లక్ష్మి (ఫైల్)
కర్నూలు, బేతంచెర్ల: మరిది చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని అంబాపురంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. అంబాపురం గ్రామానికి చెందిన గుండుపాపల మద్దయ్య కుమారుడు మహేంద్రకు, ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన బోయ బాలస్వామి కుమార్తె లక్ష్మి(22)ని ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి హేమనాథ్ (4), చంద్రిక (2) సంతానం. కొంతకాలంగా లక్ష్మి వరుసకు మరిది అయిన లారీ క్లీనర్ మనోజ్(భర్త చిన్నాన్న కుమారుడు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇటీవల మరికొంతమందితోనూ చనువుగా ఉండటంతో మనోజ్ కోపోద్రిక్తుడయ్యాడు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి పిలిపించుకొని.. పిచ్చపాటిగా మాట్లాడి రాత్రి లక్ష్మి మెడకు చీరతో ఉరి వేసి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు. లక్ష్మి ఇంటికి రాకపోవడంతో భర్త గ్రామంలో గాలించి చివరకు వరుసకు తమ్ముడు అయిన మనోజ్ ఇంటి వద్దకు వెళ్లి తాళాలు పగుల గొట్టి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. పక్క గదిలో మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కనిపించాయి. గ్రామస్తుల సమాచారంతో సీఐ ఓబులేసు, ఎస్‌ఐ మస్తాన్‌వలి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment