సాక్షి, శ్రీనగర్ : ఆడపిల్లల మనుగడ, రక్షణ మరియు సాధికారత నిర్ధారించడానికి.. సమన్వయం అభిసరణ ప్రయత్నాలు అవసరం ఉందని భావించిన ప్రభుత్వం బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఎంపిక చేసిన సుమారు 100కు పైగా జిల్లాల్లో వీటిపై విస్తృతంగా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఈ కార్యక్రమం కోసం వెలసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది.
కశ్మీర్ వేర్పాటు వాద నేత అషియా అంద్రబి ఫోటోను బ్యానర్‌లో పొందుపరచటంతో అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. కోకర్‌నాగ్ పట్టణంలో ఈ ఫ్లెక్సీని అధికారులు కట్టారు. ఇందులో ప్రధాని ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, కల్పనా చావ్లా, సానియా మీర్జా, కిరణ్ బేడీ తదితరులతోపాటు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే అందులో అంద్రబి ఫోటో కూడా ఉంది. ప్రభావవంతమైన మహిళల ఫోటోల నడుమ ఆమె ఫోటో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
దక్తరన్-ఇ-మిలాత్ చీఫ్ అయిన అంద్రబి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కశ్మీర్ వేర్పాటు వాద నాయకురాలిగా ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. పాక్ ముఖ్యదినాల్లో ఆ దేశ జెండాను మన దగ్గర ఎగరవేసిందన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఫ్లెక్సీలో ఆమె ఫోటో వ్యవహారంపై బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ సెథీ స్పందించారు. ఇప్పటికే ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయగా.. దర్యాప్తనకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment