చిత్తూరు అర్బన్: పుట్టబోయేది ఆడబిడ్డ అని తేలితే కడుపులోనే కడతేరుస్తున్నారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే కాసుల కక్కుర్తితో ఈ దుష్టసంస్కృతికి తెరలేపారు. తాజాగా చిత్తూరు నగరంలోని ఓ ఆస్పత్రిలో జరుగుతున్న భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షల గుట్టురట్టయ్యింది. అధికారులు గురువారం ఆ ఆస్పత్రిపై దాడి చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ స్వర్ణ విజయగౌరి మీడియాకు వెల్లడించారు.
చిత్తూరు నగరంలో ఉన్న నాయుడు బిల్డింగ్స్‌లోని శివప్రకాశ్ నర్సింగ్ హోమ్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంలో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయంటూ కేంద్ర నిఘా వ్యవస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. తమిళనాడు నుంచి గర్భిణులను తీసుకొచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని.. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తేలితే ఇంజెక్షన్లు, మందుల ద్వారా కడుపులోనే చిదిమేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జాతీయ లింగ నిర్ధారణ నిరోధక, పర్యవేక్షణ బృందం చిత్తూరుకు చేరుకుంది.
నగరంలోని హైరోడ్డులో ఉన్న మహిళా మధ్యవర్తి వద్దకు ఓ గర్భిణిని తీసుకెళ్లారు. కడుపులో ఉన్నది ఏ మగబిడ్డో, ఆడబిడ్డో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆమెకు చెప్పారు. అయితే ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని చెప్పగా.. ఆ మొత్తాన్ని ఆమెకు అందజేశారు. దీంతో ఆమె సూచనల మేరకు గర్భిణిని ఆటోలో ఎక్కించుకుని శివప్రకాశ్ నర్సింగ్ హోం గైనకాలజిస్టు డాక్టర్ శోభ వద్దకు తీసుకెళ్లారు. రూ.4 వేలు వైద్యురాలికి అందజేసి.. వెయ్యి రూపాయలను మధ్యవర్తి తీసుకుంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్య కెమెరాల్లో చిత్రీకరించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఇంతలో కేంద్ర బృంద సభ్యులు స్థానిక పోలీసుల్ని తీసుకుని ఒక్కసారిగా ఆస్పత్రిపై దాడులు చేసి.. అబార్షన్లు చేయడానికి ఉపయోగించే మాత్రలు, స్కానింగ్ యంత్రాలను, పెద్ద మొత్తంలో పలు రకాల మందుల్ని సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
అత్యధికులు తమిళ వాసులే..
నర్సింగ్ హోంకు తీసుకువస్తున్న వారిలో తమిళనాడు వాసులే అధికంగా ఉన్నారని డీఎంహెచ్‌వో చెప్పారు. శివప్రకాశ్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులతో పాటు వైద్యురాలిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందన్నారు.
కాగా, నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న నవీన్ స్కానింగ్ సెంటర్‌పై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసిన అధికారులు.. అక్కడ పనిచేస్తున్న చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మహిళా డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన పలు ప్రైవేట్ నర్సింగ్ హోం నిర్వాహకులు.. ఆస్పత్రులు మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment