ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఆస్పరి(కర్నూలు): బావను సొంత బామ్మర్దులు హత్య చేసిన ఘటన వెంగళాయిదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పర సుంకన్న (39) అదే గ్రామానికి చెందిన నారాయణమ్మను 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం చేసేవారు. కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో వారం క్రితం నారాయణమ్మ పుట్టినింటికి వెళ్లింది.
ఈ నెల 7న భార్యను పిలవడానికి సుంకన్న అత్తింటికి వెళ్లగా.. బామ్మర్దులు రామాంజనేయులు, రమేష్ దాడి చేశారు. ఆదోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత ఈనెల 10వ తేదీ బుధవారం రాత్రి సుంకన్న మళ్లీ భార్యను కాపురానికి పంపమని అత్తింటికి వెళ్లాడు. బామ్మర్దులు ఇద్దరూ.. సుంకన్నను మాట్లాడాలని పిలుచుకొని సుంకులమ్మ ఆలయం వెనుక ఉన్న మేకల బండ దగ్గరకు తీసుకెళ్లారు.
అక్కడ తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి బండి గూటంతో కొడుతూ, కొడవలితో నరకడంతో సుంకన్న అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ ఈశ్వరయ్య గురువారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment