చేశాక మనిషి జీవన గమనమే మారిపోయింది. ఎదురుగా భార్య, స్నేహితులు, బంధువులు ఉన్నా మాట్లాడటం కష్టంగా మారింది. వాట్సాప్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లలో మునిగితేలుతున్నారు. నిత్యం చాటింగ్ చేసుకోవడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటం ద్వారా స్నేహితులు, పరిచయస్తులతో చనువు ఏర్పడుతోంది. ఆ చనువు కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధంగా రూపుదిద్దుకుంటోంది. పర్యవసానంగా కాపురాలు కూలిపోయే పరిస్థితికి దారి తీస్తోంది.
పెడదోవ పట్టిస్తున్న టీవీ సీరియళ్లు...!
ప్రస్తుతం కొన్ని తెలుగుతో పాటు హిందీ సీరియళ్లు మహిళలను పెడదోవ పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ సీరియల్‌లో చూసినా ఒక పురుషుని వెంట ఇద్దరు, ముగ్గురు స్త్రీలు వెంటపడటం, వివాహేతర సంబంధాలు వంటి అంశాలు ఎక్కువగా చూపిస్తున్నారు. ఇలాంటి అంశాల చుట్టే ఈ సీరియళ్లు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. కొంత మంది మహిళలు ఈ సీరియళ్లకు బానిసలుగా మారిపోయారనేది బహిరంగ రహస్యం. వివాహేతర సంబంధాలు పెరగడంలో టీవీ సీరియళ్ల పాత్ర కూడా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఉమ్మడి కుటుంబాలు అంతరించడం వల్లే...!
పాతికేళ్ల క్రితం ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండేవి. భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ తప్పు చేయడానికి భయపడేవారు కాదు. తప్పు చేసినా కుటుంబ పెద్ద దండించేవారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకునేవారు. వివాహేతర సంబంధాలు అప్పట్లో కాస్త తక్కువగానే ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు విడిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎవరి ఆదాయం వారిది. ఎవరి సంసారం వారిది అన్న ధోరణిలో భావిస్తున్నారు. దీనికితోడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే వారి సంఖ్యకూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబాలు అధికమయ్యాయి. చిన్నకుటుంబాల్లో మనస్పర్థలు వస్తే సర్దిచెప్పేవారు కరువయ్యారు. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల్లో ఘర్షణ వాతావరణం దారి తీస్తోంది. దంపతుల మధ్య ఎడబాటు సైతం, ఆర్థిక అవసరాలు, కోరికలు, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన వివాహేతర సంబంధాలకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలి
సమాజంలో ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడుతున్నారు. మనిషికి కోరికలు ఎక్కువై, డబ్బుల కోసం వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి, దీనికితోడు బిజీ లైఫ్ కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోకపోవడం లేదు. ప్రస్తుతం క్యారెక్టర్(గుణం)కు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ కారణంగా వివాహేతర సంబంధాలు తప్పుకాదని భావించే వారు ఎక్కువయ్యారు. దీనికితోడు సామాజిక మాధ్యమాలు, టీవీ సీరియళ్లు చెడుదోవ పట్టిస్తున్నాయి. కొంత మంది మాత్రం డబ్బు కోసమే సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. గుణానికి ప్రాధాన్యత ఇచ్చే రోజులు రావాలి. ప్రతి ఒక్కరికీ ఉన్నంతలో సంతృప్తి ప్రధానం. బిజీ తగ్గించుకుని ప్రేమాభిమానాలు పెంచుకోవాలి. ఎడబాటుతనం తగ్గించుకోవాలి. –సిరిగిరెడ్డి జయరెడ్డి,సైకాలజిస్టు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment