'బేటీ బచావో' ఐడియా కేంద్రానిది కాదు.. నాది!
ఉదయ్ పూర్: దేశంలో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు, ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పించాలని ప్రారంభించిన 'బేటీ బచావో బేటీ పడావో' పథకం టైటిల్ తనదని, కేంద్రం తన అనుమతి లేకుండా దాన్ని ఉపయోగించుకుంటోందని ఓ మహిళా పోలీసు ఆరోపించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కేంద్రానికి ఈ టైటిల్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఉదయ్ పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన భాతి తెలిపారు. ఆర్టీఐ ఇచ్చిన వివరాలు సంతృప్తికరంగా లేవని, అందుకే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో' టైటిల్ తన క్రియేటివిటీ అని, తనను టైటిల్ రూపకర్తగా గుర్తించాలంటూ లేఖలో రాసినట్లు వివరించారు.
చరిత్ర, ఇంగ్లీష్ లలో పీజీ పూర్తిచేసిన భాతి మొదట్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం మీద ఆసక్తితో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 20ఏళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. 1999లో తొలిసారి 'బేటీ బచావో బేటీ పడావో'ను పొయెట్రీకి వాడానని, ఆ తర్వాత 2005లో ఓ కార్యక్రమంలో చెప్పినట్లు ఆమె తెలిపారు. పబ్లిసిటీ కోసమో, డబ్బు కోసమో ఈ పని చేయడం లేదని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలకు పంపిన ఆర్టీఐ సమాధానాలు సరిగా లేవని చెప్పారు.
బాలికల సంరక్షణ, అబార్షన్లపై తాను కొన్ని రచనలు చేశానని, రాష్ట్రంలో బాలికల సంరక్షణకు సంబంధించి కొన్ని పోస్టర్లను తయారుచేసి 2002లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు మెయిల్ కూడా చేశానని, కానీ వాటికి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. ప్రధానమంత్రి తన వినతిని పరిశీలించి సమాధానం ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యను పెంచేందుకు 'బేటీ బచావో బేటీ పడావో' పథకాన్ని హర్యానాలో ప్రారంభించారు.