- ‘పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి’ కథనంపై కర్నూలు జిల్లా ఉలిందకొండ స్టేషన్‌లో కేసు నమోదు
- ఇతర మీడియాలోనూ అవే కథనాలు వచ్చినా ‘సాక్షి’పైనే కేసు
- జిల్లా పోలీసు అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారనే ఉదంతంపై ‘పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనివల్ల పోలీసుల ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ ‘సాక్షి’ కర్నూలు విలేకరి బోయ శ్రీనివాసులుపై ఉలిందకొండ పోలీసు స్టేషన్‌లో సెక్షన్ 196/2024,యూ, సెక్షన్ 32, 308(3), 353(1)బీ, 356 రెడ్‌విత్ 61(2), బీఎన్‌ఎస్‌గా నమోదు చేశారు.
కర్నూలు త్రీటౌన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు జిల్లా అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ఆయన్ను తీసుకురాలేదని, ఈ నెల 17న కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ ఘటనకు సంబంధించిన కేసులో నిందితుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, ఆయన సోదరుడిని విచారించి పంపించామని తెలిపారు.
ఇతర మీడియాలోనూ వచ్చినా ‘సాక్షి’పైనే కేసు..
భూ వివాదానికి సంబంధించి మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారనే వ్యవహారంపై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, టీవీలు కూడా కథనాలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ‘బాస్.. సివిల్ పంచాయతీ’ పేరుతో ఈనాడు కూడా కథనాన్ని ప్రచురించింది. అందులో రాయలసీమ పోలీస్‌బాస్ అని పేర్కొంది. కిడ్నాప్‌నకు గురైన మునీర్ అహ్మద్ ‘సాక్షి’తో పాటు ఇతర మీడియా చానళ్లతోనూ మాట్లాడారు. అందులో పోలీసులు తనను తీసుకెళ్లిన విధానం, భూ వివాదానికి సంబంధించి గతంలో సీఐ, డీఐజీ కోయ ప్రవీణ్ తనను పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పిన విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఆయన భార్య కూడా భూ వివాదంపై మాట్లాడారు. మునీర్ అహ్మద్ ఆయన భార్య తెలిపిన వివరాల మేరకే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సాక్షిలో ప్రచురించిన ప్రతీ అక్షరం బాధితులైన మునీర్ అహ్మద్ దంపతులు చెప్పిన విషయాలే! వీటినే మిగిలిన వారూ ప్రచురించినా, ప్రసారం చేసినా.. ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment