భార్య, కుమార్తెను హతమార్చి.. కిరాతకం..! | Husband Assassinated Wife And Child in Prakasam | Sakshi
Sakshi News home page

కిరాతకం..!

Published Tue, Aug 18 2020 12:47 PM | Last Updated on Fri, Jul 30 2021 11:24 AM

Husband Assassinated Wife And Child in Prakasam - Sakshi

మృతులు రేష్మ, సమీర(ఫైల్‌) నిందితుడు ముసలయ్య

ప్రకాశం,యర్రగొండపాలెం: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను, కన్న కూతురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన యర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం జరిగింది. ఈ హత్యలు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమాచారం అందింది. స్థానిక ఒక ప్రైవేట్‌ డెయిరీలో పాలపట్టే వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న కె.ముసలయ్య తన భార్య రేష్మ(21), కుమార్తె సమీర(3)లను హత్యచేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు చీర కట్టి ఉరివేసుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ముందుగా కుక్కర్‌ ప్లగ్‌ తీగతో గొంతుకు బిగించి హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. హత్య చేసిన తరువాత రేష్మ ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసి రక్తపు మరకలు కింద పడకుండా జాగ్రత్త పడినట్లు వారు ఆరోపించారు.  (భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం)

ఆడపిల్ల పుట్టిందని వేధించేవాడు.. 
కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లెకు చెందిన రేష్మను పుల్లలచెరువుకు చెందిన కె.ముసలయ్యకు ఇచ్చి 2016లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.80 వేలు, ఆ తర్వాత రూ.20 వేలు ఇచ్చామని మృతురాలి తండ్రి డి.హుస్సేనయ్య తెలిపాడు. వివాహం జరిగిన ఏడాదిన్నర తరువాత ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి తన కూతురిని తీవ్రంగా వేధించేవాడని మృతురాలి తల్లి జరీనా వాపోయింది. నిత్యం తాగివచ్చి గొడవ పడుతుండేవాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా కాపురం చేసుకుంటుందని ఆమె తెలిపింది.

అయితే ముసలయ్య అక్రమ సంబంధం గురించి అడిగినందుకు రేష్మను అతికిరాతకంగా హత్యచేశాడని, అడ్డువస్తుందని ముక్కుపచ్చలారని పసికందును కూడా గొంతుకు తీగబిగించి హత్య చేశాడని వాపోయింది. మీ కుమార్తె గొడవ పడుతుందని ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముసలయ్య ఫోను చేశాడని, అందుకు తాను సర్ది చెప్పినట్లు మృతురాలి తండ్రి హుసేనయ్య తెలిపాడు. కాసేపు ఆగిన తరువాత నా కుమార్తె రేష్మకు ఫోను చేసి మాట్లాడానని, మాట్లాడుతున్న సమయంలో అర్థంతరంగా ఆగి పోయిందని ఆయన తెలిపాడు. రాత్రి 10గంటలు దాటిన తరువాత నీ కుమార్తె ఉరివేసుకొని మరణించిందని ఫోను ద్వారా తెలిపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల నుంచి కేకలు వినిపిస్తున్నాయని, భార్యభర్తలు గొడవ పడుతున్నారని తాము అనుకున్నామని పరిసర ప్రాంతాలకు చెందిన వారు తెలిపారు. 

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ  
తల్లి, కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హుటాహుటిన యర్రగొండపాలెం చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురయిన రేష్మ తల్లిదండ్రులు, బంధువులను ఆయన విచారించారు. తహసీల్దార్‌ కె.నెహ్రూబాబు శవ పంచనామా కార్యక్రమాలను చేయించారు. ఈ కేసును సీఐ పి.దేవప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఎస్సై పి.ముక్కంటి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement