ఈరన్న హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
కొత్త వ్యక్తిని నియమించేందుకు రూ.3 లక్షలు తీసుకున్న టీడీపీ నేత
ఉద్యోగం వదిలేయాలని రెండు నెలలుగా ఈరన్నకు వేధింపులు
చివరకు హత్యకు తెగించిన డబ్బులిచ్చిన వ్యక్తి
ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జిలు లంచాలు తీసుకుని పోస్టులు వేయిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపణ
సాక్షి ప్రతినిధి కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉద్యోగులను మార్చడంలో భాగంగానే ఈరన్న హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆశించి నియోజకవర్గ టీడీపీ కీలక నేతకు డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను హత్య చేసినట్టు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌గా 2019 నుంచి ఈరన్న కొనసాగుతున్నాడు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్‌గా తప్పించాలని టీడీపీ నేతలు భావించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరు ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ దుకాణాలతో పాటు ఇతర పోస్టుల్లో లంచాలు తీసుకుని నియమింపచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నియోజకవర్గ నేతకు రూ.3 లక్షలు లంచమిచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో తనను నియమించాలని కోరాడు. దీంతో ఆ నేత ఈరన్నను తప్పుకోవాలని రెండు నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించేలా గ్రామస్తులు, పంచాయతీ తీర్మానం చేసినట్టు సర్పంచ్ లేఖ ఇవ్వాలి.
కాగా.. గ్రామ సర్పంచ్ నాగరాజుకు, నియోజకవర్గ టీడీపీ నేత మధ్య విభేదాలున్నాయి. దీంతో సర్పంచ్ లేఖ ఇవ్వలేదు. టీడీపీ కీలక నేత ఈరన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను మట్టుపెడితే తప్ప తనకు పోస్టు రాదని భావించి అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మరోవైపు రాజీనామాకు సిద్ధపడిన ఈరన్నకు ఈ నెలాఖరు వరకూ విధులు నిర్వర్తిస్తేనే జనవరి వేతనం వస్తుందని అధికారులు చెప్పారు.
దీంతో నెలాఖరు వరకూ పనిచేసి రాజీనామా చేయాలని ఈరన్న నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉపాధి హామీ పనుల నుంచి వస్తున్న ఈరన్నను కొందరు దారిలో ఆపి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా హత్య చేశారు. ఈరన్నను గ్రామానికి చెందిన గాదె లింగప్ప, గోవర్ధన్, గోపి, రామదాసు మరికొందరు కలిసి హతమార్చారని ఈరన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లంచాలు తీసుకుని పోస్టుల్లో నియామకం
టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లంచాలు తీసుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఈ నెల 18న ఆరోపణలు చేశారు. ఇది జరిగిన వారానికే లంచాలతో పోస్టు మార్పునకు సిద్ధపడిన టీడీపీ నేత వల్ల హత్య జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పి.కోటకొండ ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చి మరొకరిని నియమించేందుకు నియోజకవర్గ కీలక నేత రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేందుకు లేఖలు ఇవ్వగా.. ఇప్పటివరకు 11 మందిని మార్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment