విహారంలో చివరి మజిలీ విషాదం మిగిల్చింది. తిరుగు పయనమైన కాసేపటికే ఓ మలుపు పర్యాటకుల ఆనందాన్ని హరించి వేసింది. ఉన్నట్లుండి బస్సు లోయలో పడిపోవడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. కాపాడండంటూ కేకలు పెద్దపెట్టున వినిపించాయి. చిన్నారులు, మహిళలు చెల్లాచెదురుగా గాయాలతో పడిపోయారు. లోయలో ప్రమాద దృశ్యం అందరి కంట నీరు తెప్పించింది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌లోని షేక్ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10వ తేదీన దినేష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు (టీఎస్09–యూబీ 3729)లో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. గురువారం విశాఖ నగరంలోని వివిధ సందర్శనా ప్రాంతాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా సింహాచలం బయలుదేరారు.
గాయపడ్డ చిన్నారులు
అప్పటివరకు సరదాగా సాగిన ఈ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు–టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది. లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలకు ఉపక్రమించారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు.
బస్సు లోయలో పడింది ఇక్కడే.. (ఫైల్)
క్షతగాత్రులందరినీ 108 వాహనం, ఇతర ప్రైవేట్ వాహనాల్లో హుటాహుటిన ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ వినయ్‌చంద్ వెంటనే స్పందించి కలెక్టరేట్‌లో ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల వివరాలు అందించేందుకు 0891–2590102, 0891–2590100 నంబర్లని అందుబాటులో ఉంచారు. ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావు మూడు అంబులెన్స్‌లను ప్రమాద స్థలికి పంపించారు. క్షతగాత్రుల్ని పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
బస్సు ప్రమాద దృశ్యం.. ఇరుక్కుపోయిన ఓ పర్యాటకుడు
కరోనా కాలంలో బయటికి వెళ్లలేదని..
వేసవి కాలంలో ఎక్కడికైనా విహారానికి వెళ్లడం సత్యనారాయణ కుటుంబానికి అలవాటు. కరోనా కారణంగా బయటికి వెళ్లలేకపోయిన కుటుంబం.. పరిస్థితులు చక్కబడటంతో విహార యాత్రకు బయలుదేరింది. విజయవాడ, అమరావతి, మంగళగిరి, అన్నవరం దేవాలయాల్ని సందర్శించారు. గురువారం ఉదయం విశాఖలో కొన్ని ప్రాంతాలను సందర్శించి, సింహాచలం వెళ్లారు. దర్శనం కాకపోవడంతో రాత్రి అక్కడే గదులు తీసుకొని బస చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు అరకు బయలుదేరి వెళ్లారు. తిరిగి సింహాచలం వస్తుండగా ప్రమాదం సంభవించింది.
కొండను ఢీకొట్టి ఉంటే?
సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణమై.. శనివారం ఉదయం సింహాచలం దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్ బయలు దేరాలనుకున్నారు. కిందికి వస్తుండగా బ్రేక్ ఫెయిలయ్యింది. ఘాట్ రోడ్డు డౌన్ కావడంతో.. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. కుడివైపునకు బస్సుని తిప్పి ఉంటే.. కొండని ఢీకొట్టి.. బస్సు రోడ్డుపై నిలిచిపోయేది. కానీ.. బస్సును అదుపు చేయలేక, డ్రైవర్ ఎడమవైపు తిప్పడంతో.. ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోయింది. డ్రైవర్ కాస్త అప్రమత్తంగా ఉండుంటే ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఎస్. కోట ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న దృశ్యం
మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుగులో సహాయ కార్యక్రమాలు
చిమ్మ చీకటి.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. ఏం జరిగిందోనని ఆతృత, ఆందోళనలతో సమీప డముకు ప్రాంతానికి చెందిన పాతిక మంది గిరిజనులు ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. పక్కనే ఉన్న బొర్రా మోటర్ యూనిట్ సభ్యులు 20 మంది వచ్చారు. లోయలోకి బస్సు పడిపోయిందని తెలుసుకుని వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. అంతలోనే హుటాహుటిన అరకు సీఐ పైడయ్య, అనంతగిరి ఎస్‌ఐ సుధాకర్ బృందం చేరుకుంది. గిరిజనులు, మోటార్ యూనిట్ సభ్యులు, పర్యాటకులు కొందరు పోలీసులతో కలిసి లోయలోకి దిగారు. సుమారు 80 అడుగుల లోయ.. దట్టమైన పొదలు, చెట్లు.. బస్సు ఎంత లోపలికి వెళ్లిందో కనిపెట్టేందుకే దాదాపు అరగంట సమయం పట్టింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు వింటూ.. ముందుకు అడుగేశారు. మొబైల్స్‌లోని ఫ్లాష్ లైట్స్ వెలుతురుతో బస్సు వద్దకు చేరుకున్నారు.
హైదరాబాద్‌లో... పర్యటనకు బయలుదేరే ముందు...
లోయ అడుగున ఉన్న బస్సులోకి వెళ్లి చూసే క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ముగ్గురు విగతజీవులుగా మారారు. మరో 8 నెలల పసికందు కూడా మృతి చెంది ఉంది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. కాపాడండంటూ మహిళలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడి దృశ్యాలు సహాయక చర్యలకు వెళ్లిన అందర్నీ కంటతడి పెట్టించాయి. పై నుంచి కార్లు, వ్యాన్ల లైట్లు ఫోకస్ చేశారు. పర్యాటకులు మొబైల్‌లోని ఫ్లాష్‌లైట్స్ ఆన్ చేసి ఉంచగా.. క్షతగాత్రులు ఒక్కొక్కర్నీ నలుగురైదుగురు గిరిజనులు కలిసి మోసుకుంటూ పైకి తీసుకొచ్చారు. ఒక 108 వాహనం రాగా.. అందులో కొందర్ని ఎక్కించి ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు తమ ప్రైవేటు వాహనాల్ని సిద్ధం చేశారు. పైకి మోసుకొచ్చిన క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. యుద్ధ ప్రాతిపదికన పోలీసులు సహాయక చర్యలు వేగవంతంతో చాలా మందిని కాపాడారు.
రాత్రి అక్కడే ఉందామనుకున్నాం కానీ..
మా నాన్న రిజర్వ్ బ్యాంకు ఉద్యోగిగా ఇటీవలే రిటైర్ అయ్యారు. మా కుటుంబసభ్యులంతా ఈ నెల 10న హైదరాబాద్ నుంచి బయల్దేరాం. విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకుని అమరావతి, మంగళగిరి పానకాల నరసింహాస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాం. ఆ తర్వాత అరకుకు వెళ్లాం. రాత్రి అరకులోనే ఉందామనుకున్నాం. కానీ సింహాచలం వెళ్లిపోదామని డ్రైవర్ చెప్పటంతో బయల్దేరాం. ఘాట్‌రోడ్డు దిగుతుండగా బ్రేకులు ఫెయిల్ కావటంతో బస్సు లోయలో పడింది.
– క్షతగాత్రుడు కె.నరేశ్‌కుమార్
డ్రైవింగ్ సరిగ్గా రాని వ్యక్తిని పంపారు..
ట్రావెల్స్ యాజమాన్యం డ్రైవింగ్ సరిగా రాని వ్యక్తిని ఈ విహారయాత్రకు పంపించారు. డ్రైవర్‌కి ఘాట్ రోడ్డులో బస్సు నడపటం సరిగ్గా రాని విషయాన్ని కూడా చెప్పలేదు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు తక్కువ వేగంతోనే వెళ్తోంది. మేమంతా గట్టిగా కేకలు వేస్తూ కుడివైపు కొండకు ఢీ కొట్టాలని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎడమ వైపు దూసుకెళ్లి లోయలో పడింది. – అనిత, క్షతగాత్రురాలు
ఎత్తుకుని వచ్చాం..
బస్సు లోయలో పడిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. ఐదుగురు సభ్యులు బృందంగా ఏర్పడి, నలుగురిని కాపాడాం. డముకు స్థానికులు యువకులు, బొర్రా మోటర్ సభ్యులు చాలా కష్టపడ్డారు.
– కొర్రా అభిమాన్యం.. బొర్రా మోటర్‌ఫిల్డ్
లోయలో పడిన వెంటనే వెళ్లాం
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సంఘటన స్థలానికి చేరుకున్నాం. క్షతగాత్రులను లోయ నుంచి స్థానికులతో కలసి మోసుకుని వచ్చాం. ఆపదలో ఆదుకోవాలని ముందుకు వెళ్లాం. ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్షతగాత్రులను చూసి బాధ అనిపించింది. చాలామంది ముందుకు వచ్చి సాయం చేశారు.
– కె.కనకబాబు బొర్రా పంచాయతీ కార్యదర్శి
అరకు ఘటనపై ప్రధాని, గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: అరకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రయాణికులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎస్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. కాగా, బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రమాద సంఘటనపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాసు, ఎస్పీ కృష్ణతో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ప్రయాణికుల ఇళ్లకు అధికారులను పంపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను సీఎస్ ఆదేశించారు.
ఏపీ గవర్నర్, సీఎం విచారం..
సాక్షి, అమరావతి: అరకు బస్సు ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారం
సాక్షి, హైదరాబాద్: అరకు బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తక్షణ సహాయక చర్యలు అందించాలని ఏపీ అధికారులను ఆయన కోరారు.
అరకు మృతులకు కేటీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: అరకు బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్నివిధాలా సాయం అందించాల్సిందిగా ఏపీ అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ కూడా అరకు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment