ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు
దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు
రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
2017లో చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళ్లి చిన్నారిపై హత్యాచారం చేసిన దినేశ్
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేశ్‌కు ఉరిశిక్షే సబబని చెప్పింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడు దినేశ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దోషిగా తేల్చింది.
ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై దినేశ్ హైకోర్టులో సవాల్ చేయగా, ట్రయల్ కోర్టు నిర్ణయం సబబేనంటూ.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడితేనే.. బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పింది. దినేశ్ అప్పీల్‌పై జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడు విచారణ చేపట్టారు.
కేసు పూర్వాపరాలు...
హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో కలిసిమెలిసి ఉండేవాడు. 2017, డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బండరాయితో మోది హత్య చేశాడు.
నేరం అంగీకరించిన నిందితుడు
చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారి చివరిసారిగా దినేశ్‌తో కనిపించిందనే ఆధారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. దినేశ్‌ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసులో వేగంగా విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021, ఫిబ్రవ రిలో దినేశ్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది.
తలారి లేడు.. ఉరి కంబమూ లేదు..
రాష్ట్రంలోని జైళ్లలో ఎక్కడా నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తలారి లేడు.. కంబమూ లేదు. రాష్ట్ర పరిధిలో ఉరిశిక్ష అమలు జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉరి తీసేందుకు వీలు ఉండేది. అయితే ముషీరాబాద్ జైలు తీసేసిన తర్వాత ఉరి అమలు చేసే వీలు లేకుండాపోయింది. చర్లపల్లిలో స్థలం ఉన్నా.. నిర్మాణం చేపట్టలేదు. అలాగే తలారి కావాల్సి వస్తే ఇతర ప్రాంతాల నుంచో లేదా ఇక్కడే ఎవరన్నా ముందుకొస్తే వారికి శిక్షణ ఇప్పించో అమలు చేయాల్సిన పరిస్థితి. దినేశ్‌కు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.
‘అమానుషమైన దారుణాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇలాంటి మరణ శిక్షల ద్వారా తెలియజేయాలి. అయితే, మరణశిక్షపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరణశిక్షకు బదులుగా మారేందుకు అవకాశం ఇచ్చేలా జీవితఖైదు విధిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారు బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తమ ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు మొదటిసారిగా ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూసినప్పుడు ఎంత విలవిలలాడిపోయారో ఎవరికీ తెలియదు. చిన్నారి తలపై బండరాళ్లతో కొట్టారు. నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా ఆ దృశ్యం తల్లిదండ్రుల మదిలో మెదులుతూనే ఉంటుంది’ –హైకోర్టు ధర్మాసనం
Comments
Please login to add a commentAdd a comment