రూతమ్మ మృతదేహం, హతురాలి తమ్ముడిని విచారిస్తున్న డీఎస్పీ మాధవరెడ్డి భర్త మత్తేష్‌తో రూతమ్మ(ఫైల్)
పగిడ్యాల: భర్తే తన సర్వస్వమని, పుట్టినిల్లు శాశ్వతం కాదని తల్లిదండ్రులతో విభేదించి అత్తారింటికి వచ్చిన ఓ మహిళ భర్త అనుమాన భూతానికి బలైపోయిన సంఘటన పడమర వనుములపాడులో గురువారం చోటుచేసుకుంది. హతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లె మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన చిన్నయ్య, చంద్రకళ దంపతుల చిన్నకుమార్తె రూతమ్మ(30)ను పడమర వనుములపాడుకు చెందిన దీవెనమ్మ, ఏసన్నల కుమారుడైన మత్తేష్ అలియాస్ శేఖర్‌కు ఇచ్చి 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త టిప్పర్ డ్రైవర్‌గా, భార్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కొంతకాలంగా భర్త భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని వేధిస్తుండేవాడు.
మూడు రోజుల క్రితం చంపుతానని వెంటపడి కొట్టడంతో ఆమెను పుట్టింటి వారు వారి గ్రామానికి తీసుకెళ్లారు. అయితే ఆమె తాను లేకపోతే తన పిల్లలు అనాథలవుతారని, కొట్టినా చంపినా భర్త వద్దకే వెళతానని ఆమె పట్టుబట్టింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం ఆమె వెంట తమ్ముడు లోకేష్‌ను పంపారు. తెల్లవారుజామున దాదాపు 1.30 సమయంలో భర్త, అత్త దీవెనమ్మ, ఆడపడుచు భర్త దివాకర్ పథకం ప్రకారం రూతమ్మ గొంతుకోసి చంపారు. ఘటనను చూసిన లోకేష్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ముచ్చుమర్రి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు.
ఘటన స్థలం పరిశీలన..
ఘటన స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ మాదవరెడ్డి, నందికొట్కూరు సీఐ వెంకటరమణ మధ్యాహ్నం పరిశీలించారు. హతురాలి తమ్ముడు లోకేష్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఇదిలా ఉండగా హతురాలి భర్త, అత్త, మామ ఏసన్న, ఆడపడుచు భర్త, ముగ్గురు పిల్లలను తీసుకుని పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment