సాక్షి, రంగారెడ్డి జిల్లా:ఆడబిడ్డకు ఇక అందలం వేయనున్నారు. కంటికి రెప్పలా కాపాడి ఉన్నత చదువులు చెప్పించే బృహత్తర క్రతువుకు నాంది పడనుంది. ఆడ శిశువుని గర్భంలోనే ప్రాణాలు తీస్తున్న అమానవీయ సంఘటనలకు ఇక చరమగీతం పాడేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. బాలికను సంరక్షించు.. బాలికను చదివించు(బేటీ బచావో–బేటీ పడావో) కార్యక్రమం అమలుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిక కావడమే దీనికి ప్రధాన కారణం. ఈనేపథ్యంలో ఆడబిడ్డలకు ఇంక మంచిరోజులు వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నారుల లింగ నిష్పత్తి (సీఎస్‌ఆర్)లో జిల్లా అథమ స్థాయిలో ఉంది. జాతీయ సగటు కంటే కూడా వెనకబడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో జిల్లాను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. 2018–19 ఏడాది నుంచి బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ విభాగాలు పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే చిన్నారుల లింగ నిష్పత్తి మెరుగుపడనుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం చిన్నారుల లింగ నిష్పత్తిలో కనీసం రెండు శాతం మెరుగుదల రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పథకం ఉద్దేశం ఇదీ..
ఆడపిల్ల అంటే.. సమాజంలో ఇంకా చిన్నచూపు, వివక్ష కొనసాగుతోంది. మహానగరానికి చుట్టూ మన జిల్లా విస్తరించి ఉన్నా బాలికల పట్ల అసమానతలు ఇంకా తొలగడం లేదు. గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తేలగానే పిండాన్ని ఛిద్రంచేస్తున్న సంఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి హీనమైన చర్యల వల్ల జిల్లాలో ఏటా చిన్నారుల లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం నమోదవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు గాను.. 933 మంది అమ్మాయిలే ఉన్నారు. గత 18 ఏళ్ల కిందటే కాస్త మెరుగైన నిష్పత్తిలో చిన్నారులు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2001లో 1000:959 ఉండగా 2011 వచ్చేసరికి 1000:933కు పడిపోవడం ఆడశిశువులకు సమాజం ఏమాత్రం గౌరవం ఇస్తోందో ఇట్టే తెలుసుకోవచ్చు. బేటీ బచావో.. బేటా పడావో పథకం ద్వారా లింగ వివక్షను సమూలంగా రూపుమాపడం ప్రధాన ఉద్దేశం. అంతేగాకుండా తల్లి గర్భం నుంచి భూమిపై అడుగు పెట్టిన ప్రతి ఆడ శిశువును స్వేచ్ఛగా బతకనివ్వడంతోపాటు సంరక్షణకు పెద్దపీట వేస్తారు. ఉన్నత విద్య అందించి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి పురుషులతో సమానంగా తీర్చిదిద్దడం అంతిమ లక్ష్యం.
అమలు ఇలా..
తల్లి గర్భంలోనే ఆడపిల్లల ఉసురు తీయడానికి ప్రధాన కారణం స్కానింగ్ కేంద్రాలే అనేది నగ్న సత్యం. కొన్ని ప్రాంతాల్లో పీసీ–పీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల్ని యథేచ్ఛగా చేస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తేలగానే ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో.. తొలుత స్కానింగ్ కేంద్రాలపై యంత్రాంగం నిఘా పెట్టాలని యంత్రాంగం నిర్ణయిచింది. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తనిఖీ చేయడం ద్వారా కొంత మేరకు గర్భస్థ లింగ నిర్ధారణను నియంత్రించవచ్చని భావిస్తోంది. పుట్టిన తర్వాత కూడా ఆడబిడ్డలపై వివక్షనూ దూరం చేయడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యువతీయువకులు, నవ దంపతులు, గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులను వివిధ కార్యక్రమాల ద్వారా చైతన్యపర్చనున్నారు. అలాగే వైద్యులు, మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంల భాగస్వామ్యం తీసుకోనున్నారు. తద్వారా ఆడపిల్లల నిష్పత్తి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment